
మరిన్ని గ్రామాల్లో సీఐడీ విచారణ!
‘ఇందిరమ్మ’అక్రమాల విచారణ విస్తృతం
సీఐడీకి ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు
పలు గ్రామాల్లో విచారణ మొదలు..
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం మరో ఏడాదివరకు ఎదురుచూపే
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాల నిగ్గు తేల్చేందుకు మొదలైన సీఐడీ విచారణ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లోనే ఇళ్ల వివరాలను పరిశీలించిన సీఐడీ అధికారులు.. తాజాగా మరిన్ని గ్రామాలకు విచారణను విస్తరించారు. ఈ దిశగా సీఐడీ అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో పేదల ఇళ్ల పథకం మరిన్ని రోజులు స్తబ్ధంగానే ఉండిపోనుంది. కొత్తగా టీఆర్‌ఎస్ సర్కారు తలపెట్టిన రెండు పడక గదుల ఇళ్లు మరికొంత కాలం ఆలస్యం కానున్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణను మొదలుపెట్టిన సీఐడీ నిర్ధారిత 36 గ్రామాల్లో విచారణను పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ విచారణలో వందల సంఖ్యలో అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, లబ్ధిదారులను అక్రమాలకు బాధ్యులుగా గుర్తించింది. అయితే వీరందరిపై అభియోగాల నమోదు విషయంలో గందరగోళం నెలకొంది. ఒక్కో ఇంటి యూనిట్ కాస్ట్ చాలా తక్కువ అయినందున... చాలా మంది విషయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన సొమ్ము అతి స్వల్పంగా ఉంది. అసలు ఇళ్లే కట్టకుండా.. బిల్లులు కాజేసిన కొన్ని కేసుల్లో మాత్రమే భారీ అవినీతి కనిపిస్తోంది.
ఇప్పుడు అలాంటి ఇళ్లు నిగ్గు తేల్చాలని భావిస్తున్న ప్రభుత్వం... విచారణను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో... సీఐడీ అధికారులు మరిన్ని గ్రామాల్లో విచారణ మొదలుపెట్టారు. వాటికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ నుంచి వివరాలు సేకరించారు కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 390 కోట్లు మాత్రమే కేటాయించటం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే సీఎం స్వయంగా పర్యటించి హామీ ఇచ్చిన వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు నిజామాబాద్‌లోని ఓ గ్రామం, సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో మాత్రమే ఈ ఏడాది ఈ పథకం కింద కొన్ని ఇళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
హామీ ‘భారం’ చూసి బెంబేలు..
పేదలకు రూ. 3.50 లక్షలతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ 3.5 లక్షలతో అలాంటి ఇళ్ల నిర్మాణం అసాధ్యమని అధికారులు తేల్చారు. తాజాగా వారు రూపొందించిన లెక్కల ప్రకారం ఒక్కో ఇంటికి రూ. 6.50 లక్షల వరకు అవసరమని తేలింది. దీంతో ఈ పథకం కోసం సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం బడ్జెట్‌లో గృహ నిర్మాణ కేటాయింపులను గతం కంటే తగ్గించి... సాయం చేసే అవకాశం లేదని తేల్చేసింది. ఈ నేపథ్యంలో తలకుమించిన భారంగా మారే ఈ పథకాన్ని వాయిదా వేసేందుకు... సీఐడీ విచారణను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరో ఏడాదిదాకా ఎదురుచూపులే..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువు దీరగానే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం మొదలవుతుందని పేదలు ఆశగా ఎదురు చూశారు. కానీ సీఐడీ దర్యాప్తు పేరిట చూస్తుండగానే ఏడాది కాలం గడిచిపోయింది. ఇటీవల సీఐడీ దర్యాప్తు పూర్తవడంతో.. కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా పనులు మొదలవుతాయని పేదలు ఆశించారు. కానీ ప్రభుత్వం సీఐడీ దర్యాప్తును మరికొంతకాలం పొడగించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది కూడా పేదలకు ఎదురుచూపులు తప్పే పరిస్థితి కనిపించడంలేదు.