
ఇండియాతో అదే ఏకైక సమస్య
డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి
వాషింగ్టన్: ఇండియాతో తమకు చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ, ఇండియాలో టారిఫ్‌లు అధికంగా విధిస్తున్నారని మరోసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఉందని, ఆ దేశంతో అదే ఏకైక సమస్య అని పేర్కొన్నారు. విదేశీ ఉత్పత్తులపై ఏప్రిల్ 2వ తేదీ నుంచి టారిఫ్‌లు వసూలు చేయబోతున్నట్లు ట్రంప్ పునరుద్ఘాటించారు.
ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. అమెరికా ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల ఉత్పత్తులపైనా తాము అలాంటి చర్య తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అమెరికా–ఇండియా సంబంధాలపై చర్చించారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియాలో సుంకాలను క్రమంగా తగ్గిస్తారన్న విశ్వాసం తనకు ఉందని వ్యాఖ్యానించారు. ఇండియాతో తనకున్న ఏకైక సమస్య ఆ విధంగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇండియాలో అమెరికా ఉత్పుత్తులపై ఎలాంటి టారిఫ్‌లు ఉన్నాయో ఏప్రిల్ 2 నుంచి ఇండియా ఉత్పత్తులపై తమ దేశంలో అలాంటి టారిఫ్‌లే అమల్లోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్–ఎకనామిక్ కారిడార్(ఐమెక్)ను సానుకూల చర్యగా అభివర్ణించారు. ఇది అద్భుతమైన దేశాల కూటమి అని చెప్పారు. వ్యాపారం, వాణిజ్యంలో దెబ్బతీయాలని చూస్తున్న ప్రత్యర్థి దేశాలకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. తమ శత్రువులను మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. వారికి ఎలాంటి మర్యాద చేయాలో తమకు బాగా తెలుసని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. మిత్రుల కంటే శత్రువులపైనే ఎక్కువగా దృష్టి పెడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment