ప్రపంచం కన్నా ముందుండండి
న్యూఢిల్లీ: రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ దేశాల కన్నా ముందంజలో నిలవాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. డీఆర్‌డీవో క్రియాశీలంగా వ్యవహరించాలని, సమయానికన్నా ముందే పనిని పూర్తిచేయాలన్నారు. బుధవారమిక్కడ ఉత్తమ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అవార్డుల ప్రదానం చేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు.
2020లో ప్రపంచ దేశాలు చేయాలనుకున్న రక్షణ సామగ్రి ఉత్పత్తిని మనం 2018లోనే చేసే దిశగా ప్రయత్నించాలన్నారు. 35 ఏళ్ల లోపు ఉన్న యువ శాస్త్రవేత్తల అధ్యయనం కోసం ఐదు ప్రయోగశాలలను గుర్తించాలని సూచించారు. సైనికుల బూట్లు, బ్యాగులు, తక్కువ బరువు ఉండే రక్షణ ఉత్పత్తులను తయారు చేయాలన్నారు. డీఆర్‌డీవో, అనుబంధ సంస్థల శాస్త్రవేత్తలతో పాటు డీఆర్‌డీవోకు సంబంధం లేని అధ్యయనం చేసే వారికి అవార్డులు ఇవ్వాలన్నారు.