nilgiri municipality
-
‘మెప్మా’లో అవినీతి కంపు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీ మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)లో అవినీతి ఏరులై పారుతోందా?... చేయి తడపనిదే చిన్న పని కూడా కాదా?... ప్రతి పనికి పర్సేంటేజి ముట్టజెప్పాల్సిందేనా?... ప్రభుత్వ సబ్సిడీ రుణాల్లో పర్సేంటేజీ పెంచారా? ...మహిళా సంఘాల రుణంలో లక్షకు వెయ్యి ముట్టజెప్పాల్సిందేనా?...అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. మెప్మాలో పని చేస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఏకంగా ఫోన్లోనే బేరసారాలకు దిగిన ఘటన జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించింది. మెప్మా విభాగంపై మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంలో అక్కడ వారు ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. కొంత మంది సీఓ (కమ్యూనిటీ ఆర్గనైజర్)లు అందినకాడికి దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కార్యాలయానికి వివిధ సమాచారం కోసం వచ్చే వారికి ఏ మాత్రం చిక్కరు, దొరకరు ... దొరికినా పూర్తి వివరాలు చెప్పకుండా తలబిరుసుగా వ్యవహరిస్తారనే ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. మహిళా సంఘాల వారికి రుణాల వడ్డీ వివరాలు సైతం చెప్పకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిసింది. సబ్సిడీ రుణాలంటే పండుగే ... రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వివిధ వర్గాల వారికి సబ్సిడీ రుణాలు అందజేస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను మెప్మా వారే ఎంపిక చేస్తున్నారు. 2017–18 కి గాను ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి 129యూనిట్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారీతిలో చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వార్డు సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. బ్యాంకు మేనేజర్, మున్సిపల్కమిషనర్, షెడ్యుల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారి, వార్డు కౌన్సిలర్ కమిటీలో ఉండి ప్రజల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇవేమి పట్టించుకోకుండా చేయి తడిపిన వారికే రుణాలు ఇస్తునట్లు తెలుస్తోంది. సబ్సిడీ రుణాలు వస్తే వీరికి పండుగేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్ల పైరవీ ... డబ్బులు డిమాండ్ చేస్తూ దొరికిపోయిన ఉద్యోగిని తొలగించవద్దని కొందరు కౌన్సిలర్లు అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఓ ముఖ్య నేత ద్వారా కూడా ప్రయత్నించినట్లు గుసలు గుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారి డ్రైవర్‌కు టోకరా ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఓ జిల్లా ఉన్నతాధికారి డ్రైవర్ కుటుంబానికి టోకరా ఇచ్చినట్టు తెలిసింది. అతని వద్ద రూ. 2 వేలు తీసుకుని మిగతావి ఇవ్వకపోవడంతో రుణలిస్టు నుంచి తొలగించినట్లు సమాచారం. పట్టణంలోని మరో వ్యక్తి నుంచి ఓ ఉద్యోగి రూ.10వేలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయినట్లు తెలిసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ సంబంధిత ఉద్యోగిని విధులను తొలగించాలని మెప్మా అధికారులను ఆదేశించారు. పర్సెంటేజి అడుగుతున్నారు మెప్మా కార్యాలయంలో ప్రతి పనికి పర్సంటేజీ అడుగుతున్నారు. మహిళా సంఘం రుణానికి సంబంధించి పావులా వడ్డీ చూడమన్నా చూడడంలేదు. రై.లక్షకు వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. – తుమ్మల పద్మ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు -
కంచే చేను మేసే..!
♦ నీలగిరి మున్సిపాలిటీలో ఆగని అక్రమాలు ♦ అభివృద్ధి మాటున స్వాహాపర్వం ♦ పనులు చేయకుండానే నిధులు కాజేసిన వైనం ♦ ఇంజనీరింగ్ విభాగం పనుల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ♦ సమగ్రంగా విచారిస్తే రూ.కోట్ల అక్రమాలు వెలుగులోకి.. నీలగిరి మున్సిపాలిటీ పరిధి 19వ వార్డులో పైప్‌లైన్ పనులకు 2016లో టెండర్లు పిలిచారు. టెండర్ దక్కించుకున్న సంబంధిత కాంట్రాక్టర్ ఆ వార్డులో నేటికీ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. సుమారు రూ.9 లక్షల వర్క్‌లో ఎలాంటి పని చేయకుండానే అప్పటి మున్సిపల్ ఏఈ, ఈఈ, డీఈ కలిసి రూ.6 లక్షలకు ఎంబీ రికార్డులు పూర్తి చేసి కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించారు. నల్లగొండ టూటౌన్ : అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు రా ష్ట్రంలోనే పేరుగాంచిన నల్లగొండ మున్సిపాలిటీ మరో మరకను అం టించుకుంది. అభివృద్ధి పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కంచే చేను మేసిన రీతిలో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. ధనార్జనే ధ్యేయంగా.. కొందరు అధికారులు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు తెలిసింది. గతంలో నీలగిరి మున్సిపాలిటీలో పనిచేసి బదిలీ అయిన ఏఈ, ఈఈ కలిసి మున్సిపాలిటీకి కుచ్చుటోపీ పెట్టారు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనుల్లో అవినీతి ఏరులై పారింది. సీసీ రోడ్లు, పైప్‌లైన్ పనులు, డ్రెయినేజీ తదితర పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. చేసిన పని కన్నా అంచనాలను ఎక్కువగా చూపించి అందిన కాడికి స్వాహా చేశారు. అదే విధంగా ఒకే పనికి రెండు సార్లు బిల్లులు చేసిన ఘనత కూడా ఇక్కడి అధికారులకే చెల్లింది. సబంధిత ఏఈ ఇక్కడ పని చేసిన కాలంలో దాదాపు అరకోటి (రూ.50 లక్షలు) వరకు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది అధికారులే తప్పులు చేసి అది వెలుగు చూసిన తర్వాత నెపం కాంట్రాక్టర్లు, ఇతర కింది స్థాయి ఉద్యోగుల మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేకపోలేదు. మున్సిపాలిటీలో పని చేసి బదిలీ అయ్యే ముందు కాంట్రాక్టర్ల ద్వారా అవినీతికి తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర కిందటే నొక్కారు..! 19వ వార్డులో పైప్‌లైన్ వేయకుండానే ఎంబీ రికార్డులు పూర్తి చేసి రూ. 6 లక్షలు చెల్లించిన తతంగం ఏడాదిన్నర కిందటే జరిగినట్టు మున్సిపల్ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. కాంట్రాక్టర్ పని మొదలు పెట్టకుంటూ ఒక్క రూపాయి కూడా ఇచ్చేందుకు మున్సిపల్ నిబంధనలు ఒప్పుకోవు. రూ.20 వేలకు కూడా పని చేసిన తర్వాత నెలల తరబడి తిప్పుకునే సంబంధిత అధికారులు మొదలు పెట్టకుండానే రూ. లక్షల రూపాయలు విడుదల చేయడం వారి స్వాహాకార్యాన్ని తేటతెల్లంచేస్తోంది. అయితే రూ.6 లక్షలు విడుదలై ఏడాదిన్నార దాటినా నేటికీ అవినీతి బాగోతం బయట పడకుండా నొక్కి పెట్టారు. అప్పటి అధికారులు చేసిన అక్రమాలు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారంటే అక్రమార్కులను కాపాడడానికేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమాలు మచ్చుకు కొన్ని.. ఓ వార్డులో వేసిన సీసీ రోడ్డుకు 30 మీటర్ల వరకు అదనంగా బిల్లులు చేసి నిధులు కాజేశారు. అదే విధంగా ప్రకాశం బజారులో సీసీ రోడ్డుకు సంబంధించి రూ.5 లక్షలు, పాతబస్తీ ప్రాంతంలో మూడు వార్డులలో డ్రెయినేజీ, సీసీ రోడ్డుకు రూ.11.50 లక్షల వరకు పక్కదారి పట్టించిన విషయం బహిరంగ రహస్యమే. అభివృద్ధి మాటున అప్పటి ఏఈ, ఈఈ కలిసి నడిపించిన అక్రమాల పరంపర దాదాపు అరకోటి వరకు ఉన్నట్లు తెలిసింది. ఆ ఇద్దరు అధికారులు పని చేసిన కాలంలో చేసిన అభివృద్ధి పనులు, మోటార్ల కొనుగోలు, కొత్త బోర్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, లైట్ల కొనుగోలు తదితర వాటిపై సమగ్ర విచారణ జరిపితే వారి అక్రమాల చిట్టా చాంతాడంతా బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
అభివృద్ధి మాటున అవినీతి..!
నల్లగొండ జిల్లా నీలగిరి మున్సిపాలిటీలో అభివృద్ధి మాటున అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు అధికారులు, నిర్మాణ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అందిన కాడికి దోచుకుంటన్నారు. అయినప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం సైతం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా కోట్లాది రూపాయల మున్సిపాలిటీ సొమ్ము పక్కదారి పడుతోంది. నల్లగొండ: నీలగిరి మున్సిపాలిటీలో చేసిన పాత పనులకే కొత్త బిల్లులు సృష్టించి మున్సిపాలిటీని కొల్లగొడుతున్నారు. కాంట్రాక్టర్లకు, అధికారులకు బేరం కుదిరితే చాలు.. ఎక్కడా ఏదీ ఎలా బిల్లు చేయాలో చకచకా చేసేస్తారు. పట్టణంలో అభివృద్ధి మాటున అవినీతి కొత్త పుంతలు తొక్కుతుందనడానికి ఇక్కడ వీరు చేసిన పనులే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రతిఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు మున్సిపల్ పట్టణాల్లో అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేస్తున్నారుు. ఈ నిధులు అక్రమార్కులకు వరంగా మారాయి. పట్టణంలో అభివృద్ధి ఎంత చేస్తున్నారో తెలియదు గానీ అవినీతిలో ముందంజలో ఉన్నారు. నీలగి రి మున్సిపాలిటీ అవినీతి అక్రమాలు, కుంభకోణాలలో రాష్ట్రంలోనే టాప్‌గేర్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఈ మున్సిపాలిటీపై రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు లేకపోవడంతో ఇక్కడి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వ చట్టాలను తమ చుట్టాలుగా మలుచుకొని తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి రూ.కోట్ల అక్రమాలకు పాల్పడుతున్నా రు. మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ విభాగంలో ఔట్ సోర్సిగ్ ఉద్యోగి నుంచి అధికా రి వరకు తాము చేసిందే చట్టం అనే స్థాయికి ఎదిగిపోయారంటే వారు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. విజిలెన్స్‌కు ఫిర్యాదులు.. పట్టణంలోని ప్రకాశం బజారులో ఓ కాంట్రాక్టర్ పాత పనులకే బిల్లులు తయారు చేయించాడు. ఇక్కడ దాదాపు రూ.4 లక్షల వరకు బిల్లులు చేశారు. ఉన్న డ్రెయినేజీ కాల్వకే కొత్తగా సిమెంట్ వేసి బిల్లులు కాజేశారు. స్థానికులు విజిలెన్స్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు బిల్లు కూడా పూర్తి చేసి డబ్బులు కూడా మంజూరు చేశారు. ఫిర్యాదు తీవ్ర రూపం దాల్చడంతో ఆదే గుత్తేదారు 36వ వార్డులో చేసిన డ్రెయినేజీ పనులలో రీకవరీ చేశారు. అక్కడ రూ.2 లక్షల పనిచేయగా రూ.3 లక్షల విలువైన డ్రెయినేజీ పనులు పూర్తి చేసినట్లు రికార్డుల్లో చూపించినట్లు తెలసి ంది. అధికారులకు అవినీతి భాగోతం తెలిసినా వారిమీద గానీ, కాంట్రాక్టర్ మీద గానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని వెనకేసుకు రావడం కొసమెరుపు. రోడ్డు తక్కువ.. బిల్లులు ఎక్కువ పట్టణంలో పలు కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణంలో కూడా అవినీతికి తెరలేపారు. వన్‌టౌన్ పరిధిలోని ఓ వార్డులో వేసిన సీసీ రోడ్డు కన్నా 60 మీటర్ల దూరం ఎక్కువగా చూపించి బిల్లులు చేశారు. ఇలా ఒక్క వార్డులోనే కాదు అత్యధిక వార్డుల్లో తప్పుడు కొలతలు వేసి మున్సిపాలిటీ నిధులు బుక్కేస్తున్నారు. ఈ విషయాలన్ని అధికారులకు తెలసినా వారు చేతులు కాలాకా ఆకులు పట్టుకునే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. పట్టణంలోని మున్సిపాలిటీలో జరిగిన అవినీతిలో ఇవి మచ్చుకు మాత్రమే. ప్రత్యేక దోపిడీ.. నాలుగేళ్ల పాటు మున్సిపాలిటీకి పాలకమండళ్లు లేకపోవడంతో ప్రత్యేకధికారి పాలన సాగింది. అప్పట్లో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ప్రస్తుత పాలక పక్షం చెబుతుంది. డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణంలో అప్పటి అధికారి ద్విపాత్రాభినయంలో అందినకాడికి పక్కదారి పట్టించారు. తనకు నచ్చిన వారిని ఆయా విభాగాలలో పెట్టుకోని మంత్రాంగం నడిపించి కోట్ల రూపాయలు వెనకేసున్నట్లు తెలుస్తుంది. వారు చేస్తే దండించేది పోయి వారికి రక్షణగా నిలవడంతో అవినీతి హద్దే లేకుండా కొనసాగిపోతోంది. యూజీడీలో.. పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపాలని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. కానీ దీనిపై నేటికీ నివేదిక రాలేదు. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అభివృద్ధి పనులను టెండర్ల ద్వారానే చేపట్టాలి. ప్రభుత్వ మార్గద ర్శకాలలోని చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకోని అవినీతి పంట పండిస్తున్నారు. లక్ష రూపాయల లోపు పనులుగా విభజించి పనులు చేపడుతూ కొటేషన్ల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఉదాహరణకు రూ.10 లక్షల పనులను పది పనులుగా విభజించి ఎవరికి అనుమానం రాకుండా ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అవినీతి అక్రమాల భారీ స్థాయిలో జరుగుతాయని ఒకరిద్దరు అధికారులు అభ్యంతరం జెప్పినా పై స్థాయి అధికారులు పెడచెవిన పెటట్డంతో అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయిందనేది బహిరంగ రహస్యమే.