అంచనాలను మించిన విజయం ఇది. హోరాహోరీ పోరన్న సర్వేల జోస్యాన్ని తలకిందులు చేసిన ఫలితం ఇది. నవంబర్ 5 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటు పాపులర్ ఓటులోనూ, అటు ఎలక్టోరల్ ఓటులోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తిరుగులేని ఆధిక్యం సంపాదించారు. ప్రత్యర్థి, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు అందనంత దూరంలో నిలిచి, అమెరికా 47వ అధ్యక్షుడిగా పీఠం ఖరారు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మరింత సమయం పట్టనున్నప్పటికీ, ఇప్పటికే ఎలక్టోరల్ కాలేజ్‌లో కావాల్సిన 270 సీట్ల మెజారిటీని ఆయన దాటేశారు.
పన్ను తగ్గింపు సహా ప్రజాకర్షక వాగ్దానాలు, కట్టుదిట్టమెన వాణిజ్య షరతుల విధానం, వలసదారులకు అడ్డుకట్ట లాంటి వాటితో అమెరికాను మళ్ళీ అగ్రస్థానానికి తీసుకువెళతానన్న ట్రంప్ మాటలను అమెరికన్లు విశ్వసించారు. అందుకే, గడచిన రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫలితాన్ని హైజాక్ చేశారంటూ గెలిచిన పార్టీపై ఓడిన పార్టీ చేస్తూ వచ్చిన ఆరోపణలకు ఈసారి తావివ్వకుండా అఖండ విజయం అందించారు. ఇక, తమిళనాడుతో బంధమున్న కమల గెలవకున్నా, తెలుగు మూలాలున్న మనమ్మాయి ఉష భర్త జె.డి. వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం భారతీయులకు ఊరట నిచ్చింది.
రెండుసార్లు అభిశంసనకు గురై, అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటూ, ఒక దశలో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికీ అనర్హులవుతారనే ప్రచారం నుంచి పైకి లేచి, 900 పైగా ర్యాలీలతో తమ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టడం ట్రంప్ సృష్టించిన చరిత్ర. అలాగే, ఎప్పుడూ డెమోక్రాటిక్ పార్టీకే మద్దతుగా నిలిచే మైనారిటీ ఓటర్లను పెద్ద సంఖ్యలో ఆకర్షించి, అమెరికా దేశీయ రాజకీ యాల్లో కొత్త రాజకీయ పునరేకీకరణకు ఆయన శ్రీకారం చుట్టారు.
ఎప్పుడూ డెమోక్రాట్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన భారతీయ అమెరికన్లు సైతం ఈసారి ఎక్కువగా రిపబ్లికన్ల వైపే మొగ్గడం విశేషం. పీడిస్తున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం నుంచి ట్రంప్ బయట పడేస్తారనే ప్రజా భావన కలిసొచ్చింది. ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నాల సానుభూతి సరే సరి. ఇలాంటివన్నీ ట్రంప్‌కు అనుకూలించి, కమల అధ్యక్ష పదవి ఆశలను తలకిందులు చేశాయి. ఉదారవాదులు ఎంత వ్యతిరేకించినా విజయం ట్రంప్‌నే వరించింది.
మహిళల అబార్షన్ హక్కుకు అనుకూలంగా కమల నిలబడడంతో స్త్రీలు ఆమెకు బ్రహ్మరథం పడతారని భావించారు. అది కొంతమేర జరిగింది కానీ, అధ్యక్ష పదవి అందుకోవడానికి అదొక్కటే సరిపోలేదు. శ్వేత మహిళల్లో గతంతో పోలిస్తే కమలకు కొంత మద్దతు పెరిగింది. అయితే, ఆఖరికి ఆ వర్గంలోనూ ట్రంప్‌కే అధికశాతం ఓట్లు పడ్డాయి. మొత్తం మీద పురుషుల్లో అధికంగా ట్రంప్‌కూ, మహిళల్లో ఎక్కువగా కమలకూ ఓటు చేశారని తొలి లెక్క. మహిళా నేత ఏలుబడికి అమెరికా సమాజం ఇప్పటికీ సిద్ధంగా లేదనీ, గతంలో హిల్లరీ క్లింటన్‌కైనా, ఇప్పుడు కమలకైనా ఎన్నికల ఫలితాల్లో ఈ లింగ దుర్విచక్షణ తప్పలేదనీ వినిపిస్తున్నది అందుకే.
ఇక, గతంలో పెద్దగా ఓటింగ్‌లో పాల్గొనరని పేరున్న యువ, పురుష ఓటర్ల వర్గం ఈసారి పెద్దయెత్తున వచ్చి ఓటేయడం,ముఖ్యంగా శ్వేత జాతీయుల్లో అత్యధికులు ట్రంప్‌కే పట్టం కట్టడం గమనార్హం. ఒక్క నల్ల జాతీ యుల్లో మాత్రమే 78 శాతం మంది పురుషులు, 92 శాతం మంది స్త్రీలు కమలకు ఓటేశారు. అమె రికన్ సమాజంలోని కనిపించని నిట్టనిలువు చీలిక, వర్ణవిచక్షణకు ఇది ప్రతిబింబమని ఓ వాదన.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం, సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ పూర్తి నియంత్రణ సాధించడం అమెరికా రాజకీయాల్లో అతి పెద్ద మలుపు. 2016లో తెలియకున్నా ఇప్పుడు మళ్ళీ పట్టం కడుతున్నప్పుడు ఆయన వ్యవహారశైలి సహా అన్నీ తెలిసే అమెరికన్లు ఆ నిర్ణయం తీసు కున్నారు. ఇప్పుడిక సెనేట్‌పై పట్టుతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచానికి కట్టుబడిన అగ్రరాజ్య విధానం నుంచి పూర్తి భిన్నంగా అమెరికాను ట్రంప్ కొత్త మార్గం పట్టిస్తారని ఒక విశ్లేషణ.
అమెరికా జాతీయ ప్రయోజనాల దృక్కోణం నుంచే ప్రపంచాన్ని చూడడం ట్రంప్ పద్ధతి. వాణిజ్య ప్రయోజనాలే గీటురాయిగా ఆయన ముందుకు సాగవచ్చు. అలాగే, ఉక్రెయిన్‌కు సైనిక సాయం ఆపి, ఆక్రమణ జరిపిన రష్యాతో శాంతి చర్చలు జరపాలన్న ట్రంప్ వైఖరి పర్యవసానం యూరప్ అంతటా ఉంటుందని అక్కడి దేశాలు బెంగపడుతున్నాయి.
భారత్‌కు సంబంధించినంత వరకు ట్రంప్ ఎన్నిక శుభవార్తే. నిజానికి, ప్రస్తుత డెమోక్రాట్ల హయాంలోనూ అమెరికా – భారత సంబంధాలు బాగున్నాయి. అయితే, భారత ప్రధాని మోదీతో ట్రంప్ చిరకాల మైత్రి వల్ల రానున్న రిపబ్లికన్ ప్రభుత్వ ఏలుబడి మనకు మరింత సానుకూలంగా ఉంటుందని ఆశ, అంచనా. ఇతర దేశాల సంగతికొస్తే... ట్రంప్ ఎన్నిక ఇరాన్, బంగ్లాదేశ్ లాంటి వాటికి కష్టాలు తెస్తే, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ లాంటి వారికి ఆనందదాయకం. కమల గద్దెనెక్కితే బాగుండనుకున్న చైనా, ఉక్రెయిన్‌ల ఆశ నెరవేర లేదు.
అమెరికాలోని దాదాపు 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్ రానున్న జనవరిలో అధికారం చేపడుతూనే ఆ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్టు ఆయన అధికార ప్రతినిధులు బుధవారమే తేల్చేశారు. అంటే, ఆది నుంచి ట్రంప్ దూకుడు చూపనున్నారన్న మాట. అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ అధికార క్రమాన్నే మార్చేయాలని చూస్తున్న ఆయన ధోరణి అమెరికానూ, మిగతా ప్రపంచాన్నీ ఎటు తీసుకువెళుతుందో వేచి చూడాలి. సమస్యల్ని పరిష్కరి స్తానంటూ ఎన్నికల నినాదం చేసిన ట్రంప్ కొత్తవి సృష్టిస్తే మాత్రం కష్టమే!
ట్రంప్‌కే అమెరికా పట్టం
Published Thu, Nov 7 2024 12:04 AM | Last Updated on Thu, Nov 7 2024 12:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment