కందుకూరు, న్యూస్‌లైన్ : కందుకూరు హౌసింగ్ డివిజన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన ఇళ్లలో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్ల పరిస్థితి అయోమయంలో ఉంది. రెండు నెలల పాటు ప్రభుత్వ అధికారులు సమ్మెలోకి వెళ్లడంతో ఆ సమయంలో నిర్మాణం మొదలుపెట్టిన ఇళ్లకు సంబంధించిన బిల్లులు ఇంతవరకు రాలేదు. దీంతో కొన్ని మధ్యలో ఆగిపోయాయి.
ఇళ్లు మంజూరైనా ఇనుము, సిమెంటు, ఇటుక ధరల పెరుగుదలతో ప్రభుత్వం ఇచ్చే బిల్లు సరిపోదని కొందరు నిర్మాణం చేపట్టలేకపోతున్నారు. మరికొందరు ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నారు. అయితే బేస్‌మెంట్ పనులు చేస్తేనే మొదటి విడత బిల్లులు మంజూరవుతాయి. అయితే సగం నిర్మాణం పూర్తయి వారి ఇళ్లకు బిల్లులు ఆలస్యం అవుతున్నాయి. తమకు బిల్లులు ఎప్పుడు వస్తాయో అని కొందరు పునాది వేయడానికి జంకుతున్నారు. దీంతో పేదవాడి ఇందిరమ్మ గూడు కలగానే మిగులుతోంది.
ఇదీ డివిజన్‌లో పరిస్థితి
కందుకూరు హౌసింగ్ డివిజన్ పరిధిలో కందుకూరు, కనిగిరి, కొండపి, దర్శి నియోజకవర్గాలున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 8,891 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశారు.
వాటిలో కేవలం 50 శాతం నిర్మాణాలను మాత్రమే పూర్తయ్యాయి. దీనిపైనే ఇటీవల నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ హౌసింగ్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేక పోయారని కలెక్టర్ ప్రశ్నించారు. ఈ నెల 15వ తేదీలోగా పెండింగ్ నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. డివిజన్ పరిధిలో నిర్మించాల్సిన ఇళ్ల సంఖ్య భారీగా ఉండడమే దీనికి కారణం.
డివిజన్ పరిధిలో గత ఏడాదికి 8,891 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 4,558 మాత్రమే అధికారులు పూర్తిచేశారు.
ప్రస్తుతానికి కందుకూరులో 987, దర్శిలో 1104, కొండెపిలో 864, కనిగిరిలో 1503 ఇళ్లను మాత్రమే పూర్తిచేశారు.
వీటిలో కందుకూరు నియోజకవర్గంలో 1887, దర్శిలో 2128, కొండెపిలో 1698, కనిగిరిలో 3280 ఇళ్లను కట్టాలి.
అసంపూర్తిగా ఉన్న ఇళ్ల వివరాలు
రూఫ్ లెవల్‌లో 2,333
లింటల్ లెవల్‌లో 551
బేస్‌మెంట్ లెవల్ కంటే పైగా 367
బేస్‌మెంట్ లెవ్‌లో 3,667
బేస్‌మెంట్ కంటే తక్కువ స్థాయిలో 602
ఇదిలా ఉండగా ఇటీవల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అర్జీలు ఇచ్చిన వారికి జీవో 23 కింద డివిజన్‌లో 11,175 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు ఒక్కటి కూడా మొదలు పెట్టిన దాఖాలాలు లేవు. నిర్మాణం మొదలుపెడితేనే మొదటి విడత బిల్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే రుణాలను పెంచింది. అయినా గృహ నిర్మాణ ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఇష్టపడడం లేదు.
గూటికి చేరేదెప్పుడో?
Published Mon, Mar 3 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement
Advertisement