Defense products
-
India-U.S relations: ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు
వాషింగ్టన్: ట్రంప్ 2.0తో మోదీ 3.0 తొలి భేటీ బంపర్ హిట్టయింది. భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెండింతలకు పెంచి 500 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా భారత్‌కు అమెరికా అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలను అందజేయడమే గాక రక్షణ ఉత్పత్తులను ఎగుమతులను ఇతోధికంగా పెంచనుంది. భారీగా చమురు, సహజవాయువు కూడా సరఫరా చేయనుంది. ఇరు దేశాలూ పౌర అణు సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) జరిపిన సమావేశం ఇలాంటి పలు కీలక ఒప్పందాలకు వేదికైంది. రెండు రోజుల అమెరికా పర్యటన(Usa Tour)లో భాగంగా అధ్యక్షునితో మోదీ శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో భేటీ అయ్యారు. మోదీ మూడోసారి ప్రధానిగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాక వారి మధ్య ఇదే తొలి సమావేశం కావడం విశేషం. మోదీని ట్రంప్ అత్యంత ఆత్మీయంగా స్వాగతించారు. చాలాసేపటిదాకా కరచాలనం చేయడమే గాక ప్రధానిని గట్టిగా హత్తుకున్నారు. ‘మీరో అద్భుతమైన వ్యక్తి. గొప్ప మిత్రుడు. మిమ్మల్నెంతగానో మిస్సయ్యాం’ అంటూ అత్యంత ఆప్యాయంగా పలకరించారు. అనంతరం భారత్, అమెరికా వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నారు. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తర్వాత 44 నిమిషాల పాటు మీడియాతో సంయుక్తంగా మాట్లాడారు. అమెరికాకు మోదీ చిరకాల మిత్రుడంటూ మీడియా ముఖంగా కూడా ట్రంప్ పదేపదే ప్రశంసించారు. భారీ వర్తక ఒప్పందం: ట్రంప్ చైనాతో పాటు పలు దేశాలపై దూకుడైన టారిఫ్‌ల యుద్ధం ప్రకటించిన ట్రంప్, భారత్‌పై టారిఫ్‌ల విషయంలో మాత్రం కాస్త సున్నితంగానే స్పందించారు. కాకపోతే పరస్పర టారిఫ్‌ల విషయంలో మాత్రం అస్సలు మొహమాటపడబోమని మోదీ సమక్షంలో ట్రంప్ కుండబద్దలు కొట్టారు. అమెరికాపై భారత్ విధించే సుంకాలనే తామూ విధించి తీరతామన్నారు. పలు అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలు చాలా హెచ్చుగా, ఏకపక్షంగా ఉన్నాయంటూ సంయుక్త మీడియా భేటీలోనే ఆక్షేపించారు. అయితే, అమెరికా నుంచి చమురు, సహజవాయువు దిగుమతుల పరిమాణాన్ని భారీగా పెంచేందుకు మోదీ సమ్మతించారని అధ్యక్షుడు వెల్లడించారు. ఆ రెండింట్లో భారత్‌కు తామే అతి పెద్ద సరఫరాదారులం కాబోతున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌తో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు రక్షణ హార్డ్‌వేర్ తదితర ఉత్పత్తుల ఎగుమతులను ఈ ఏడాది నుంచి ఏటా బిలియన్ డాలర్ల మేరకు పెంచనున్నాం. అంతేగాక ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతనమైన ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్లను భారత్‌కు అందజేస్తాం. భారత్‌తో అతి త్వర లో భారీ వర్తక ఒప్పందం కుదరనుంది. పౌర అణు ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఇందులో భా గంగా అమెరికా అణు పరిజ్ఞానాన్ని భారత్ తన మార్కెట్లలోకి అనుమతించనుంది’’ అని వెల్లడించారు. భారత్–పశి్చమాసియా–యూరప్ ఆర్థిక కారిడార్ దిశగా కృషి చేయాలని అంగీకారానికి వచ్చామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు ముకుతాడు వేసే దిశగా అధినేతల భేటీలో మరిన్ని నిర్ణయాలు జరిగాయి. వాటిలో భాగంగా భారత్‌కు మరో 6 అత్యాధునిక పీ–8ఐ దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, స్ట్రైకర్ యుద్ధ వాహనాలను భారత్‌లో సంయుక్త తయారీ తదితరాలకూ సమ్మతించింది. పదేళ్లకు రోడ్‌మ్యాప్: మోదీ భారత్, అమెరికా పరస్పర సహకారాత్మక బంధం మెరుగైన ప్రపంచానికి బాటలు పరుస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి వచ్చే పదేళ్ల కాలానికి రోడ్‌మ్యాప్ రూపొందించుకుంటామని చెప్పారు. అంతరిక్ష రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని చెప్పారు. 2025ను అమెరికా–భారత్ పౌర అంతరిక్ష సహకార సంవత్సరంగా అభివర్ణించారు. ‘‘అన్ని విషయాల్లోనూ అమెరికా ప్రయోజనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తారు. ఇది నేనెంతగానో అభినందించే విషయం. భారత ప్రయోజనాలకు నేను కూడా అంతే’’ అని వివరించారు. వ్యాపారవేత్త గౌతం అదానీ వివాదంపై ట్రంప్‌తో చర్చించారా అని ప్రశ్నించగా వ్యక్తులను గురించి అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని చెప్పారు. చైనాతో లద్దాఖ్ వివాదాన్ని ప్రస్తావించగా సరిహద్దు ఘర్షణలు ఎవరికీ మంచివి కావని అభిప్రాయపడ్డారు. ట్రంప్ జోక్యం చేసుకుని చైనా, భారత్, రష్యా, అమెరికా కలసికట్టుగా సాగాలని అభిలషించారు. ట్రంప్‌తో భేటీ అద్భుతంగా సాగిందని అనంతరం మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం ఆయన భారత్ బయల్దేరారు. ముంబై దోషుల్ని శిక్షించాల్సిందే ఇస్లామిక్ రాడికల్ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అమెరికా సంఘీభావం ప్రకటించింది. దాన్ని రూపుమాపేందుకు సంయుక్తంగా పోరాడతామని ట్రంప్ స్పష్టం చేశారు. 2008 ముంబై ఉగ్ర దాడుల దోషులందరికీ శిక్ష పడేలా చూడాల్సిందేనని పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. ఆ దాడుల్లో నిందితుడైన తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగిస్తున్నట్టు సంయుక్త విలేకరుల భేటీలో అధ్యక్షుడు ధ్రువీకరించారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యంత హింసాత్మక వ్యక్తుల్లో ఒకరిని భారత్‌కు అప్పగిస్తున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ముంబై ఉగ్ర దాడులకు పాల్పడ్డందుకు అక్కడ న్యాయ విచారణను ఎదుర్కొంటాడు. త్వరలో మరికొందరిని కూడా అప్పగిస్తాం’’ అని పేర్కొన్నారు. తద్వారా ఖలిస్తానీ వేర్పాటువాది పన్ను తదితరులకు పరోక్షంగా హెచ్చరిక సంకేతాలిచ్చారు. రాణా అప్పగింత పట్ల అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా తొలినుంచీ కలసికట్టుగా పని చేస్తున్నాయని గుర్తు చేశారు. ముంబై తరహా దాడులను నివారించేందుకు, అల్‌ఖైదా, ఐసిస్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా తదితర ఉగ్ర సంస్థల ఆట కట్టించేందుకు సంయుక్త కృషిని కొనసాగిస్తామని ఇరు దేశాల సంయుక్త ప్రకటన కూడా పేర్కొంది. పాక్ మూలాలున్న రాణా కెనడా జాతీయుడు. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో పాటు ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ జైల్లో ఉన్నాడు. భారత్‌లో అమెరికా వర్సిటీల క్యాంపస్‌లు పలు ప్రఖ్యాత అమెరికా విశ్వవిద్యాలయాలు త్వరలో భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చల్లో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఉన్నత విద్యా రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవాలని కూడా నిశ్చయించారు. ఇందుకోసం పరస్పర సంయుక్త డిగ్రీలు తదితర పథకాలతో పాటు జాయింట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలో చదువుతున్న 3 లక్షలకు పై చిలుకు భారత విద్యార్థుల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఏటా 8 బిలియన్ డాలర్ల దాకా అందుతోందని నేతలిద్దరూ గుర్తు చేసుకున్నారు. అమెరికాలోని భారత సమాజానిది ఇరు దేశాల బంధంలో అతి కీలక పాత్ర అని మీడియా భేటీలో ట్రంప్ చెప్పారు. లాస్ ఏంజెలిస్, బోస్టన్ నగరాల్లో త్వరలో భారత కాన్సులేట్లు తెరవనున్నట్టు వెల్లడించారు.మానవ అక్రమ రవాణాపై పోరు: మోదీ మనుషుల అక్రమ రవాణా భారత్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదని ప్రధాని మోదీ అన్నారు. దాన్ని ప్రపంచ సమస్యగా అభివరి్ణంచారు. పెద్ద కలలు కనే సాధారణ కుటుంబాలకు చెందిన అమాయకులను పరాయి దేశాల్లో అక్రమ వలసదారులుగా మారుస్తున్న ఈ జాఢ్యంపై దీనిపై దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాల్సి ఉందన్నారు. ‘‘పరాయి దేశంలో అక్రమంగా ప్రవేశించే వారెవరికీ అక్కడ నివసించే హక్కుండబోదు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్టు తేలిన భారతీయులందరినీ వెనక్కు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని స్పష్టం చేశారు. ఈ అంశం ట్రంప్–మోదీ చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు.తటస్థం కాదు, శాంతివైపే ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ శాంతివైపే నిలిచింది తప్ప ఏనాడూ తటస్థ వైఖరితో వ్యవహరించలేదని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయమై కొన్ని దేశాలకు ఉన్న అభిప్రాయం అపోహ మాత్రమేనన్నారు. ‘‘రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి సాధనకు దౌత్యమే మార్గం తప్ప యుద్ధం కాదు. ఈ దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తున్నా. ఇది యుద్ధాల యుగం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్పష్టంగా చెప్పా’’ అని చెప్పారు.బేరాల్లో నాకన్నా మొనగాడు: ట్రంప్ట్రంప్, మోదీ సంయుక్త మీడియా సమావేశం అత్యంత స్నేహపూర్వకంగా, పలు సందర్భాల్లో సరదా మాటలతో సాగింది. ఇద్దర్లో ఎవరు మెరుగ్గా బేరమాడతారని మీడియా ప్రశ్నించగా ఆ విషయంలో మోదీదే పై చేయంటూ ట్రంప్ టక్కున బదులిచ్చారు. ‘‘మోదీ నా కంటే చాలా గట్టిగా, మెరుగ్గా బేరమాడగలరు. ఆయనతో పోటీ కూడా పడలేను. అందులో అనుమానమే లేదు’’ అంటూ నవ్వులు పూయించారు. భేటీ పొడవునా మోదీని అధ్యక్షుడు పదేపదే ప్రస్తుతించారు. ‘‘ఆయనో గొప్ప నాయకుడు. ప్రధానిగా అద్భుతంగా రాణిస్తున్నారు. దేశాధినేతలతో పాటు ఎవరిని చూసినా ఆయన గురించే మాట్లాడతారు. భారత్‌లోనూ, అమెరికాలోనూ మోదీ, నేను ఎంతో సమయం కలిసి గడిపాం. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. అందమైన భారతదేశంలో ఐదేళ్ల కింద పర్యటించా. నా భార్య మెలానియాతో కలిసి అద్భుతమైన సమయం గడిపా. అప్పుడు మోదీ ఇచ్చిన అద్భుతమైన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడాయనకు అదే తరహాలో ఆతిథ్యం ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు మోదీకి మరోసారి స్వాగతం పలికినందుకు ఎంతో థ్రిల్లవుతున్నా’’ అని చెప్పుకొచ్చారు. జనవరి 20న ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక అమెరికాలో పర్యటించిన తొలి విదేశీ నేతల్లో మోదీ ఉన్నారు.మాగా.. మిగా కలిస్తే మెగా ట్రంప్ నినదించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ–మాగా) స్ఫూర్తితో మేక్ ఇండియా గ్రేట్ అగైన్ (ఎంఐజీఏ–మిగా) నినాదం ఇస్తున్నానని ప్రధాని మోదీ ప్రకటించారు. రెండూ కలిసి మెగా భాగస్వామ్యంగా మారతాయని ధీమా వెలిబుచ్చారు.మిషన్ 500భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని 2030 కల్లా 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇందులో భా గంగా పరస్పర సుంకాలను బాగా తగ్గించుకోవాలని, మార్కెట్ యాక్సెస్‌ను పెంపొందించుకోవాలని తీర్మానించాయి. మోదీ–ట్రంప్ భేటీ అనంతరం ఇరు దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ముఖ్యాంశాలు... → ఈ సంవత్సరాంతానికల్లా ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ) కుదరనుంది. ఇరు దేశాల నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధులు లోతుగా చర్చిస్తారు. → సైనిక భాగస్వామ్యం, వేగవంతమైన వాణిజ్య, సాంకేతిక బంధం దిశగా అవకాశాలను నిశితంగా పరిశీలించేందుకు ఉద్దేశించిన ‘కాంపాక్ట్’ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లే మార్గాలను అన్వేషిస్తారు. → వస్తువులు, సేవల రంగంతో పాటు అన్నింటా వరక్త వాణిజ్యాలు మరింత వేగవంతం అవుతాయి. → నాసా–ఇస్రో సంయుక్త ఆక్సియోమ్ మిషన్ ద్వారా భారత వ్యోమగామి తొలిసారి ఐఎస్ఎస్కు వెళ్లనున్నాడు. → త్వరలో నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ (నిసార్) మిషన్‌ను ప్రయోగించనున్నాం. → ట్రాన్స్‌ఫారి్మంగ్ ద రిలేషన్షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ (ట్రస్ట్) పథకం ద్వారా రక్షణ, ఏఐ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్, బయోటెక్నాలజీ, ఇంధన, అంతరిక్ష తదితర రంగాల్లో ప్రభుత్వాల, ప్రైవేటు స్థాయిలో పరస్పరం మరింత సహాయక సహకారాలు. -
రక్షణ ఉత్పత్తుల్లో మన ప్రయాణం గర్వకారణం
న్యూఢిల్లీ: దేశంలో రక్షణ ఉత్పత్తులు, వాటి ఎగుమతులు భారీగా పెరుగుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. రక్షణ ఉత్పత్తుల్లో మన దేశ ప్రయాణం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని చెప్పారు. రక్షణ రంగంలో పాలుపంచుకోవాలని కావాలని స్టార్టప్‌లు, తయారీదారులు, వ్యాపారవేత్తలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో నవీన ఆవిష్కరణలు సృష్టించేందుకు ముందుకు రావాలని సూచించారు. చరిత్రలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు మోదీ బుధవారం ‘లింక్డ్ఇన్’లో పోస్టు చేశారు. ‘‘మీ అనుభవం, శక్తి సామర్థ్యాలు, ఉత్సాహం దేశానికి అవసరం. నవీన ఆవిష్కరణకు ద్వారాలు తెరిచి ఉన్నాయి. మన ప్రభుత్వ విధానాలు మీకు అనుకూలంగా పని చేస్తున్నాయి. రక్షణ రంగంలో లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మనమంతా కలిసి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిద్దాం. అంతేకాదు రక్షణ ఉత్పత్తుల తయారీలోని భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చాలి. బలమైన, స్వయం సమృద్ధితో కూడిన ఇండియాను నిర్మిద్దాం. గతంలో మనం విదేశాల నుంచి రక్షణ పరికరాలు, ఆయుధాలు దిగుమతి చేసుకొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనమే విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ అద్భుత ప్రయాణం దేశంలో ప్రతి పౌరుడికీ గర్వకారణమే. ఇండియా రక్షణ ఉత్పత్తుల విలువ 2023–24లో రూ.1.27 లక్షల కోట్లకు చేరింది. ఇక ఎగుమతి విలువ 2014లో కేవలం రూ.1,000 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.21,000 కోట్లకు చేరుకుంది. 12,300 రకాల పరికరాలు, ఆయుధాలు దేశీయంగానే తయారు చేసుకుంటున్నాం. రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు రూ.7,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. రక్షణ పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) నిధుల్లో 25 శాతం నిధులను ఇన్నోవేషన్కే ఖర్చు చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో రెండు అధునాతన డిఫెన్స్ కారిడార్లు రాబోతున్నాయి’’అని ప్రధాని మోదీ వెల్లడించారు. భారతీయ యువతకు తిరుగులేదు నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతలో భారతీయ యువతకు తిరుగులేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వారు అత్యుత్తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత్ నిరి్వరామ ప్రగతి సాధిస్తోందంటూ గిట్‌హబ్ సంస్థ సీఈఓ థామస్ డోహ్మ్కే ‘ఎక్స్’లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ బుధవారం స్పందించారు. కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంలో అమెరికా తర్వాత భారత్ ముందంజలో ఉందని థామస్ పేర్కొన్నారు. -
రక్షణ ఉత్పత్తుల్లో భారత్ ముద్ర
న్యూఢిల్లీ: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉన్నట్టు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేసింది. రక్షణ ఉత్పత్తుల తయారీకి భారత్ కేంద్రంగా అవతరించగలదని.. వచ్చే పదేళ్ల కాలంలో (2032 నాటికి) 138 బిలియన్ డాలర్ల విలువైన (రూ.11.45 లక్షల కోట్లు) ఎగుమతులకు అవకాశాలున్నట్టు పేర్కొంది. డిఫెన్స్ ఎక్విప్మెంట్, టెక్నాలజీలు, సరీ్వసులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. రక్షణ ఉత్పత్తుల తయారీ, టెక్నాలజీ అభివృద్ధిపై పనిచేసే కంపెనీలకు అపారమైన అవకాశాలు రానున్నాయని అంచనా వేసింది. ‘ఇండియా డిఫెన్స్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. రక్షణ రంగంపై భారత్ మూలధన వ్యయాలు 2029–30 నాటి బడ్జెట్లో 37 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది. 2024–25 బడ్జెట్లో 29 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా పెరగనున్నట్టు తెలిపింది. ఈ ప్రకారం చూస్తే 2024 నుంచి 2030 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం రూ.15.5 లక్షల కోట్లను భారత్ రక్షణ రంగంపై వెచ్చించనున్నట్టు అంచనా వేసింది. గతంతో పోలి్చచూస్తే ఇది పెద్ద మొత్తమేనని గుర్తు చేసింది. ‘‘సానుకూల విధానాలు, సంస్కరణలు, టెక్నాలజీ అభివృద్ధి, దేశీ తయారీకి ప్రోత్సాహం రూపంలో రక్షణ రంగానికి భారత ప్రభుత్వం సంపూర్ణ మద్దతు పలుకుతోంది’’అని వివరించింది.హెచ్ఏల్, బీఈఎల్‌కు ఆర్డర్లు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు గొప్ప అవకాశాలు రానున్నాయని ఈ నివేదిక అంచనా వేసింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీలో కంపెనీకి ఉన్న బలమైన సామర్థ్యాలను ప్రస్తావించింది. రక్షణ రంగంలో భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్)కు సైతం బలమైన ఆర్డర్లకు అవకాశాలున్నాయని, దీంతో కంపెనీ మార్జిన్లు, రాబడుల రేషియోలు పెరుగుతాయని నోమురా తన నివేదికలో పేర్కొంది. వివిధ రూపాల్లో భారత్ సర్కారు అందిస్తున్న తోడ్పాటుతో ఈ రంగంలోని కంపెనీలకు సానుకూల వాతావరణం నెలకొన్నట్టు తెలిపింది. ఎగుమతులు టెక్నాలజీ బదిలీ, సహకారం రూపంలో భారత రక్షణ పరిశ్రమ అంతర్జాతీయంగా తన స్థానాన్ని విస్తరించుకుంటున్నట్టు వివరించింది. దీంతో రక్షణ తయారీ, టెక్నాలజీ అభివృద్ధి సామర్థ్యాలున్న కంపెనీలు ఎగుమతుల అవకాశాలను పెద్ద ఎత్తున సొంతం చేసుకోగలవని అంచనా వేసింది. తద్వారా అవి తమ ఆదాయ వనరులను వైవిధ్యం చేసుకోగవలని వివరించింది.లాభదాయక అవకాశాలురక్షణ రంగంలో ఎన్నో విభాగాలు లాభదాయక అవకాశాలను ఆఫర్ చేస్తున్నాయని నోమురా నివేదిక తెలిపింది. డిఫెన్స్ ఏరోస్పేస్ విభాగం ఒక్క దాని విలువే 50 బిలియన్ డాలర్లుగా ఉంటుందని చెబుతూ.. ఎయిర్‌క్రాఫ్ట్, హెలీకాప్టర్లు, యూఏవీలు, ఏవియానిక్స్, అనుబంధ వ్యవస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను గుర్తు చేసింది. షిప్ బిల్డింగ్ సైతం భారీ అవకాశాలు కల్పిస్తోందని, సముద్ర తీర రక్షణ కోసం నేవల్ వెస్సెల్స్, సబ్మెరైన్లు, పెట్రోల్ బోట్లకు సంబంధించి 38 బిలియన్ డాలర్ల తయారీ అవకాశాలను ప్రస్తావించింది. మిసైళ్లు, ఆరి్టలరీ గన్ వ్యవస్థలపై పెట్టుబడులు 21 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని నోమురా నివేదిక అంచనా వేసింది. తన ఆరి్టలరీ, మిసైల్ సామర్థ్యాలను పెంచుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను గుర్తు చేసింది. -
ఏకే203 @ అమేథి
అమేథి అనగానే ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ కంచుకోట గుర్తుకొస్తుంది ఎవరికైనా! ఆఫ్కోర్స్ ఇప్పుడు కాదనుకోండి... కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీ అక్కడ ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమేథి రక్షణ ఉత్పత్తుల్లో సరికొత్త కేంద్రంగా అవతరించనుంది. అమేథిలో ఏర్పాటు చేయనున్న ఆయుధ కర్మాగారంలో ఏకంగా 6 లక్షల ఏకే203 అసల్ట్ రైఫిల్స్‌ను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రష్యాతో ఒప్పందానికి భారత రక్షణ శాఖ మంగళవారం పచ్చజెండా ఊపింది. భారత సాయుధ బలగాలు ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో దశలవారీగా ఈ అధునాతన కలష్నికోవ్ శ్రేణి రైఫిల్స్ వచ్చి చేరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చేనెల ఆరో తేదీన భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో దీనికి సంబంధించి భారత్– రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. భారత్ నినాదమైన ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఇరుదేశాల సంయుక్త భాగస్వామ్యంలో ఏకే203 రైఫిల్స్ ఉత్పత్తి జరుగుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్‌కు సంబంధించినంత వరకు రష్యా తయారీ విడిభాగాలను వాడతారు. తర్వాత ఇరుదేశాల మధ్య ఈ రైఫిల్స్ తయారీకి సంబంధించి సాంకేతికత బదిలీ పూర్తయి... భారత్‌లోనే తయారైన విడిభాగాలతో ఉత్పత్తి మొదలవుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్ వచ్చే ఏడాది భారత సైనిక బలగాలకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మొత్తం రూ. 5,000 కోట్ల విలువైన ఒప్పందానికి మంగళవారం డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ (డీఏసీ) తుది ఆమోదముద్ర వేసిందని రక్షణవర్గాల విశ్వసనీయ సమాచారం. ఐఏఎఫ్‌కు జీశాట్–7సీ శాటిలైట్ భారత వాయుసేనకు జీశాట్– 7సీ శాటిలైట్, దాని సంబంధిత ఉపకరణాల కొనుగోలు నిమిత్తం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. రూ.2,236 కోట్ల నిధులను ఇందుకోసం కేటాయించింది. భారత వాయుసేన సాంకేతిక, సమాచార వ్యవస్థల ఆధునికీరణకు సంబంధించిన అవసరాల కోసం ‘మేకిన్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు రక్షణశాఖ వెల్లడించింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
‘తేజస్’లో విహారం అద్భుతం
సాక్షి, బెంగళూరు: రూ.35 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆయన శుక్రవారం కర్ణాటకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌లో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ)ను సందర్శించారు. ఈ సందర్భంగా తేజస్ ఎల్సీఏ (లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్) విమానంలో విహరించారు. కాక్‌పిట్‌లో కూర్చున్న ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తేజస్ యుద్ధ విమానంలో విహరించడం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేషనల్ కాంక్లేవ్ ప్రారంభోత్సవానికి రాజ్‌నాథ్ హాజరయ్యారు. 1971 నాటి ఇండో–పాక్ యుద్ధం బ్రోచర్‌ను ఆవిష్కరించి.. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శిక్షణ పూర్తి చేసుకున్న 1,185 మంది పైలెట్లను రాజ్‌నాథ్ అభినందించారు. -
దేశ రక్షణలో రాజీ లేదు!
న్యూఢిల్లీ: భారత్ శాంతికాముక దేశమే అయినా.. దేశ రక్షణ విషయంలో రాజీ పడబోదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. యుద్ధ విమానాలు, సాయుధ దళాల ఆధునీకరణలకు సంబంధించి దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు తాము అధికారంలోకి వచ్చాకే మోక్షం వచ్చిందని మోదీ గుర్తు చేశారు. దేశీయంగా క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో మోదీ స్పందించారు. తాను స్వప్నిస్తున్న ‘నవ భారత్’లో అవినీతికి చోటు లేదన్న మోదీ.. అవినీతికి పాల్పడిన వారిని ఎంతవారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్సీసీ క్యాడెట్లను ఉద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు. ‘మీ భవిష్యత్తును నిర్దేశించేవి మీ కుటుంబం, మీ ఆర్థిక నేపథ్యం కాదు.. మీ పట్టుదల, మీ నైపుణ్యం, మీ ఆత్మవిశ్వాసమే బంగారు భవితకు బాటలు వేస్తుంది’ అని అన్నారు. వీఐపీ సంస్కృతి స్థానంలో తన ప్రభుత్వం ఈపీఐ(ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్– ప్రతీ వ్యక్తి ప్రముఖుడే) సంస్కృతిని చేర్చిందన్నారు. గ్రామాల నుంచి వచ్చి ఎన్సీసీలో శిక్షణ పొందుతున్న వారిని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా రక్షణ శాఖలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ భవిష్యత్‌లో దేశ భద్రతకు తోడ్పడతాయని ధీమా వ్యక్తం చేశారు. అప్పటివరకు దేశ ప్రజలు తమపై భరోసా ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని.. రాబోయే ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటు వేసేలా యువతను ప్రోత్సహించాలని వారికి సూచించారు. ఇక తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి యువత భారీగా మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు. లింగ వివక్షకు తావీయకుండా స్త్రీ, పురుషులిద్దరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ ఉద్ఘాటించారు. మహిళలను యుద్ధ విమానాలకు పైలట్లుగా నియమించామని, నేవీలోని మహిళా దళాలు ప్రపంచాన్ని చుట్టివచ్చాయని తెలిపారు. మిలటరీ సహా పలు కీలక విభాగాల్లో మహిళలను భాగస్వామ్యం చేసేలా తమ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. బెంగాల్లో ప్రధాని ర్యాలీ ప్రాంతం మార్పు పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 2న ప్రధాని మోదీ పాల్గొననున్న బహిరంగ సభ స్థలాన్ని మార్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వెల్లడించారు. ముందుగా అనుకున్నట్లు నార్త్ 24 పరగణా జిల్లాలోని థాకూర్‌నగర్‌లో కాకుండా దానికి సమీపంలోని మరో స్థలంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రపంచం కన్నా ముందుండండి
న్యూఢిల్లీ: రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ దేశాల కన్నా ముందంజలో నిలవాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. డీఆర్డీవో క్రియాశీలంగా వ్యవహరించాలని, సమయానికన్నా ముందే పనిని పూర్తిచేయాలన్నారు. బుధవారమిక్కడ ఉత్తమ డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అవార్డుల ప్రదానం చేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. 2020లో ప్రపంచ దేశాలు చేయాలనుకున్న రక్షణ సామగ్రి ఉత్పత్తిని మనం 2018లోనే చేసే దిశగా ప్రయత్నించాలన్నారు. 35 ఏళ్ల లోపు ఉన్న యువ శాస్త్రవేత్తల అధ్యయనం కోసం ఐదు ప్రయోగశాలలను గుర్తించాలని సూచించారు. సైనికుల బూట్లు, బ్యాగులు, తక్కువ బరువు ఉండే రక్షణ ఉత్పత్తులను తయారు చేయాలన్నారు. డీఆర్డీవో, అనుబంధ సంస్థల శాస్త్రవేత్తలతో పాటు డీఆర్డీవోకు సంబంధం లేని అధ్యయనం చేసే వారికి అవార్డులు ఇవ్వాలన్నారు.