
సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వర్తించని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో వెంటనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు భాగమైనందున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మించే పనులకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ఆయన సమీక్షించారు.
బడ్జెట్ ప్రతిపాదనలను వాస్తవిక అంచనాల మేరకు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బడ్జెట్ రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, సమాచార శాఖ కమిషనర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
భూములపై నిరంతర పర్యవేక్షణ
రెవెన్యూ శాఖ సమీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ప్రభుత్వ భూములపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వం చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కోర్టు కేసుల్లో ఉన్న భూములను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కోరారు. సినిమా రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు సమాజ వికాసానికి దోహదపడే విధంగా లఘుచిత్రాలను తీసుకువచ్చేందుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు.
హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల చుట్టూ పేద, మధ్య తరగతి ప్రజల కోసం శాటిలైట్ టౌన్‌షిప్ నిర్మాణాలపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్‌లోని మధ్య తరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసేందుకు ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపడం ద్వారా భూసేకరణ చేసుకోవాలని సూచించారు.
ఇక, రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వేకు సంబంధించి అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాల జాబితాను సేకరించాలని, ప్రతి నెలా ఈ అద్దెలను చెల్లించేలా ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment