జూనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్
ఖమ్మం : ఖమ్మంలోని వీడీవోస్ కాలనీలోగల మహిళ, శిశు సంక్షేమ–అభివృద్ధి శాఖ కార్యాలయంలోనే ఒక పక్కన వికలాంగులు–వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం ఉంది. వికలాంగులకు రుణాలు మంజూరు చేసేందుకు ఇక్కడ ఒక జూనియర్ అసిస్టెంట్, మరొక ఔట్‌సోర్సిం గ్ ఉద్యోగి ఉన్నారు. ఆ జూనియర్ అసిస్టెంట్ పేరు రేగళ్ల వేణుగోపాల్. ఆయన నెలసరి వేతనం 40 – 50వేల రూపాయలు ఉంటుంది. పాపం.. అది చాల్లేదేమో..! లంచాలకు అలవాటుపడ్డాడు. రుణం మంజూరైన లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తున్నాడు. ఏ ఆసరా లేకనే రుణం కోసం ఇక్కడిదాకా వచ్చిన ఆ వికలాంగులు.. లంచం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు..? ఆ జూనియర్ అసిస్టెంట్ లంచం అడుగుతున్న విషయాన్ని ఆ శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. ప్చ్.. వారు ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇలా వేధించాడు...
తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లికి చెందిన నాగలక్ష్మికి 90 శాతం అంగవైకల్యముంది. జీవనాధారం కోసం పిండి మర పెట్టుకుంటానంటూ రుణం కోసం ప్రభుత్వానికి 2016లో దరఖాస్తు చేసుకుంది. 2017 చివరిలో ఆమెకు లక్ష రూపాయలు మంజూరయ్యాయి. చెక్కు తీసుకునేందుకు జూనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ వద్దకు తన భర్త శ్రవణ్‌తో కలిసి నాగలక్ష్మి వచ్చింది. అతడు ఐదువేల రూపాయలు లంచం అడిగాడు. వారు ఇవ్వలేకపోయారు. తమ ఆర్థిక పరిస్థితిని వివరించారు. కష్టాల్లో ఉన్నమన్నారు. కరుణించాలని వేడుకున్నారు. వేణుగోపాల్ చెవికి ఇవేవీ ఎక్కలేదు. ‘‘ప్రభుత్వం నుంచి రుణం మంజూరు కావడమంటే మాటలా..? ఎంత కష్టపడితే వస్తుంది..? నన్ను ఆమాత్రం చూసుకోలేరా..? ఐదువేలు ఇస్తేనే చెక్కు ఇస్తాను’’ అని చెప్పాడు. అయినప్పటికీ, వారు దాదాపు రెండు నెలల నుంచి ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. విసిగిపోయారు. చివరకు, ఏసీబీ సీఐ రమణమూర్తిని ఆశ్రయించారు.
ఇలా చిక్కాడు...
ఏసీబీ సీఐ రమణమూర్తి స్పందించారు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మరో సీఐ రామలింగారెడ్డితో కలిసి పథకం వేశారు. వేణుగోపాల్ వద్దకు నాగలక్ష్మి దంపతులు శుక్రవారం వెళ్లారు. ఐదువేలు ఇచ్చుకోలేమని, రెండువేలు ఇస్తామని బేరమాడారు. వేణుగోపాల్ ఒప్పుకున్నాడు. అప్పటికే ఏసీబీ అధికారులు రసాయనం పూసి ఇచ్చిన నోట్లను ఆ దంపతులు వేణుగోపాల్‌కు ఇచ్చారు. వాటిని అతడు అలా తీసుకోవడం, ఏసీబీ అధికారులు లోపలికి దూసుకురావడం, ఆ నోట్లను లాక్కోవడం.. అంతా కేవలం కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. అతడిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదివరకే ఫిర్యాదులు
లంచం కోసం వేధిస్తున్నాడంటూ వేణుగోపాల్‌పై గతంలోనే కారేపల్లికి చెందిన వెంకన్న అనే వికలాంగుడు కలెక్టర్‌కు, ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. వెంకన్న డబ్బులు ఇస్తుండగా పట్టుకుందామని ఏసీబీ అధికారులు పథకం వేశారు. కానీ, అది విఫలమైంది. అప్పటి నుంచి అతడిపై నిఘా పెట్టారు. చివరకు ఇలా పట్టుబడ్డాడు. ‘‘వేణుగోపాల్‌కు కార్యాలయంలో ఎవరెవరు సహకరిస్తున్నారు..? గతంలో కూడా ఫిర్యాదులు వచ్చినప్పటికీ పై అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు..? వీటన్నిటిని విచారిస్తున్నాం’’ అని, విలేకరులతో ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment