సాక్షి, హైదరాబాద్/సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని పర్యటించి ఆలయ పునః ప్రారంభం తేదీలు, ముహూర్తాన్ని అక్కడికక్కడే ప్రకటించనున్నారు. ఉదయం 11.30కు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నింటిని మరోసారి సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. ఆలయం పునఃప్రారంభం ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారని, యాదాద్రిలోనే సీఎం స్వయంగా ప్రకటిస్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు.
పనులను పరిశీలించనున్న సీఎం...
కొండపైన ప్రధానాలయం ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. ఇంకా బస్‌బే, మెట్లదారి పనులు జరుగుతున్నాయి. క్యూలైన్ల ఏర్పాటు జరిగింది. ప్రసాదం కాంప్లెక్స్, మూడంతస్తుల క్యూకాంప్లెక్స్ పనులు పూర్తి చేశారు. గర్భాలయం ద్వారానికి బంగారు తాపడం పనులు జరుగుతున్నాయి. కొండకింద భక్తుల అవసరాల కోసం జరుగుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలిసి యాదాద్రి ఉద్ఘాటనకు రావాలని ఆహ్వానించిన విష యం తెలిసిందే. ప్రధానంగా కొండ కింద చేపట్టిన కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, రింగ్‌రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్, దీక్షాపరుల మండపం, అన్నప్రసాద వితరణ కేంద్రం, గండిచెరువు అభివృద్ధి పనులను సీఎం పరిశీలించనున్నారు.
యూనివర్సిటీ ఏర్పాటు
తిరుమల తిరుపతి తరహాలో యాదాద్రిలో యూనివర్సిటీ, మెడికల్ కళాశాల ఏర్పాటుపై సీఎం ప్రకటన చేసే అవకాశాలు ఉన్నా యని సమాచారం. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ పద్మావతి యూనివర్సిటీ ఉన్నాయి. యాదాద్రిలో సైతం విద్యార్థులకు అందుబాటులో ఉండేలా లక్ష్మీనరసింహ స్వామి పేరున యూనివర్సిటీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment