రైతులను నమ్మించి వంచించడం చంద్రబాబు నైజం: కాకాణి | Kakani Govardhan Reddy Slams Chandrababu | Sakshi
Sakshi News home page

రైతులను నమ్మించి వంచించడం చంద్రబాబు నైజం: కాకాణి

Published Sun, Dec 29 2024 7:27 PM | Last Updated on Sun, Dec 29 2024 7:33 PM

Kakani Govardhan Reddy Slams Chandrababu

సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో వ్యవసాయ రంగం(Agricultural sector) సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆవేదన చెందారు.

ఇప్పటివరకు 95 మంది రైతులు(Farmers) ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా చెబుతున్నా, అనధికారికంగా ఆ సంఖ్య 150కి పైగానే ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి గుర్తు చేశారు.

కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

సంక్షోభంలో వ్యవసాయ రంగం:
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతుల సమస్యలు పరిష్కరించకపోగా, ఎప్పటికప్పడు డైవర్షన్‌ పాలిటిక్స్‌తోనే సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం. ఒక పక్క భారీ వర్షాలు, వరదలు. మరోవైపు కరవు పరిస్థితి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.

రైతుల ఆత్మహత్యలు బాధాకరం:
తాజాగా వైయస్సార్‌ జిల్లాలో కన్నబిడ్డలతో సహా నాగేంద్ర, వాణి అనే రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతో కలిచి వేసింది. ఇది ప్రభుత్వ అసమర్థతను, వ్యవసాయ రంగం పట్ల వారి ఉదాసీనతను తెలియజేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారిక లెక్కల ప్రకారం 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అనధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య 150కి పైగానే అని సమాచారం.

రైతు ఆత్మహత్యలపై కూటమి పార్టీ నాయకులు దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆత్మహత్యలు ఎక్కువ చూపిస్తే చంద్రబాబు అసమర్థ పాలనపై ప్రజల్లో ఆగ్రహం వెల్లుబుకుతుందని వారి భయం. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా, రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం దండగ అని గతంలో ఒకసారి చంద్రబాబు అనడం అందరికీ గుర్తుంది.

పరిహార చెల్లింపులోనూ బాబు వంచన:
రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటుంటే వారి కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాల్సిన సీఎం చంద్రబాబు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఆయనది అదే ధోరణి. లక్ష రూపాయల పరిహారం కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారిని కించపర్చేలా మాట్లాడిన చంద్రబాబు, నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2003 నాటికి ఆ పరిహారం కూడా ఆపేశారు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన తర్వాత కూడా 2015, ఫిబ్రవరి 18 వరకు ఆ పరిహారం రూ.1.50 లక్షలు మాత్రమే ఇచ్చారు. దాన్ని రూ.5 లక్షలకు పెంచుతామని చెప్పి, ఆ డబ్బును నేరుగా బాధిత కుటుంబానికి కూడా అందజేయకుండా వంచించారు.

లక్షన్నర బ్యాంకు రుణాల కోసం కేటాయించి, మిగతా మూడున్నర లక్షలు కూడా వారికి ఇవ్వకుండా బ్యాంకుల్లో జమ చేసి వడ్డీతోనే జీవించాలనేలా చేసి మోసగించాడు. 2014– 19 మధ్య చూస్తే దాదాపు 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ప్రభుత్వం గుర్తించింది కేవలం 1223 మందిని మాత్రమే. ఆ మొత్తం కుటుంబాలకు కాకుండా, కేవలం 450 కుటుంబాలకు మాత్రమే రూ.20.12 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరిహారం:
2019లో జగన్‌గారు సీఎం అయ్యాక, రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని ఒకేసారి రూ.7 లక్షలకు పెంచడంతో పాటు, చంద్రబాబు పాలనా కాలంలో ఆత్మహత్యల పరిహారం అందని కుటుంబాలకు కూడా న్యాయం చేశారు. ఆ విధంగా 474 మంది రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కుతుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 1794 కుటుంబాలకు రూ.116.10 కోట్ల పరిహారం అందించగా, వారిలో 495 కుటుంబాలు కౌలు రైతులవి.

రైతులకు చంద్రబాబు మోసం:
నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తే.. 2014 అధికారంలోకి రావడం కోసం రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్న చంద్రబాబు, వారిని దారుణంగా మోసగించారు. మళ్లీ మొన్న ఎన్నికల్లో రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తానని చెప్పి, దాన్ని కూడా అమలు చేయకుండా మరోసారి మోసం చేశారు. రైతు భరోసా కింద వైయస్సార్‌సీపీ ప్రభుత్వం 53.58 లక్షల కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం చేసింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వారికి రూ.20 వేలు ఇవ్వాలంటే, ఈ ఏడాది రూ.10,718 కోట్లు కావాలి. కానీ, బడ్జెట్‌లో ఆ కేటాయింపు చేయకుండా మరోసారి చంద్రబాబు రైతులను వంచించారు.

ఎన్నికల కోడ్‌ వల్ల గత ప్రభుత్వం చెల్లించలేకపోయిన రూ.930 కోట్ల రైతుల ప్రీమియం, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చెల్లించని కారణంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు దక్కాల్సిన రూ.1385 కోట్ల బీమా దూరమైంది. ఉచిత పంటల బీమా పథకానికి కూడా కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. మా ప్రభుత్వ హయాంలో  యూనివర్సలైజేషన్‌ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేకుండా నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు, రైతులు చెల్లించాల్సిన ప్రీమియం, కేంద్ర ప్రీమియం కూడా చెల్లించడం జరిగింది. 

ఇదీ చదవండి: చంద్రబాబూ.. విజన్‌ అంటే అప్పులేనా?: బుగ్గన

రైతులకు బాబు బకాయి రూ.12,563 కోట్లు:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఏమేం ఎగ్గొట్టిందనేది చూస్తే.. ఆ విలువ ఏకంగా రూ.12,563 కోట్లు. 2023–24 రబీ సీజన్‌లో దాదాపు 3.91 లక్షల మంది రైతులకు చెందాల్సిన కరువు సాయం రూ.328 కోట్లు. సున్నావడ్డీ రాయితీ కింద 2023 సీజన్‌కి సంబంధించి 6.31 లక్షల మంది రైతులకు రూ.132 కోట్లు. పెట్టుబడి సాయం. సున్నా వడ్డీ పంట రుణాలు. కరవు సాయం.. ఇలా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు హామీ ఇచ్చి చంద్రబాబు ఎగ్గొట్టిన మొత్తం సాయం దాదాపు రూ.12,563 కోట్లు. వెంటనే ప్రభుత్వం వాటన్నింటినీ అందించాలి.

కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలు:
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉండగా  54.55 లక్షల మంది రైతులకు రూ.7802 కోట్లు బీమా పరిహారం చెల్లించడం జరిగింది. ఇంకా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తూ 10,778  రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పుడు కూటమి పాలనలో ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైంది.

ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగడం లేదు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సరిపడా ఎరువులు అందడం లేదు. రైతులే బహిరంగంగా కూటమి పాలనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్తా యూరియాపై రూ.100 అదనంగా బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారు. కొన్నిచోట్ల కాంప్లెక్స్‌ ఎరువులు కొనుగోలు చేస్తే తప్ప యూరియా దొరకని దుస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ధాన్యం కొనుగోళ్లలో దళారుల రాజ్యం నడుస్తోంది. వాట్సాప్‌లో హాయ్‌ అని పెడితే కొంటానని చెబుతాడే తప్ప ఎక్కడా మద్దతు ధరకు కొనుగోలు చేసిన పరిస్థితులు కనిపించడం లేదు.

ఇవీ మా డిమాండ్స్‌:
ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేల చొప్పున అందించాలి. ప్రతి పంటకు ఈ–క్రాపింగ్‌ చేసి ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి. ఆర్బీకే వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలి. రైతులకు బోనస్‌తో కలిపి మద్ధతు ధర చెల్లించాలి. ప్రభుత్వం ఇంకా రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే, వారి పక్షాన నిలబడి పోరాడుతామని కాకాణి గోవర్థన్‌రెడ్డి వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement