
చిలుక పలుకులకు కారణం తెలిసింది..
వాషింగ్టన్: 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని వేమన చెప్పిన మాదిరి పక్షుల్లో కూడా చిలుకలది ప్రత్యేక స్థానం. ఎందుకంటే మిగిలిన పక్షులకు వేటికీ లేనిదీ, చిలుకలకు మాత్రమే సొంతమైన సామర్థ్యం మాట్లాడగలగడం. వీటికి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చిందో వాషింగ్టన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. చిలుకల మెదడులో ఉండే ప్రత్యేకమైన అసమాంతర నిర్మాణాలే మనుషులు చేసే శబ్దాలను అవి అనుకరించడానికి కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మిగిలిన పక్షుల్లో వేటికీ ఇలాంటి ప్రత్యేక నిర్మాణాలు లేవని తెలిపారు. వీటిపై గత 34 ఏళ్లుగా అధ్యయనాలు జరుగుతున్నా ఈ ప్రత్యేక నిర్మాణాలను ఇప్పటి వరకూ గుర్తించలేదని అన్నారు.
విన్న శబ్దాలను అనుకరించడానికి సాయపడే ప్రత్యేకమైన కర్పరాలు కూడా చిలుకల్లో ఉన్నట్టు గుర్తించారు. హమ్మింగ్ బర్డ్ వంటి కొన్ని రకాల జాతుల పక్షుల్లోనూ ఇలాంటి కర్పరాలు ఉన్నా.. వాటి పరిమాణం చిలుకల్లో పెద్దగా ఉన్నట్టు నిర్ధారించారు. అందువల్లనే మానవులు చెప్పే మాటలను ముద్దు ముద్దుగా పలకడం వీటికి మాత్రమే సాధ్యమైందని వివరించారు. అయితే వీటి మెదడులో ఇలాంటి ప్రత్యేక నిర్మాణాలు వీటి జాతి ఆవిర్భవించినప్పటి నుంచీ ఉన్నాయా.. లేక కాలక్రమేణా ఉద్భవించాయా.. అనే కోణంలో కూడా శాస్త్రవేత్తలు పరిశోధించారు. వీటికి ఈ ప్రత్యేకతలు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయని ధ్రువీకరించారు.