మనలో చాలా మంది ఏ పని ప్రారంభించాలన్నా వారం, వర్జ్యం అనేవి చూసుకుంటారు. అలాగే చాలా మంది మంగళవారం గోర్లు, వెంట్రుకలు కత్తిరించుకోవడం అశుభంగా భావిస్తారు. దీని వెనుక కారణమేంటో తెలుసా? వారంలో అన్ని రోజులు తెరిచి ఉండే సెలూన్ షాప్‌లు మంగళవారం మాత్రం మూసి ఉంటాయి. ఆరోజున క్షౌరశాలలు నిర్వహించే నాయి బ్రాహ్మణులు అందరూ సెలవు దినంగా పాటిస్తారు. పైగా ఆ రోజు ఏ మంచి పని మొదలుపెట్టరు. ఎక్కడికీ వెళ్ళరు మరీ అర్జెంటు.. తప్పనిసరి ఐతే తప్ప. మంగళవారం మంచిదికాదన్న సంగతి ఎలా వచ్చింది..? ఎవరు చెప్పారు..? ఎంతవరకు నిజం..? చూద్దామా!.
తమ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే హిందువులు ఎవరూ కూడా మంగళవారం రోజున కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోరు. శరీరంపై అంగారక గ్రహ ప్రభావం మంగళవారాన్ని అంగారక గ్రహం రోజుగా (Mars Day) భావిస్తుంటారు. అంగారక గ్రహం అనేది ఎరుపు వర్ణానికి చిహ్నం. ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది. గ్రహ ప్రభావం వల్ల మంగళవారం రోజున ఆ వేడి మానవ శరీరంపై ప్రభావం చూపుతుందంటారు. ఆ రోజు శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ. శరీరంపై గాట్లు పడే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. కాబట్టి ఆ రోజున కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోవద్దని పెద్దలు చెప్పారు.
జుట్టు కత్తిరించుకోడాన్ని ఆయుష్కర్మ అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పని చేయరాదు. ముందుగా గడ్డం, ఆపైన మీసం, ఆ తరువాత తలమీద ఉన్న జుట్టూ తీయించుకోవాలి. ఆపైన చేతిగోళ్లు, చివరగా కాలిగోళ్ళు తీయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరుసను అతిక్రమించరాదు. కొన్ని రోజులలో ఈ ఆయుష్కర్మ నిషిద్ధం. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య పౌర్ణమి తిధులు నిషిద్ధాలు. ప్రతినెలా వచ్చే సంక్రాంతి కూడా నిషిద్ధమే. వ్యతీపాత, విష్టి యోగ కరణాలలో, శ్రాద్ధ దినాలలో నిషిద్ధం. వ్రతదినాలైతే కూడా క్షవరము చేయించుకోరాదు.
ఆయుష్కర్మ చేయించుకునే వారాన్ని బట్టి ఆయుష్షు పెరగడం కానీ తరగడం కానీ ఉంటుంది. శుక్ర వారమైతే పదకొండు నెలలు, బుధవారం అయితే ఐదు నెలలు, సోమవార అయితే ఎనిమిది నెలలు ఆయుష్షు పెరుగుతుంది. గురువారమైతే ఆయుష్షు పది నెలలు పెరుగుతుంది. ఆదివారం క్షవరము చేయించుకుంటే ఆయుష్షు నెల రోజులు తగ్గుతుంది. శనివారం అయితే ఏడు నెలలు తగ్గుతుంది. మంగళవారం అయితే ఎనిమిది నెలలు తగ్గుతుంది.
పూర్వం షాపులు లేని రోజుల్లో ఇంటికి వచ్చే మంగలి పని చేసేవారు. (ఈ పదం వృత్తిరీత్యా వాడబడింది కానీ కులాన్ని సూచించేది కాదు.) ప్రతిరోజూ ఉద్యోగానికి వెడుతూ, గడ్డం, మీసం కావలసినంతగా కత్తిరించుకుని వెళ్లే అవసరం కూడా ఆ రోజుల్లో లేదు. మంగలి అతను వచ్చి క్షవరకర్మ చేసి వెళ్ళాక అతని భార్య వచ్చి ఇంట్లో వారిచ్చిన అన్నము, పదార్థాలు తీసుకుని వెళ్ళేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి.
పంచాంగం చూసి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం చూసి క్షవరకర్మ చేయించుకునే పరిస్థితి లేదు. క్షవర కర్మ వృత్తిలో ఉన్నవారు కూడా షాపు తెరిచి అక్కడకు వచ్చిన వారికే ఆయుష్కర్మ చేస్తున్నారు. కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంచితే వారికి కిట్టదు. ఈ సూత్రాలలో చెప్పినవన్నీ పూర్తిగా వదిలివేయడానికి భారతీయులు ఇష్టపడరు అందుకే క్షవరం చేయించుకుంటే ఆయుష్షు ఎక్కువగా తరిగిపోయే మంగళవారాన్ని మాత్రమే సెలవు దినంగా స్వీకరించడం జరిగింది.
తగాదలయ్యే అవకాశం ఎక్కువ..
అంగారక గ్రహ ప్రభావం కారణంగా మంగళవారం రోజున తగాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఇబ్బందుల్లో పడతారు. మంచి శకునాలు ఉండవు కాబట్టి ఆ రోజున ఏ కార్యం తలపెట్టినా అశుభంగా భావిస్తారు.
దేవతలకు ఆ రోజు ప్రత్యేకం
పూజలు, వ్రతాలకు ప్రత్యేకం ఇదే కాకుండా, మంగళవారం రోజున గోర్లు, జుట్టు కత్తిరించుకోకపోవడానికి మరో నమ్మకం కూడా ప్రాచుర్యంలో ఉంది. దుర్గాదేవి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఎక్కువగా మంగళవారాల్లోనే ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ఆ రోజున దేవతలను పూజించడం వల్ల మంచి ఐశ్వర్యం, ధన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. అమ్మవార్లకు సంబంధించి మంగళవారం ప్రత్యేక దినంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేయరు.
Comments
Please login to add a commentAdd a comment