ఏకే203 @ అమేథి | UP Amethi set to make AK203 Kalashnikov assault rifles | Sakshi
Sakshi News home page

ఏకే203 @ అమేథి

Published Wed, Nov 24 2021 5:37 AM | Last Updated on Wed, Nov 24 2021 10:22 AM

UP Amethi set to make AK203 Kalashnikov assault rifles  - Sakshi

అమేథి అనగానే ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ కంచుకోట గుర్తుకొస్తుంది ఎవరికైనా! ఆఫ్‌కోర్స్‌ ఇప్పుడు కాదనుకోండి... కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఫైర్‌బ్రాండ్‌ స్మృతి ఇరానీ అక్కడ ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమేథి రక్షణ ఉత్పత్తుల్లో సరికొత్త కేంద్రంగా అవతరించనుంది. అమేథిలో ఏర్పాటు చేయనున్న ఆయుధ కర్మాగారంలో ఏకంగా 6 లక్షల ఏకే203 అసల్ట్‌ రైఫిల్స్‌ను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రష్యాతో ఒప్పందానికి భారత రక్షణ శాఖ మంగళవారం పచ్చజెండా ఊపింది.

భారత సాయుధ బలగాలు ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్‌ రైఫిల్స్‌ స్థానంలో దశలవారీగా ఈ అధునాతన కలష్నికోవ్‌ శ్రేణి రైఫిల్స్‌ వచ్చి చేరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వచ్చేనెల ఆరో తేదీన భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో దీనికి సంబంధించి భారత్‌– రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. భారత్‌ నినాదమైన ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా ఇరుదేశాల సంయుక్త భాగస్వామ్యంలో ఏకే203 రైఫిల్స్‌ ఉత్పత్తి జరుగుతుంది.

మొదటి 70 వేల రైఫిల్స్‌కు సంబంధించినంత వరకు రష్యా తయారీ విడిభాగాలను వాడతారు. తర్వాత ఇరుదేశాల మధ్య ఈ రైఫిల్స్‌ తయారీకి సంబంధించి సాంకేతికత బదిలీ పూర్తయి... భారత్‌లోనే తయారైన విడిభాగాలతో ఉత్పత్తి మొదలవుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్‌ వచ్చే ఏడాది భారత సైనిక బలగాలకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మొత్తం రూ. 5,000 కోట్ల విలువైన ఒప్పందానికి మంగళవారం డిఫెన్స్‌ అక్విజేషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) తుది ఆమోదముద్ర వేసిందని రక్షణవర్గాల విశ్వసనీయ సమాచారం.

ఐఏఎఫ్‌కు జీశాట్‌–7సీ శాటిలైట్‌
భారత వాయుసేనకు జీశాట్‌– 7సీ శాటిలైట్, దాని సంబంధిత ఉపకరణాల కొనుగోలు నిమిత్తం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన డిఫెన్స్‌ అక్విజేషన్‌ కౌన్సిల్‌ ఆమోదముద్ర వేసింది. రూ.2,236 కోట్ల నిధులను ఇందుకోసం కేటాయించింది. భారత వాయుసేన సాంకేతిక, సమాచార వ్యవస్థల ఆధునికీరణకు సంబంధించిన అవసరాల కోసం ‘మేకిన్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం కింద ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు రక్షణశాఖ వెల్లడించింది.
– నేషనల్‌ డెస్క్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement