మామూళ్లు ఇవ్వకుంటే అంతే!
నెల్లూరు, సిటీ: అవినీతి, అక్రమాలకు అడ్డాగా నెల్లూరు కార్పొరేషన్ మారింది. కొందరు అధికారులు మామూళ్లు మత్తులో జోగుతున్నారు. కాసులు రాలని ఫైళ్లు కదలడం లేదు. కొత్తగా వచ్చిన ప్రతి కమిషనర్ అవినీతిని అరికడతామని, ప్రతి అర్జీదారుడు సిటిజన్ చార్టర్‌లోనే సేవలు పొందే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఏ విభాగంలోనైనా ఆలస్యం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని, జరిమానా విధిస్తామని ప్రస్తుత కమిషనర్ హెచ్చరించినా వారిలో మాత్రం మార్పు రావడం లేదు.
దీంతో కార్పొరేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే మధ్యవర్తులను, అధికార పార్టీ నాయకులను ఆశ్రయించక తప్పడం లేదు. అధికారుల అక్రమాలు తారాస్థాయికి చేరడంతో కమిషనర్ కన్నెర్ర చేశారు. రెవెన్యూ విభాగంలోని 16మంది అధికారులకు జీతంలో కోత విధిస్తున్నట్లు కమిషనర్ వెంకటేశ్వర్లు మెమో జారీ చేశారు. మొత్తం రూ.83వేలు నగుదు జరిమానా విధించారు.
రెవెన్యూ విభాగ అధికారులకు మెమో
జీతంలో కోతపడిన వారిలో ఆర్‌ఓలు సమధ్, గిరిజ, ఆర్‌ఐలు కృష్ణారావు, ప్రవీణ్, చిన్నబాబు, చెంచయ్య, కృపాకర్, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్లు సుహాసిని, లోకనాథం, శరత్‌బాబు, శ్యామల, శివకుమార్, పద్మావతి, నారాయణరెడ్డిలు ఉన్నారు. వీరివద్ద నుంచి ఈనెల జీతంలో రూ.83,251 కోత విధించనున్నారు.
అన్ని విభాగాల్లో ఆలస్యమే
నగర పాలకసంస్థలో ఇంజనీరింగ్, హెల్త్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు ఉన్నాయి. కార్పొరేషన్ కార్యాలయంలో ఆయా విభాగాల్లో మొత్తం 22 సేవలు అందుబాటులో ఉంచారు. కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్లలో మొత్తం 7లక్షల జనాభా ఉన్నారు. వివిధ రకాల సేవల కోసం నిత్యం పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు కార్పొరేషన్‌కు వస్తుంటారు. అయితే సమయానికి అందించాల్సిన సేవలను కొందరు సిబ్బంది ఆలస్యం చేస్తున్నారు. దీంతో నెలల తరబడి కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తుంది. అదే చేతులు తడిపితే నిమిషాల్లో పనులు పూర్తవుతున్నాయి.
మధ్యవర్తులదే హవా
కార్పొరేషన్‌లో మధ్యవర్తులు, అధికారపార్టీ నాయకులు చెబితే పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. అధికారులు, సిబ్బంది సైతం ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించారు. వారు నిర్ణయించిన మామూళ్లు ఇస్తేనే ఫైల్ త్వరగా ఇస్తారు. వీరికి సిటిజన్ చార్టర్‌తో పనిలేదు. కేవలం మధ్యవర్తులు ద్వారానే ప్రతి పని సమయానికి అవుతుంది.
అలంకార ప్రాయంగా సీసీ కెమెరాలు
గత కమిషనర్ పీవీవీఎస్ మూర్తి రూ.4.50లక్షలతో అన్ని విభాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే కొత్తగా వచ్చిన కమిషనర్ సీసీ కెమారాలు వినియోగిస్తే కార్యాలయంలో జరిగే అవినీతిని అరికట్టేందుకు వీలుంటుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా ఉన్నాయని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.