కంచే చేను మేసే..! | Nilgiri municipality irregularities corruption | Sakshi
Sakshi News home page

కంచే చేను మేసే..!

Published Tue, Sep 12 2017 11:52 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

కంచే చేను మేసే..! - Sakshi

కంచే చేను మేసే..!

నీలగిరి మున్సిపాలిటీలో ఆగని అక్రమాలు
అభివృద్ధి మాటున స్వాహాపర్వం
పనులు చేయకుండానే నిధులు కాజేసిన వైనం
ఇంజనీరింగ్‌ విభాగం పనుల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు
సమగ్రంగా విచారిస్తే రూ.కోట్ల అక్రమాలు వెలుగులోకి..


నీలగిరి మున్సిపాలిటీ పరిధి 19వ వార్డులో పైప్‌లైన్‌ పనులకు 2016లో టెండర్లు పిలిచారు. టెండర్‌ దక్కించుకున్న సంబంధిత కాంట్రాక్టర్‌ ఆ వార్డులో నేటికీ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. సుమారు రూ.9 లక్షల వర్క్‌లో ఎలాంటి పని చేయకుండానే అప్పటి మున్సిపల్‌ ఏఈ, ఈఈ, డీఈ కలిసి రూ.6 లక్షలకు ఎంబీ రికార్డులు పూర్తి చేసి కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించారు.

నల్లగొండ టూటౌన్‌ : అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు రా ష్ట్రంలోనే పేరుగాంచిన నల్లగొండ మున్సిపాలిటీ మరో మరకను అం టించుకుంది. అభివృద్ధి పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కంచే చేను మేసిన రీతిలో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు విస్మయాన్ని కలిగిస్తోంది.

ధనార్జనే ధ్యేయంగా..
కొందరు అధికారులు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు తెలిసింది. గతంలో నీలగిరి మున్సిపాలిటీలో పనిచేసి బదిలీ అయిన ఏఈ, ఈఈ కలిసి మున్సిపాలిటీకి కుచ్చుటోపీ పెట్టారు. ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనుల్లో అవినీతి ఏరులై పారింది. సీసీ రోడ్లు, పైప్‌లైన్‌ పనులు, డ్రెయినేజీ తదితర పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. చేసిన పని కన్నా అంచనాలను ఎక్కువగా చూపించి అందిన కాడికి స్వాహా చేశారు. అదే విధంగా ఒకే పనికి రెండు సార్లు బిల్లులు చేసిన ఘనత కూడా ఇక్కడి అధికారులకే చెల్లింది.

సబంధిత ఏఈ  ఇక్కడ పని చేసిన కాలంలో దాదాపు అరకోటి (రూ.50 లక్షలు) వరకు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది అధికారులే తప్పులు చేసి అది వెలుగు చూసిన తర్వాత నెపం కాంట్రాక్టర్లు, ఇతర కింది స్థాయి ఉద్యోగుల మీద   నెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేకపోలేదు. మున్సిపాలిటీలో పని చేసి బదిలీ అయ్యే ముందు కాంట్రాక్టర్ల ద్వారా అవినీతికి తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.

ఏడాదిన్నర కిందటే నొక్కారు..!
19వ వార్డులో పైప్‌లైన్‌ వేయకుండానే ఎంబీ రికార్డులు పూర్తి చేసి రూ. 6 లక్షలు చెల్లించిన తతంగం ఏడాదిన్నర కిందటే జరిగినట్టు మున్సిపల్‌ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. కాంట్రాక్టర్‌ పని మొదలు పెట్టకుంటూ ఒక్క రూపాయి కూడా ఇచ్చేందుకు మున్సిపల్‌ నిబంధనలు ఒప్పుకోవు. రూ.20 వేలకు కూడా పని చేసిన తర్వాత నెలల తరబడి తిప్పుకునే సంబంధిత అధికారులు మొదలు పెట్టకుండానే రూ. లక్షల రూపాయలు విడుదల చేయడం వారి స్వాహాకార్యాన్ని తేటతెల్లంచేస్తోంది. అయితే రూ.6 లక్షలు విడుదలై ఏడాదిన్నార దాటినా నేటికీ అవినీతి బాగోతం బయట పడకుండా నొక్కి పెట్టారు. అప్పటి అధికారులు చేసిన అక్రమాలు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారంటే అక్రమార్కులను కాపాడడానికేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

అక్రమాలు మచ్చుకు కొన్ని..
ఓ వార్డులో వేసిన సీసీ రోడ్డుకు 30 మీటర్ల వరకు అదనంగా బిల్లులు చేసి నిధులు కాజేశారు. అదే విధంగా  ప్రకాశం బజారులో సీసీ రోడ్డుకు సంబంధించి రూ.5 లక్షలు, పాతబస్తీ ప్రాంతంలో మూడు వార్డులలో డ్రెయినేజీ, సీసీ రోడ్డుకు  రూ.11.50 లక్షల వరకు పక్కదారి పట్టించిన విషయం బహిరంగ రహస్యమే. అభివృద్ధి మాటున అప్పటి ఏఈ, ఈఈ కలిసి నడిపించిన అక్రమాల పరంపర దాదాపు అరకోటి వరకు ఉన్నట్లు తెలిసింది. ఆ ఇద్దరు అధికారులు పని చేసిన కాలంలో చేసిన అభివృద్ధి పనులు, మోటార్ల కొనుగోలు, కొత్త బోర్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, లైట్ల కొనుగోలు తదితర వాటిపై సమగ్ర విచారణ జరిపితే వారి అక్రమాల చిట్టా చాంతాడంతా బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement