సీఎం చెప్పేదొకటి.. జీవోల్లో మరొకటి
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల పేర్లపై గందరగోళం నెలకొంది. ఫైనల్ గెజిట్‌లో ఒక పేరుండటం, వాడుకలో మరో పేరు ఉండటం, ముఖ్యమంత్రి చేసిన సూచనలు మరో తీరుగా ఉండటంతో విపత్కర పరిస్థితి నెలకొంది. ఏ పేరును ప్రామాణికంగా స్వీకరించాలి.. పరిపాలన వ్యవహారాల్లో ఏ పేరు వాడాలనే అయోమయం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాత పేర్లకు అనుబంధంగానే కొత్తగా ప్రతిపాదించిన పేర్లను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమీక్షలన్నింటా అధికారులకు ఆదేశాలిచ్చారు. దీని ప్రకారం గద్వాల జిల్లాకు జోగుళాంబ అని పేరు పెట్టినప్పటికీ ‘జోగుళాంబ గద్వాల’ జిల్లాగా కొనసాగించాలి.
కానీ కొత్త జిల్లాల ఆవిర్భావం రోజున జారీ చేసిన గెజిట్‌లో ‘జోగుళాంబ జిల్లా’ అని పేర్కొన్నారు. అదేవిధంగా సిరిసిల్ల కేంద్రంగా ‘రాజన్న జిల్లా’ అని జీవో ఇచ్చారు. కానీ అక్కడున్న ప్రభుత్వ కార్యాలయాలు, స్టాంపులన్నీ ‘రాజన్న సిరిసిల్ల’ పేరుతో చెలామణిలోకి వచ్చాయి. కుమ్రం భీం, జయశంకర్ జిల్లాలన్నింటా ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం యాదాద్రి పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని గుర్తించారు. యాదాద్రి జిల్లా పేరును ‘యాదాద్రి భువనగిరి’ జిల్లాగా పిలవాలని ప్రకటించారు. ఇప్పటికైనా అధికారులు కొత్త జిల్లాలకు పెట్టిన పేర్లపై మరింత స్పష్టత ఇచ్చేలా.. జీవోల్లో ఉన్న తీరొక్క పేర్లను సవరించాల్సిన అవసరముంది.
యాదాద్రి పేరు యాదాద్రి భువనగిరి: సీఎం కేసీఆర్
యాదాద్రి జిల్లాను ‘యాదాద్రి భువనగిరి’ జిల్లాగా పిలవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట, జిల్లా కేంద్రంగా భువనగిరి జంటగా అభివృద్ధి చెందుతాయని సీఎం అన్నారు. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంచాలని సూచించారు. బుధవారం సాయంత్రం యాదాద్రి నుంచి తిరిగి వస్తుండగా కేసీఆర్ భువనగిరిలో కాసేపు ఆగారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన భువనగిరిలోని ఎలిమినేటి కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కుటుంబ యోగక్షేమాలు, ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ సమయంలో గడిపిన సందర్భాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జిల్లా కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో భువనగిరి పట్టణం చాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంఎంటీఎస్, రీజనల్ రింగ్ రోడ్ భువనగిరి నుంచే వెళ్లనున్నందున రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని అన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
కొత్త జిల్లాలకు తీరొక్క పేరు..!
Published Thu, Oct 20 2016 1:24 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement