indiramma house construction
-
ఆ జాబితా పరిగణించం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్లీ పేచీ నెలకొంది. గ్రామీణ ప్రాంత ఇళ్లకోసం అందిన సుమారు 30 లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి, జాబితా సిద్ధం చేసింది. ఆ దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణనలోకి తీసుకోబోమని.. తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్లీ సర్వే చేసి వివరాలు అందజేయాలని కేంద్రం తేల్చిచెప్పింది. దీనితో కంగుతినడం రాష్ట్ర ప్రభుత్వం వంతు అయింది. అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్ర యాప్‌తో మళ్లీ సర్వే చేయటం ఇప్పటికిప్పుడు అయ్యే పనికాదు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది.కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందితే.. లబ్ధి దారులకు మొదటి విడత సొమ్ము అందజేసేందుకు సిద్ధమైంది. అలాంటిది కేంద్రం పెట్టిన మెలికతో గందరగోళం మొదలైంది. కేంద్రం నుంచి అందే నిధుల కోసం.. దాదాపు పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణ పరిధిలో దాదాపు 19 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. ఇప్పుడు వచ్చే నాలుగేళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో వీలైనన్ని నిధులను కేంద్రం నుంచి పొందాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది.ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తుందనేది కేంద్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడదని, కేంద్రం ఖరారు చేసిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అనర్హులకు ఇళ్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వబోమని షరతులు పెట్టింది. దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసింది. కానీ సర్వే విషయంలోనే ఇప్పుడు చిక్కు వచి్చంది. కేంద్రం రూపొందించిన యాప్‌తో మళ్లీ సర్వే.. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకోసం ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీలనాంశాల ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవలే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి.. 23 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. ఇందులో 19.50 లక్షల మంది సొంత జాగా ఉన్నవారుకాగా.. మూడున్నర లక్షల మంది సొంత భూమి లేనివారు.రాష్ట్రం తాజాగా ఈ వివరాలను కేంద్రానికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరింది. అయితే తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా ఈ సర్వే జరగనందున పరిగణనలోకి తీసుకోబోమని, ఆ మొబైల్ యాప్ ద్వారా మళ్లీ సర్వే చేసి వివరాల జాబితా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ప్రామాణికంగా నిర్ధారించిన అంశాలనే పరిగణనలోకి తీసుకుని సర్వే చేశామని, వివరాల్లో ఎలాంటి తేడా ఉండదని.. దీన్ని గుర్తించి ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వ యాప్‌తో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.అయినా కేంద్రం ససేమిరా అంటున్నట్టు తెలిసింది. దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి వివరాలేవీ లేవని, అవి లేకుండా జాబితా తీసుకోబోమని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇవి పెద్దగా తేడా చూపే అంశాలు కాదని, ఇళ్లను మంజూరు చేసేనాటికి ఆ వివరాలను కూడా అప్లోడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోరినట్టు తెలిసింది. కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్నా... కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కేంద్ర నిధులు రాకుంటే పథకం భారమే! పట్టణ ప్రాంత ఇళ్లకు కేంద్రం యూనిట్ కాస్ట్‌ను రూ.లక్షన్నరగా ఖరారు చేసింది. దీనితో వీలైనన్ని ఎక్కువ ఇళ్లను పట్టణ ప్రాంత ఖాతా కింద పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా మంజూరు చేసే పట్టణ ప్రాంత ఇళ్లలో 4 శాతాన్ని తెలంగాణకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది చాలా తక్కువని, సంఖ్య మరింత పెంచాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది.కానీ స్పష్టత రావాల్సి ఉంది. ఇక గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి యూనిట్ కాస్ట్ రూ.73 వేలుగా ఉంది. ఈ నిధులన్నా పొందుదామంటే కేంద్రం పెట్టిన మెలిక కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి సాయం అందని పక్షంలో మొత్తం నిధులను రాష్ట్రమే భరించాల్సి వస్తుంది. అది పెద్ద భారంగా మారుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆ జిల్లాల్లో ఇందిరమ్మ నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వర్తించని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో వెంటనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు భాగమైనందున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మించే పనులకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ఆయన సమీక్షించారు. బడ్జెట్ ప్రతిపాదనలను వాస్తవిక అంచనాల మేరకు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బడ్జెట్ రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, సమాచార శాఖ కమిషనర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. భూములపై నిరంతర పర్యవేక్షణ రెవెన్యూ శాఖ సమీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ప్రభుత్వ భూములపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వం చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కోర్టు కేసుల్లో ఉన్న భూములను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కోరారు. సినిమా రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు సమాజ వికాసానికి దోహదపడే విధంగా లఘుచిత్రాలను తీసుకువచ్చేందుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల చుట్టూ పేద, మధ్య తరగతి ప్రజల కోసం శాటిలైట్ టౌన్షిప్ నిర్మాణాలపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్‌లోని మధ్య తరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసేందుకు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇళ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపడం ద్వారా భూసేకరణ చేసుకోవాలని సూచించారు. ఇక, రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వేకు సంబంధించి అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాల జాబితాను సేకరించాలని, ప్రతి నెలా ఈ అద్దెలను చెల్లించేలా ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
మరిన్ని గ్రామాల్లో సీఐడీ విచారణ!
‘ఇందిరమ్మ’అక్రమాల విచారణ విస్తృతం సీఐడీకి ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు పలు గ్రామాల్లో విచారణ మొదలు.. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం మరో ఏడాదివరకు ఎదురుచూపే సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాల నిగ్గు తేల్చేందుకు మొదలైన సీఐడీ విచారణ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లోనే ఇళ్ల వివరాలను పరిశీలించిన సీఐడీ అధికారులు.. తాజాగా మరిన్ని గ్రామాలకు విచారణను విస్తరించారు. ఈ దిశగా సీఐడీ అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో పేదల ఇళ్ల పథకం మరిన్ని రోజులు స్తబ్ధంగానే ఉండిపోనుంది. కొత్తగా టీఆర్ఎస్ సర్కారు తలపెట్టిన రెండు పడక గదుల ఇళ్లు మరికొంత కాలం ఆలస్యం కానున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణను మొదలుపెట్టిన సీఐడీ నిర్ధారిత 36 గ్రామాల్లో విచారణను పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ విచారణలో వందల సంఖ్యలో అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, లబ్ధిదారులను అక్రమాలకు బాధ్యులుగా గుర్తించింది. అయితే వీరందరిపై అభియోగాల నమోదు విషయంలో గందరగోళం నెలకొంది. ఒక్కో ఇంటి యూనిట్ కాస్ట్ చాలా తక్కువ అయినందున... చాలా మంది విషయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన సొమ్ము అతి స్వల్పంగా ఉంది. అసలు ఇళ్లే కట్టకుండా.. బిల్లులు కాజేసిన కొన్ని కేసుల్లో మాత్రమే భారీ అవినీతి కనిపిస్తోంది. ఇప్పుడు అలాంటి ఇళ్లు నిగ్గు తేల్చాలని భావిస్తున్న ప్రభుత్వం... విచారణను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో... సీఐడీ అధికారులు మరిన్ని గ్రామాల్లో విచారణ మొదలుపెట్టారు. వాటికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ నుంచి వివరాలు సేకరించారు కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి బడ్జెట్లో ఈ పథకానికి రూ. 390 కోట్లు మాత్రమే కేటాయించటం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే సీఎం స్వయంగా పర్యటించి హామీ ఇచ్చిన వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు నిజామాబాద్‌లోని ఓ గ్రామం, సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో మాత్రమే ఈ ఏడాది ఈ పథకం కింద కొన్ని ఇళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హామీ ‘భారం’ చూసి బెంబేలు.. పేదలకు రూ. 3.50 లక్షలతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ 3.5 లక్షలతో అలాంటి ఇళ్ల నిర్మాణం అసాధ్యమని అధికారులు తేల్చారు. తాజాగా వారు రూపొందించిన లెక్కల ప్రకారం ఒక్కో ఇంటికి రూ. 6.50 లక్షల వరకు అవసరమని తేలింది. దీంతో ఈ పథకం కోసం సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం బడ్జెట్లో గృహ నిర్మాణ కేటాయింపులను గతం కంటే తగ్గించి... సాయం చేసే అవకాశం లేదని తేల్చేసింది. ఈ నేపథ్యంలో తలకుమించిన భారంగా మారే ఈ పథకాన్ని వాయిదా వేసేందుకు... సీఐడీ విచారణను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిదాకా ఎదురుచూపులే.. టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు దీరగానే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం మొదలవుతుందని పేదలు ఆశగా ఎదురు చూశారు. కానీ సీఐడీ దర్యాప్తు పేరిట చూస్తుండగానే ఏడాది కాలం గడిచిపోయింది. ఇటీవల సీఐడీ దర్యాప్తు పూర్తవడంతో.. కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా పనులు మొదలవుతాయని పేదలు ఆశించారు. కానీ ప్రభుత్వం సీఐడీ దర్యాప్తును మరికొంతకాలం పొడగించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది కూడా పేదలకు ఎదురుచూపులు తప్పే పరిస్థితి కనిపించడంలేదు. -
ఇక రెండో ద శ
సాక్షి, మంచిర్యాల : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమార్కులను తేల్చేందుకు సీఐడీని రంగంలోకి దించిన తెలంగాణ సర్కారు దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న వాటితోపాటు తమరో రెండు నియోజకవర్గాలలోని లబ్ధిదారుల వివరాల ఆధారంగా రెండో విడత దర్యాప్తును చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 2006లో ప్రారంభ మైన ఈ పథకం కింద జిల్లాలో 53,963 ఇళ్లు మంజూరు కాగా లబ్ధిదారులు ఆయా దశలను పూర్తిచేసుకొని ఇప్పటివరకు రూ.814 కోట్లు పొందారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో సర్కారీ సొమ్ము లబ్ధిదారుల రూపేణా చెల్లించినప్పటికీ అర్హులకు దక్కలేదని సీఐడీ దర్యాప్తులో స్పష్టమైంది. అనుమతులతోపాటు బిల్లులు చెల్లించే దశలోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ధ్రువీకరించారు. సీఐడీ బృందాలు రెండు బృందాలు మొదటి విడతలో భాగంగా ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో విచారణ చేపట్టాయి. శనివారం వరకు కొనసాగిన ఈ దర్యాప్తులో సుమారు 1900 ఇళ్లకు చెందిన అనుమతులు, బిల్లుల చెల్లింపు, సిమెంటు అందజేయడం, ఇటుకలకు బిల్లులు చెల్లింపు అంశాలను పరిశీలించారు. అదే సమయంలో ఆయా బ్యాంకులు, గృహ నిర్మాణశాఖ, గ్రామ సమైఖ్య సంఘాలకు చెందిన రికార్డులను క్షుణ్ణంగా విశ్లేషించారు. దాదాపు రూ.2కోట్ల వరకు సర్కారీ సొమ్ము పక్కదారి పట్టినట్లు తేలింది. ఈ నివేదికను సీఐడీ ఉన్నతాధికారి చారుసిన్హాకు అందజేసి ఆ తర్వాత వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మొదటి దశను కొనసాగిస్తూ రెండో దశకు సిద్ధం కావడంపై స్పష్టత రానున్నట్లు సమాచారం. -
ఇళ్లు కట్టకుండానే బిల్లులు మంజూరైనట్లు గుర్తింపు
-
గృహ నిర్మాణాలపై ‘సిట్’ దర్యాప్తు
ఖమ్మం రూరల్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు రుజువైతే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని సీబీసీఐడీ డీఎస్పీ బాలూజాదవ్ చెప్పారు. ఖమ్మం రూరల్ మండలంలో 2004- 2014 మధ్య కాలంలో నిర్మించిన పక్కాగృహాల లబ్ధిదారుల వివరాలను తీసుకునేందుకు సోమవారం ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 - 2014 మధ్య ఇందిరమ్మ, ఎమ్మెల్యే కోటా కింద నిర్మించిన ఇళ్లపై సిట్ బృందం దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని తెలిపారు. ఈ బృందంలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారని, ప్రతి ఇంటిని పరిశీలించి అన్ని వివరాలు నమోదు చేస్తామని చెప్పారు. మంగళవారం ఎం.వెంకటాయపాలెంలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. విచారణలో అవినీతి జరిగినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై 406, 409, 420, 120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
ఆరంభించని ఇందిరమ్మ ఇళ్లు.. రద్దు!
సాక్షి, విజయవాడ: నిర్మాణం మొదలైన ఇళ్లు సగంలోనే ఆగిపోయాయి. నిధులకు బ్రేకులు పడ్డాయి. మరోవంక... నిర్మాణం మొదలుకాని ఇళ్లకు మంగ ళం పాడేయటానికి కూడా రెడీ అయిపోయారు. ఇదీ... ఇందిరమ్మ ఇళ్ల దుస్థితి. ఎన్నికలు... ప్రభుత్వం మారటం వంటి కారణాలతో మార్చి నుంచి లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులన్నీ నిలిపేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.363.66 కోట్ల విడుదల ఆగిపోయింది. పులిమీద పుట్రలా 2011కు ముందు మంజూరై ఇప్పటి దాకా ప్రారంభించని ఇళ్లను రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పిడుగు పాటే. రాష్ట్రంలో 2011 మార్చికి ముందు మంజూరై ఇప్పటి దాకా నిర్మాణం ప్రారంభం కాని పక్కా ఇళ్లు ఎన్ని ఉన్నాయో గుర్తించి నివేదికలు పంపాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతా వివరాలు తెప్పించుకునే పనిలో పడ్డారు. జిల్లాల నుంచి నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వం రద్దు నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. -
గూటికి చేరేదెప్పుడో?
కందుకూరు, న్యూస్‌లైన్ : కందుకూరు హౌసింగ్ డివిజన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన ఇళ్లలో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్ల పరిస్థితి అయోమయంలో ఉంది. రెండు నెలల పాటు ప్రభుత్వ అధికారులు సమ్మెలోకి వెళ్లడంతో ఆ సమయంలో నిర్మాణం మొదలుపెట్టిన ఇళ్లకు సంబంధించిన బిల్లులు ఇంతవరకు రాలేదు. దీంతో కొన్ని మధ్యలో ఆగిపోయాయి. ఇళ్లు మంజూరైనా ఇనుము, సిమెంటు, ఇటుక ధరల పెరుగుదలతో ప్రభుత్వం ఇచ్చే బిల్లు సరిపోదని కొందరు నిర్మాణం చేపట్టలేకపోతున్నారు. మరికొందరు ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నారు. అయితే బేస్మెంట్ పనులు చేస్తేనే మొదటి విడత బిల్లులు మంజూరవుతాయి. అయితే సగం నిర్మాణం పూర్తయి వారి ఇళ్లకు బిల్లులు ఆలస్యం అవుతున్నాయి. తమకు బిల్లులు ఎప్పుడు వస్తాయో అని కొందరు పునాది వేయడానికి జంకుతున్నారు. దీంతో పేదవాడి ఇందిరమ్మ గూడు కలగానే మిగులుతోంది. ఇదీ డివిజన్లో పరిస్థితి కందుకూరు హౌసింగ్ డివిజన్ పరిధిలో కందుకూరు, కనిగిరి, కొండపి, దర్శి నియోజకవర్గాలున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 8,891 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో కేవలం 50 శాతం నిర్మాణాలను మాత్రమే పూర్తయ్యాయి. దీనిపైనే ఇటీవల నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ హౌసింగ్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేక పోయారని కలెక్టర్ ప్రశ్నించారు. ఈ నెల 15వ తేదీలోగా పెండింగ్ నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. డివిజన్ పరిధిలో నిర్మించాల్సిన ఇళ్ల సంఖ్య భారీగా ఉండడమే దీనికి కారణం. డివిజన్ పరిధిలో గత ఏడాదికి 8,891 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 4,558 మాత్రమే అధికారులు పూర్తిచేశారు. ప్రస్తుతానికి కందుకూరులో 987, దర్శిలో 1104, కొండెపిలో 864, కనిగిరిలో 1503 ఇళ్లను మాత్రమే పూర్తిచేశారు. వీటిలో కందుకూరు నియోజకవర్గంలో 1887, దర్శిలో 2128, కొండెపిలో 1698, కనిగిరిలో 3280 ఇళ్లను కట్టాలి. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల వివరాలు రూఫ్ లెవల్లో 2,333 లింటల్ లెవల్లో 551 బేస్మెంట్ లెవల్ కంటే పైగా 367 బేస్మెంట్ లెవ్లో 3,667 బేస్మెంట్ కంటే తక్కువ స్థాయిలో 602 ఇదిలా ఉండగా ఇటీవల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అర్జీలు ఇచ్చిన వారికి జీవో 23 కింద డివిజన్లో 11,175 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు ఒక్కటి కూడా మొదలు పెట్టిన దాఖాలాలు లేవు. నిర్మాణం మొదలుపెడితేనే మొదటి విడత బిల్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే రుణాలను పెంచింది. అయినా గృహ నిర్మాణ ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఇష్టపడడం లేదు.