
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే సెప్టెంబర్‌లో మొదటిసారిగా భారత్‌కు రానున్నారు. భారత్‌లో జరిగే జి–20 శిఖరాగ్రంలో ఆయన పాల్గొంటారని సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలు) డొనాల్డ్ లూ తెలిపారు. పర్యటనకు సంబంధించిన సన్నాహాలు సాగుతున్నాయన్నారు.
జి–20 అధ్యక్షస్థానంలో ఉన్న భారత్ నాయకత్వ లక్షణాలు మరింత విస్తృతమై బలమైన దేశంగా నిలుస్తోందన్నారు. అమెరికా–భారత్ సంబంధాల్లో వచ్చే ఏడాది అత్యంత కీలకం కానుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అపెక్, జపాన్ జి–7తోపాటు క్వాడ్ కూటమి సదస్సులు వచ్చే ఏడాది జరగనున్నాయి. వీటి తో భారత్–అమెరికా మరింత సన్నిహితమయ్యే అవకాశాలు పెరుగుతాయని లూ అన్నారు.