విలేకరులతో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి తదితరులు
భద్రాచలంటౌన్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భద్రాచలం పట్టణాన్ని టెంపుల్ సిటీగా మారుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాచైతన్య బస్సుయాత్రలో భాగంగా బుధవారం భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజలను, నిరుద్యోగులను, రైతులతో పాటు భారతావనికి ఆరాధ్యుడైన శ్రీసీతారామచంద్రస్వామి వారిని కూడా మోసం చేశారని విమర్శించారు.
రామాలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చి మూడేళ్లు గడిచిన ఒక్క పైసా విడుదల చేయలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలకే పేర్లు మార్చి, తమ ఘనతగా టీఆర్‌ఎస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. శబరినదిపై హైడల్ పవర్ ప్రాజెక్టును, దానికి కింద శబరి, గోదావరి కలిసే ప్రాంతంలో దుమ్ముగూడెం వద్ద అద్భుతమైన ఇందిరాసాగర్ ప్రాజెక్టును రూపకల్పన చేసి 80 శాతం పనులను పూర్తి చేస్తే, ఆ ప్రాజెక్టును తీసేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక మాఫియాకు అడ్డాగా భద్రాచలం మారిందని, ఇసుక ర్యాంప్‌లన్నీ టీఆర్‌ఎస్ నాయకులవేనని అన్నారు. కేసీఆర్‌కు ప్రజలన్నా, రాముడన్నా, దేవుడన్నా, ఆచారాలు, సాంప్రదాయాలన్నా గౌరవం లేదన్నారు. సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వనమా వెంకటేశ్వరరావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాంబాబు, నాయకులు తోటకూర రవిశంకర్, బుడగం శ్రీనివాస్, బొలిశెట్టి రంగారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment