వాషింగ్టన్: భారత్‌లో మరింత మెరుగైన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత వ్యాపార రంగంలో పారదర్శకమైన, సానుకూలమైన పాత్ర పోషించేందుకు అనువైన వాతావరణాన్ని భారత్, అమెరికా సంయుక్తంగా సృష్టించాయని ఆయన ఉద్ఘాటించారు.
అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం వాషింగ్టన్‌లోని కెన్నడీ సెంటర్‌లో అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, భారతీయ సంతతి వ్యక్తులు, దాతలతో మోదీ భేటీ అయ్యారు.
‘ఇరు దేశాల భాగస్వామ్యం అనేది అనువుగా మార్చుకున్న సంబంధం కాదు. ఇది పరస్పర వాగ్దానాలు, నిబద్దతకు నిదర్శనం’ అని మోదీ నొక్కిచెప్పారు. ‘ వాషింగ్టన్‌లో భిన్న రంగాల దిగ్గజాలతో భేటీ అద్భుతంగా కొనసాగింది. ఇందులో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ సైతం పాల్గొనడం విశేషం. భారత ప్రగతిపథ ప్రస్థానంలో భాగమయ్యేందుకు, దేశ అవకాశాల గనిని ఒడిసిపట్టేందుకు అమెరికా పెట్టుబడిదారులకు ఇదే చక్కని సమయం’ అని మోదీ ట్వీట్‌చేశారు.
భారత్‌లో 75,000 కోట్ల పెట్టుబడి: గూగుల్
‘భారత్‌లో దాదాపు రూ.75,000 కోట్ల(10బిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టబోతున్నాం. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా సంబంధిత వివరాలు ఆయనతో పంచుకున్నాను’ అని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇండియా డిజిటైజేషన్ ఫండ్‌లో భాగంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ(గిఫ్ట్)లో తమ గ్లోబల్ ఫిన్‌టెక్ వ్యాపారకార్యకలాపాలను ప్రారంభిస్తామని గూగుల్ వెల్లడించింది.
జీపేకు సపోర్ట్‌గా ప్రత్యేక కార్యకలాపాలను ‘గిఫ్ట్’లో మొదలుపెడతారని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు శనివారం పేర్కొన్నారు. ‘ఫిన్‌టెక్ రంగంలో భారత నాయకత్వాన్ని గూగుల్ గుర్తిస్తోంది. అందకే భారత్‌లో చిన్న, భారీ పరిశ్రమలకోసం సేవలు అందిస్తాం. దాంతోపాటే అమెరికాసహా ప్రపంచదేశాలకు ఇక్కడి నుంచే సేవలు కొనసాగుతాయి. ఈ ఏడాది చివరినాటికి ముఖ్యంగా మహిళల సారథ్యంలో మొదలయ్యే అంకుర సంస్థలకు మద్దతుగా నిలుస్తాం’ అని అధికార ప్రతినిధి చెప్పారు.
అమెజాన్ మరో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
అదనంగా 15 బిలియన్ డాలర్లు (రూ.1,23,000 కోట్లు) పెట్టుబడి పెట్టడం ద్వారా భారత్‌లో తన ఉనికిని మరింత పెంపొందించుకోవాలని అమెజాన్.కామ్ భావిస్తున్నట్లు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాలను తెలియజేశారు. ఈ అదనపు పెట్టుబడి 2030 నాటికి భారత్‌లోని వివిధ వ్యాపారాలలో సంస్థ మొత్తం పెట్టుబడిని 26 బిలియన్లకు (రూ.2,13,200 కోట్లకు) చేరుస్తుందని జస్సీ పేర్కొన్నారు. భారతీయ స్టార్టప్‌లను ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన, ఎగుమతులను సులభతరం చేయడం, డిజిటల్ పరివర్తన, గ్లోబల్ మార్కెట్లో అభివృద్ధి చెందడానికి వ్యక్తులు వంటి అంశాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment