నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నైజమని టీడీపీలోనే ప్రచారముంది. ఇప్పుడు బయటి నుంచి వచ్చిన వారి కోసం సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీలో గందరగోళ పరిస్థితులకు చంద్రబాబు నిర్ణయాలే కారణమని అక్కడి నేతలు వాపోతున్నారు. ఇంతకీ సింహపురి రాజకీయాల్లో కలకలానికి కారణం ఏంటి?
తెగేసి చెబుతున్నారట..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన రాకను టీడీపీ జిల్లా అధ్యక్షులు, రూరల్ ఇన్‌చార్జ్ అబ్దుల్ అజీజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. రూరల్‌లో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి.. ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఏకంగా ముఖ్య నాయకుల్నే అజీజ్ ప్రశ్నించారట.
అయితే వారు అజీజ్‌ను లైట్ తీసుకోవడంతో.. ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకువచ్చి అధిష్టానం తన గొంతు కోసిందని అనుచరుల దగ్గర వాపోతున్నారట. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారట. తమ మీద హత్యాయత్నం కేసులు పెట్టించి, బెదిరించిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో ఎలా కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలను అజీజ్ ప్రశ్నిస్తున్నారట.
బాబు మంత్రాంగం అంటే అంతే సంగతి
పార్టీ దారుణంగా ఓడిపోయినా నాలుగేళ్ల నుంచి రూరల్ లో పార్టీని బలోపేతం చేస్తున్న తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని ఎలా తీసుకుంటారని చంద్రబాబు నాయుడు, లోకేష్ పై అజీజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇదే విషయాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పార్ఠీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర దగ్గర ప్రస్తావించారట. అయితే కోటంరెడ్డి సోదరుల రాక తమకు కూడా ఇష్టం లేదని వారు బదులివ్వడంతో అజీజ్ కు ఏం చెయ్యాలో అర్దం కాక సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.
కోటంరెడ్డి అధికారాన్ని ఉపయోగించి.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతిసారి.. అజీజ్ వారికి అండగా నిలిచేవారు. కొంతకాలం క్రితమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీతో టచ్‌లోకి వెళ్లారు. వైసీపీ నుంచి టిక్కెట్ రాదని భావించిన ఆయన.. పచ్చ బ్యాచ్ తో చేతులు కలిపారు.. ప్రభుత్వం మీదే అనవసర విమర్శలు చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారని తేలడంతో శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
పాపం.. బలిపశువు
మరో నాలుగు నెలల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా పార్టీలో చేరుతారని.. ముందుగా తన తమ్ముడ్ని టీడీపీలోకి పంపారని రూరల్ లో చర్చ నడుస్తోంది. శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరితే తనకు ఎమ్మెల్యే సీటు రాదని భావిస్తున్న అజీజ్.. అన్నదమ్ముల రాకను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్న తనకు మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారట. గిరిధర్ రెడ్డికి సహాయ నిరాకరణ చేద్దామని.. తన అనుచరులతో చెబుతున్నారట.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment