నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీ మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)లో అవినీతి ఏరులై పారుతోందా?... చేయి తడపనిదే చిన్న పని కూడా కాదా?... ప్రతి పనికి పర్సేంటేజి ముట్టజెప్పాల్సిందేనా?... ప్రభుత్వ సబ్సిడీ రుణాల్లో పర్సేంటేజీ పెంచారా? ...మహిళా సంఘాల రుణంలో లక్షకు వెయ్యి ముట్టజెప్పాల్సిందేనా?...అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. మెప్మాలో పని చేస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఏకంగా ఫోన్‌లోనే బేరసారాలకు దిగిన ఘటన జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించింది.
మెప్మా విభాగంపై మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంలో అక్కడ వారు ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. కొంత మంది సీఓ (కమ్యూనిటీ ఆర్గనైజర్)లు అందినకాడికి దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కార్యాలయానికి వివిధ సమాచారం కోసం వచ్చే వారికి ఏ మాత్రం చిక్కరు, దొరకరు ... దొరికినా పూర్తి వివరాలు చెప్పకుండా తలబిరుసుగా వ్యవహరిస్తారనే ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. మహిళా సంఘాల వారికి రుణాల వడ్డీ వివరాలు సైతం చెప్పకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిసింది.
సబ్సిడీ రుణాలంటే పండుగే ...
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వివిధ వర్గాల వారికి సబ్సిడీ రుణాలు అందజేస్తుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను మెప్మా వారే ఎంపిక చేస్తున్నారు. 2017–18 కి గాను ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి 129యూనిట్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారీతిలో చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వార్డు సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. బ్యాంకు మేనేజర్, మున్సిపల్‌కమిషనర్, షెడ్యుల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారి, వార్డు కౌన్సిలర్ కమిటీలో ఉండి ప్రజల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇవేమి పట్టించుకోకుండా చేయి తడిపిన వారికే రుణాలు ఇస్తునట్లు తెలుస్తోంది. సబ్సిడీ రుణాలు వస్తే వీరికి పండుగేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కౌన్సిలర్ల పైరవీ ...
డబ్బులు డిమాండ్ చేస్తూ దొరికిపోయిన ఉద్యోగిని తొలగించవద్దని కొందరు కౌన్సిలర్లు అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఓ ముఖ్య నేత ద్వారా కూడా ప్రయత్నించినట్లు గుసలు గుసలు వినిపిస్తున్నాయి.
ఉన్నతాధికారి డ్రైవర్‌కు టోకరా
ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఓ జిల్లా ఉన్నతాధికారి డ్రైవర్ కుటుంబానికి టోకరా ఇచ్చినట్టు తెలిసింది. అతని వద్ద రూ. 2 వేలు తీసుకుని మిగతావి ఇవ్వకపోవడంతో రుణలిస్టు నుంచి తొలగించినట్లు సమాచారం. పట్టణంలోని మరో వ్యక్తి నుంచి ఓ ఉద్యోగి రూ.10వేలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయినట్లు తెలిసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ సంబంధిత ఉద్యోగిని విధులను తొలగించాలని మెప్మా అధికారులను ఆదేశించారు.
పర్సెంటేజి అడుగుతున్నారు
మెప్మా కార్యాలయంలో ప్రతి పనికి పర్సంటేజీ అడుగుతున్నారు. మహిళా సంఘం రుణానికి సంబంధించి పావులా వడ్డీ చూడమన్నా చూడడంలేదు. రై.లక్షకు వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.
– తుమ్మల పద్మ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment