కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. లక్షల మందిని బలితీసుకుంది. ఆ వైరస్ పేరెత్తితేనే వణుకుపుట్టేలా చేసింది. మరోవైపు ఇదే సమయంలో కరోనా కన్నా మరో మరో పెద్ద ‘వైరస్’ మానవాళిని కబళించింది. ఇప్పటికీ ప్రతాపం చూపుతూనే ఉంది. అదే ‘అసమానతల’ వైరస్!.. ఇక్కడా అక్కడా అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కోట్లాది మంది జీవితాలు దీనితో చిన్నాభిన్నమైపోయినట్టు ప్రఖ్యాత ‘ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్’ తమ అధ్యయనంలో తేల్చింది. ఆ వివరాలేమిటో చూద్దామా..
కరోనా కారణంగా పెట్టిన లాక్‌డౌన్లు, నిబంధనలు ఓవైపు.. వైరస్ సోకి ఆస్పత్రుల్లో బిల్లుల కోసం చేసిన అప్పులు మరోవైపు.. ఉద్యోగాలు, ఉపాధి పోయి.. ఇంటిని పోషించేవారిని కోల్పోయి.. మధ్యతరగతి, పేద కుటుంబాల పరిస్ధితి దారుణంగా దిగజారింది. ఇదే సమయంలో ధనవంతుల ఆస్తులు మరింతగా పెరిగాయి. పెద్ద సంఖ్యలో కొత్త కోటీశ్వరులూ పుట్టుకొచ్చారు. ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో దీనికి సంబంధించి ఎన్నో ఆందోళనకర అంశాలను వెల్లడించింది.
అందరి నష్టం.. కొందరికి లాభం
కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా 2,755 మంది బిలియనీర్ల ఆస్తులు అత్యంత భారీగా పెరిగాయి. ఎంతగా అంటే.. సాధారణంగా 23 ఏళ్లలో పెరిగేంత సంపద కేవలం కరోనా టైంలో 24 నెలల్లోనే పెరిగింది.
► కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకువచ్చారు. మొత్తంగా 573 మంది బిలియనీర్లు కొత్తగా వచ్చారు. ఇందులో ఒక్క ఫార్మా రంగానికి చెందినవారే 40 మంది ఉన్నారు.
► ఇక ప్రతి 33 గంటలకు సుమారు పది లక్షల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయారు. మొత్తంగా 26.3 కోట్ల మంది అత్యంత పేదరికంలోకి జారిపోయారు.
► ఆహారం, అత్యవసర సరుకుల ధరలు రెండింతలు పెరిగి పేదలపై తీవ్ర భారం పడింది. ఇదే సమయంలో ఆయా రంగాల కంపెనీల యజమానుల సంపద ప్రతి రెండు రోజులకు రూ.15వేల కోట్ల మేర పెరుగుతూ వచ్చింది.
చదవండి: ముంచుకొస్తున్న మహమ్మారి.. పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే!
‘అసమానత’ మరింతగా..
► ప్రపంచంలో అత్యంత పేదరికంలో ఉన్న 40శాతం జనాభా (సుమారు 310 కోట్ల మంది) మొత్తం ఆస్తి కంటే.. కేవలం 10 మంది అత్యంత ధనవంతుల సంపదే ఎక్కువ.
►ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద 2019 నుంచి ఇప్పటివరకు 699శాతం పెరిగింది. ఇప్పటికిప్పుడు ఆయన సంపదలో 99శాతం పోయినా.. అత్యంత ధనవంతుల జాబితాలోనే ఉంటారు.
►ప్రపంచంలోని పైస్థాయి ధనవంతుల్లో ఒకరు ఒక్క ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని.. ఒక సగటు మధ్యతరగతి సంపాదించాలంటే ఏకంగా 112 ఏళ్లు పడుతుందని అంచనా.
►కరోనా ప్రభావం కారణంగా.. పురుషులు, మహిళల మధ్య వేతనాల తేడా మరింతగా పెరిగింది. మహిళలు ఉద్యోగాలు మానేసే శాతం ఎక్కువైంది.
కరోనా వ్యాక్సిన్లలోనూ..
పెద్ద ఫార్మా కంపెనీలు తమ వ్యాక్సిన్ సాంకేతికతను ఇతర కంపెనీలతో పంచుకోకపోవడంతో.. మొదట్లో సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. వ్యాక్సిన్లు అంది ఉంటే లక్షలాది మంది ప్రాణాలు నిలిచి ఉండేవని తెలిపింది.
►ఇప్పటివరకు ఉత్పత్తి అయిన మొత్తం వ్యాక్సిన్లలో 80 శాతానికిపైగా కేవలం 20 దేశాలకే (జీ20) అందాయి.
► పేద దేశాలకు అందిన వ్యాక్సిన్లు ఒక శాతం లోపే.
► ధనిక దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో కోవిడ్‌తో మరణించే ప్రమాదం 4 రెట్లు ఎక్కువ.
ప్రాణాలెన్నో తీసింది
►కరోనా ప్రభావం, ఆర్థిక సమస్యల కారణంగా..ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు సెకన్లకు ఒకరు, రోజుకు సుమారు 21,300 మంది మృతి చెందారు.
►సరైన వైద్యం అందక రెండేళ్లలో ఏటా 56 లక్షల మరణాలు నమోదయ్యాయి.
►తగిన ఆహారం అందక ఏటా 21 లక్షల మంది ఆకలి చావుల పాలవుతున్నారు.
►కరోనా కారణంగా ఇండియాలో 20 లక్షల మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment