ఖమ్మం రూరల్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు రుజువైతే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని సీబీసీఐడీ డీఎస్పీ బాలూజాదవ్ చెప్పారు. ఖమ్మం రూరల్ మండలంలో 2004- 2014 మధ్య కాలంలో నిర్మించిన పక్కాగృహాల లబ్ధిదారుల వివరాలను తీసుకునేందుకు సోమవారం ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 - 2014 మధ్య ఇందిరమ్మ, ఎమ్మెల్యే కోటా కింద నిర్మించిన ఇళ్లపై సిట్ బృందం దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని తెలిపారు. ఈ బృందంలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారని, ప్రతి ఇంటిని పరిశీలించి అన్ని వివరాలు నమోదు చేస్తామని చెప్పారు. మంగళవారం ఎం.వెంకటాయపాలెంలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. విచారణలో అవినీతి జరిగినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై 406, 409, 420, 120బీ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
గృహ నిర్మాణాలపై ‘సిట్’ దర్యాప్తు
Published Tue, Aug 12 2014 2:20 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement