1. ప్రభుత్వ వ్యతిరేకత–బైడెన్ అసమర్థత
జో బైడెన్ నాలుగేళ్ల పాలనలో డెమొక్రాట్లపై అమెరికా అంతటా తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత నెలకొంది. ఆర్థిక వ్యవస్థను అదుపు పెట్టడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యారన్న అపప్రథను మూటగట్టుకున్నారు. అన్ని అంశాలపైనా ఆయన విధానాలపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక బైడెన్ విదేశీ విధానం కూడా విమర్శలపాలైంది. ముఖ్యంగా ఉక్రెయిన్, గాజా యుద్ధాలను నివారించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఆ పార్టీ అభ్యర్థిగా ఇవన్నీ హారిస్‌కు ప్రతికూలంగానే మారాయి. విదేశీ విధానంపై ఆమె వాదన అమెరికన్లను పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ విషయంలో ట్రంప్‌తో పోలిస్తే బాగా మెతక అన్న అభిప్రాయం ఆమెకు బాగా చేటు చేసింది. పలు కీలకాంశాలపై తన వైఖరి చెప్పకుండా దాటవేయడం కూడా ప్రతికూలంగా మారింది.
నిజానికి హారిస్ ఆలస్యంగా బరిలో దిగినా శాయశక్తులా పోరాడి ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చారు. కానీ అడుగడుగునా బైడెన్ వైఫల్యాల తాలూకు భారాన్ని మోయాల్సి రావడం హారిస్‌కు అతి పెద్ద ప్రతికూలాంశంగా పరిణమించింది. మెజారిటీ అమెరికన్లకు జీవన్మరణ సమస్యగా మారిన ఆర్థిక అవ్యవస్థను గాడిన పెట్టడానికి ఏం చేస్తానన్నది ఆమె సమర్థంగా వివరించలేకపోయారు. ఈ విషయంలో ఆమెకు మొదటినుంచీ పెద్దగా మార్కులు పడలేదు. దీనిపై ప్రతి సర్వేలోనూ ట్రంప్‌దే పైచేయిగా నిలిచింది. ఏకంగా మూడొంతుల మందికి పైగా ప్రభుత్వ విధానాలన్నీ అట్టర్ ఫ్లాప్ అని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలిగా ప్రభుత్వ విధానాల్లో నాలుగేళ్లుగా భాగస్వామి అయిన హారిస్ వాటితో గట్టిగా విభేదించలేకపోయారు. ఇది అంతిమంగా ఆమె కొంప ముంచింది.
2. దన్నుగా నిలవని లాటిన్లు, ఇండియన్లు
లాటిన్, ఇండియన్ అమెరికన్లు సాంప్రదాయికంగా డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా పేరుబడ్డారు. వారిపై హారిస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారిలో ఎక్కువమంది ఈసారి ట్రంప్‌కే ఓటేసినట్టు ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. 2020లో ట్రంప్‌తో పోలిస్తే బైడెన్‌కు ఓటేసిన లాటిన్ అమెరికన్ల సంఖ్య 23 శాతం ఎక్కువని తేలింది. ఈసారి సీన్ రివర్సయింది. లాటిన్ అమెరికన్ల ఓట్లు హారిస్ కంటే ట్రంప్‌కు కనీసం 8 శాతం ఎక్కువగా పడ్డట్టు పోల్ పండితులు అంచనా వేస్తున్నారు! ఇండియన్ అమెరికన్లలో కూడా హారిస్‌కు నిరాశే ఎదురైంది. వారు కొన్నాళ్లుగా రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గుతున్నారు. ముఖ్యంగా యువతలో ట్రంప్‌ను సమర్థించే వారి సంఖ్య బాగా పెరిగింది. పురుషుల్లోనూ ఈ ధోరణి పెరిగినట్టు పలు సర్వేల్లో తేలింది. భారతీయ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్‌ను సమర్థించగా 47 శాతం ట్రంప్‌వైపు మొగ్గారు. కానీ మిగతా అమెరికన్ల మాదిరిగా ధరాభారం, ఉపాధి తదితరాలు భారత సంతతి వారిని కూడా ప్రభావితం చేసినట్టు కన్పిస్తోంది.
3. యువ, స్వతంత్ర, తటస్థ ఓటర్ల మొండిచేయి
2020లో బైడెన్‌కు ఓటేసిన వారితో పోలిస్తే అన్ని రకాల ఓటర్లలోనూ హారిస్‌కు మద్దతు తగ్గింది. కేవలం విద్యాధికులైన యువతుల్లో మాత్రమే ఆమె బైడెన్ కంటే ఎక్కువ ఓట్లు సాధించగలిగారు. యువకులు మాత్రం ట్రంప్‌కే జైకొట్టారు. దాంతో మొత్తంగా 2020లో బైడెన్‌తో పోలిస్తే హారిస్‌కు యువత ఓట్లు తగ్గాయి. తటస్థులు, ఉదారవాదుల ఓట్లను కూడా ఆమె అనుకున్నంతగా సాధించలేకపోయారు. హారిస్ ఎంతగానో ఆశలు పెట్టుకున్న అబార్షన్ హక్కుల అంశం కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ట్రంప్ నియంతృత్వ ధోరణులపై ఆందోళన వెలిబుచ్చడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణను ప్రధానాంశంగా పేర్కొన్న ఓటర్లు హారిస్‌కే భారీగా మద్దతిచ్చారు. కానీ అడ్వాంటేజీని పూర్వపక్షం చేస్తూ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ఆందోళనగా ఉన్నవారంతా ట్రంప్‌కే గుండుగుత్తగా ఓటేశారు.
4. ఆదుకోని పట్టణ ప్రాంతాలు
డెమొక్రాట్లకు దన్నుగా నిలుస్తూ వస్తున్న పట్టణ, శివారు ప్రాంతాల్లో కూడా ఈసారి ట్రెండ్ రివర్సయింది. వాటిలోనూ ట్రంప్ గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించినట్టు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా స్పష్టత వచ్చిన పట్టణ ప్రాంతాల్లో మెజారిటీ చోట్ల 2020లో బైడెన్ సాధించిన ఓట్లతో పోలిస్తే హారిస్ వెనకబడ్డారు. పైగా ఆ తేడా కనీసం ఒకట్రెండు పాయింట్లు, అంతకుమించి నమోదైంది. మిషిగన్ వంటి కీలక స్వింగ్ రాష్ట్రాల్లోనైతే పట్టణ ప్రాంతాల్లో బైడెన్ సాధించిన 14 శాతం ఆధిక్యాన్ని హారిస్ నిలుపుకోలేకపోయారు. ఇది కూడా అంతిమ ఫలితాలపై గట్టి ప్రభావమే చూపింది.
5. సోషల్ మీడియా
ఈసారి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తేల్చడంలో సోషల్ మీడియా కూడా కీలకంగా వ్యవహరించింది. అమెరికా మెయిన్‌స్ట్రీమ్ మీడియా దాదాపుగా హారిస్‌కే దన్నుగా నిలిచింది. కానీ దానికి అమెరికా ప్రజల్లో విశ్వసనీయత అడుగంటి చాలాకాలమైంది. వారు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాకు మళ్లుతున్నారు. ఈ మార్పును ఒడిసిపట్టుకున్న ట్రంప్ సోషల్ మీడియా ప్రచారంలో దూకుడు కనబరిచారు. ముఖ్యంగా ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ బాహాట మద్దతు ఆయనకు బాగా కలిసొచ్చింది. జో రోగన్ వంటి పాడ్‌కాస్టర్లు కూడా ట్రంప్‌కు విస్తృతమైన ప్రచారం కల్పించారు.
అమెరికా జనాభాలో ఎవరెంత మంది?
అమెరికా జనాభా 33 కోట్ల పైచిలుకు
శ్వేతజాతీయులు 58.9 శాతం
హిస్పానియన్లు 19.1 శాతం
ఆఫ్రో అమెరికన్లు 12.6 శాతం
ఆసియన్లు 6.1 శాతం
మిగతా వారు 2.4 శాతం
మూలవాసులు 0.7 శాతం
ఇతరులు 0.2 శాతం
ఓటేసేవారిలో
శ్వేత జాతీయులు 73 శాతం
ఆఫ్రో 11 శాతం
హిస్పానియన్లు 9 శాతం
ఆసియన్లు 2 శాతం
Comments
Please login to add a commentAdd a comment