బిల్ క్లింటన్ హయాంలో తప్ప ఎన్నికైన ప్రతి అమెరికా అధ్యక్షుడూ భారత్‌తో సామరస్య పూర్వకమైన సంబంధాలను నెలకొల్పుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు. జార్జి బుష్ జూనియర్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా భారత్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఆయన జట్టులోని కీలక సభ్యులు భారత్‌ను ఏ దృక్పథంతో చూస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా భారత్ సందర్శించిన బైడెన్‌కు భారత్ పట్ల సానుకూల అభిప్రాయమే ఉంది. భారత్‌పై అణు ఆంక్షలకు ముగింపు పలకాలంటూ మద్దతు పలికారు. బైడెన్ టీమ్‌లో ఉండబోతున్న కీలక అధికారులు సైతం తాలిబన్ల కట్టడి, పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాద చర్యల నిరోధం వంటి అంశాలపై భారత్ అనుకూల వైఖరినే ప్రదర్శించగలరని సంకేతాలు వెలువడుతున్నాయి.
కొత్తగా ఎన్నికయ్యే ప్రతి అమెరికా అధ్యక్షుడూ విదేశీ విధాన నిర్వహణపై తన వ్యక్తిగత ముద్ర వేయాలని చూడటం కద్దు. బిల్ క్లింటన్ అధ్యక్షుడుగా ఉన్నకాలంలో భారత్–అమెరికా సంబంధాలు దిగజారి పోయాయి. భారత్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలిపి వేయడానికి క్లింటన్ శతథా ప్రయత్నించారు. కశ్మీర్ సమస్యకు సంబంధించి భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని ప్రయత్నించిన క్లింటన్, చైనాతో సత్సంబంధాలు కుదుర్చుకోవడానికి నడుం కట్టారు.
క్లింటన్ అనంతరం గద్దెనెక్కిన జార్జి బుష్ (జూనియర్) భారత్‌తో అత్యంత మిత్రపూరితంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడిగా చరి త్రలో మిగిలిపోయారు. భారతదేశంపై అంతర్జాతీయ అణు సంపన్న దేశాలు ఆంక్షలను ఎత్తివేయడంలో సహకారమందించారు. బుష్ నిర్దే శించిన పంథానే ఒబామా అనుసరించారు. భారత్‌తో సంబంధాలను ఇండో–పసిఫిక్ భద్రతా దృక్పథం నుంచి ఒబామా అంచనా వేశారు. వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించినప్పటికీ, భద్రతాపరమైన అంశాలపై భారత్‌కు ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతుగా నిలిచారు. ఇకపై బైడెన్ హయాంలో జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరసత్వ చట్టాలు వంటి అంశాలపై అమెరికాకు భారత్ తగు హామీని ఇవ్వాల్సి ఉంటుంది.
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు స్వాగతించాయి. బైడెన్, అయన జట్టులోని కీలక సభ్యులు భారత్‌ను ఏ దృక్పథంతో చూస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో బైడెన్ భారత్ సందర్శించారు. భారత్‌తో బైడెన్ నెరిపిన కీలకమైన సంబంధాలు ఏవంటే... సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ చైర్మన్ హోదాలో నాటి అధ్యక్షుడు బుష్‌కి ఉత్తరం రాస్తూ, భారత దేశంపై అణు ఆంక్షలకు ముగింపు పలకాలని బైడెన్ మద్దతు పలికారు.
ఉపాధ్యక్షుడి హోదాలో బైడెన్ 2013 జూలైలో భారత్‌ను సందర్శించారు. వాతావరణ మార్పుపై ఒప్పందం కోసం అంత ర్జాతీయ మద్దతును కూడగట్టడంలో అమెరికాకు సహకరించాల్సిందని భారత్‌ను ఒప్పించే ప్రచారం మొదలెట్టిన బైడెన్ తన పనిలో విజయం సాధించారు కూడా. పారిస్‌లో నిర్వహించిన 2015 వాతావరణ మార్పు సదస్సు సందర్భంగా అమెరికాకు భారత్ మద్దతిచ్చింది. ఈ సదస్సులోనే పర్యావరణ సమస్యలపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రదర్శించిన చిత్తశుద్ధిని అమెరికా నిజంగానే మెచ్చుకుంది కూడా.
విదేశీ విధానం, భద్రతా విధానాలకు సంబంధించిన సమస్యలపై బైడెన్ పాలనా యంత్రాంగంలో ముగ్గురు వ్యక్తులు కీలక స్థానాల్లో ఉండబోతున్నారు. సెనేట్ విదేశీ సంబంధాల కమిటీలో బైడెన్‌కు దీర్ఘకాలం పాటు సహకరించిన ఆంథోనీ బ్లింకెన్ (ప్రస్తుతం అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి కానున్నారు)తో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ వ్యవహరించవలసి ఉంటుంది. ఒబామా ప్రభుత్వంలో బ్లింకెన్ డిప్యూటీ విదేశీ మంత్రిగా వ్యవహరించారని గుర్తుంచుకోవాలి. భారత్‌తో సంబంధాల తీరుతెన్నుల గురించి ఈ ఏడాది జూలైలో వాషింగ్టన్‌లో ప్రసంగించిన బ్లింకెన్, భారత్‌తో దృఢమైన సంబం ధాలను నెలకొల్పుకోవడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ‘ఇండో–పసిఫిక్ భవిష్యత్తుకు ఇది ఎంతో ముఖ్యమైనది, మేం కోరు కుంటున్న వ్యవస్థ తీరుకు భారత్‌తో సంబంధాలు చాలా ముఖ్యమై నవి. నూతన వ్యవస్థ అనేది మరింత న్యాయబద్ధంగా, సుస్థిరంగా, మరింత ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని బ్లింకెన్ పేర్కొన్నారు. భారత్‌తో రక్షణరంగ పారిశ్రామిక సహకారం అభివృద్ధిని కూడా బ్లింకెన్ ఆకాంక్షించారు. దీనివల్ల భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తి గణనీయంగా మారిపోతుంది.
జాతీయ భద్రతా విధానాలతో వ్యవహరించనున్న బైడెన్ టీమ్‌లో అత్యంత వృత్తిపర నైపుణ్యం, అనుభవం కలిగిన అధికారులు ఉన్నారు. 43 ఏళ్ల వయసున్న జాక్ సుల్లివాన్ ఇప్పుడు బైడెన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా, హిల్లరీ క్లింటన్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు సుల్లివాన్ అత్యంత కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. మరొక ఆసక్తికరమైన నియామకం జనరల్ లాయిడ్ ఆస్టిన్. అమెరికా చరిత్రలో రక్షణ రంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ కావడం విశేషం. ఆస్టిన్ గతంలో యుఎన్ జనరల్ కమాండ్ అధిపతిగా వ్యవహరించేవారు. ఇది అఫ్గానిస్తాన్‌లో అమెరికా సైనిక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేది. కాబట్టి అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లకు మద్దతునివ్వడంలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ పాత్ర గురించి, అబోత్తాబాద్‌లో అల్ కాయిదా అధినేత బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆశ్రయమివ్వడం గురించి అస్టిన్ కాబోయే అధ్యక్షుడికి చక్కని సమాచారం ఇవ్వగలరు. పాకిస్తాన్ అణ్వాయుధ నిర్మాణంలో చైనా సహకారం గురించి భారత్‌కు చక్కటి సూచనలు అందించగలరు.
మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో తాజా పరిస్థితి, పౌరసత్వ సవరణ చట్టం గురించి బ్లింకెన్ మాట్లాడుతూ, కశ్మీరులో స్వేచ్ఛగా సంచరిం చడం, వాక్ స్వేచ్ఛలను దెబ్బతీస్తూ భారత్ ఇటీవలి కాలంలో తీసు కున్న కొన్ని చర్యల గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశంలో పౌరసత్వ చట్టాలపై కూడా ఆయన మాట్లాడారు. కొన్ని రంగాల్లో విభేదాలు ఉన్నప్పటికీ మరింత గొప్ప సహకారాన్ని నిర్మించు కోవడంపై మరింత మెరుగైన రీతిలో వ్యవహరించగలమని బ్లింకెన్ నొక్కి చెప్పారు.
అదే సమయంలో జమ్మూ కశ్మీరుపై భారత్ పారదర్శక విధానాన్ని కలిగి ఉన్నదని మనం బైడెన్ పాలనా యంత్రాంగానికి స్పష్టం చేయ వలసిన అవసరం ఉంది. జమ్మూకశ్మీరులో ప్రజలు ఎన్నుకునే ప్రజా స్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ధృఢ నిర్ణయంతో ఉందని కూడా చెప్పవలసి ఉంది. జమ్మూకశ్మీర్‌లో ఉనికిలో ఉన్న ప్రజాతంత్ర సంస్థలను అణచిపెట్టడానికి, ఎన్నికలను విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఏమేరకు ప్రోత్సహిస్తుందన్న దానికి అనుగుణంగానే ఆ ప్రాంతంపై భారత్ విధానం ఉంటుందని అమెరికాకు అర్థం చేయించాల్సి ఉంది. అదే సమయంలో భారతదేశంలోనూ, అఫ్గానిస్తాన్‌లోనూ ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నివ్వకుండా చేయడంలో అమెరికా తన పలుకు బడిని ఉపయోగించాలని భారత్ ఆశిస్తున్నదనే విషయాన్ని కూడా మనం అమెరికాకు స్పష్టం చేయవలసిన అవసరం ఉంది.
ఇకపోతే చైనా, రష్యాతో అమెరికా సంబంధాల్లో కూడా గణనీయమైన స్థాయిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. చైనాపై డొనాల్డ్ ట్రంప్ హయాంలో మాదిరి తీవ్రమైన కఠిన పదజాలాన్ని ప్రయోగించడం తగ్గిపోవచ్చు. ఎందుకంటే పసిíఫిక్, హిందూ మహా సముద్రంలో తన సైనికపరమైన ఉనికిని అమెరికా కొనసాగించ నుంది. అయితే ట్రంప్ పాలనాయంత్రాంగం నుంచి రష్యా అందు కున్న ప్రాధాన్యత బైడెన్ హయాంలో లభించక పోవచ్చనిపిస్తుంది. అలాగే ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై విధించిన ఆంక్షలకు బైడెన్ యంత్రాంగం ముగింపు పలకవచ్చు. ఇది ఎంతైనా స్వాగతించవలసిన విషయం. ఎందుకంటే అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రాయోజిత ఉగ్రవా దాన్ని ఎదుర్కోవడంలో ఇరాన్ సానుకూల పాత్ర పోషించగలదు. అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి చేరుకుంటే అది అఫ్గానిస్తాన్‌లోనే కాకుండా గల్ఫ్ ప్రాంతంలో కూడా శాంతి సుస్థిరతలను పెంపొందించగలదు.
అన్నిటికంటే మించి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాన్ని కొనసాగించడంలో పాకిస్తాన్‌ను ప్రోత్సహించే విధంగా బైడెన్ యంత్రాంగం ఏరకంగానూ వ్యవహరించదని మనం భావించవచ్చు. అలాగే, చైనా ప్రాదేశిక స్వార్థ ప్రేరేపిత ఆకాంక్షలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై అమెరికా తనదైన స్పష్టమైన వైఖరిని వ్యక్తపర్చగలదని కూడా మనం భావించవచ్చు. ఇండో–పసిఫిక్ ప్రాంతం పొడవునా ప్రాంతీయ భద్రతను ప్రోత్సహించడంలో క్వాడ్ ఇప్పుడు ఒక కీలక సంస్థగా ఉంటోంది. పైగా 2021లో జి–7 పారిశ్రామిక దేశాల (బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా) సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. క్వాడ్ సభ్య దేశాలను ఆహ్వానించనున్నట్లు వార్తలు వస్తున్నాయి కూడా. ఇది భారత్‌కు ఎంతో అనుకూలమైన అంశమని చెప్పక తప్పదు.
జి.పార్థసారథి
వ్యాసకర్త చాన్స్‌లర్, జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీ;
మాజీ హైకమిషనర్, పాకిస్తాన్
Comments
Please login to add a commentAdd a comment