యాదాద్రిలో అసలేముంది!? | Yadadri as Development to the Temple City | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో అసలేముంది!?

Published Sat, Nov 14 2015 4:31 AM | Last Updated on Mon, Aug 20 2018 9:21 PM

యాదాద్రిలో అసలేముంది!? - Sakshi

యాదాద్రిలో అసలేముంది!?

‘యాదాద్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తాం. 2,000 ఎకరాల్లో యాదాద్రిని విస్తరించి.. ఏటా రూ.100 కోట్ల పెట్టుబడులతో దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం’    
- ఇదీ ప్రభుత్వ ప్రణాళిక
 
‘అనుమతి కోసం డీటీసీపీ/హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకుంటే.. రెండేళ్లయినా ఫైల్ ముందుకు కదలట్లేదు. ఈలోపు బూమ్ తగ్గి ధరలెలా ఉంటాయో చెప్పలేం. అందుకే అనుమతులు రాకపోయినా లే-అవుట్లను వేసేశాం
- ఇదీ రియల్టర్ల మాట
 
‘కూతురి పెళ్లి కోసమో.. కొడుకు పైచదువుల కోసమో దాచిన సొమ్ముతో స్థిరాస్తిని కొంటే.. అది కాస్త అక్రమ లే-అవుట్ అని తెలిసింది. ఇప్పుడేం చేయాలో తెలియని పరిస్థితి’    
- ఇదీ సామాన్యుడి ఆవేదన

 
..ఇదీ క్లుప్తంగా యాదాద్రిలో జరుగుతున్న స్థిరాస్తి వ్యాపారం!! యాదాద్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తే.. దాని పేరు చెప్పి 30 కి.మీ వరకూ లే-అవుట్లు, వెంచర్లు వేసి రాత్రికి రాత్రే ధరలు పెంచేశారు రియల్టర్లు. అసలు యాదాద్రి గోపురానికి, రియల్ వ్యాపారానికి మధ్య ఉన్న పీటముడిని విప్పేందుకు ‘సాక్షి రియల్టీ’ స్థిరాస్తి నిపుణులతో చర్చించింది. వారేమన్నారంటే..
 
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంకల్పించారు. 2,000 ఎకరాల్లో విస్తరించనున్న యాదాద్రి అభివృద్ధికి మూడేళ్ల పాటు ఏటా రూ.100 కోట్లు కేటాయించారు కూడా. ఫిబ్రవరిలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ)ను ఏర్పాటు చేసి పనులను ప్రారంభించారు.
 
చీకట్లోని యాదాద్రి వెలుగులోకి..
యాదాద్రిలో రియల్ వృద్ధికి అవకాశమే లేదని కొట్టిపారేయలేమని కొందరు నిపుణులంటున్నారు. ఎందుకంటే ఎక్కడైనా ప్రభుత్వం అభివృద్ధి పనులను ప్రారంభిస్తే ముందుగా పెరిగేది స్థిరాస్తి ధరలే. పెపైచ్చు యాదాద్రి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికనూ రూపొందించింది. అంటే టెంపుల్ సిటీ ప్లాన్ అనేది గుడి, గర్భగుడికే పరిమితం కాదు.. అక్కడి ప్రాంతం భవిష్యత్తు అభివృద్ధి, ప్రజల మౌలిక వసతులకు అనుగుణంగా ఉంటుంది. అంటే రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, మంచినీరు, విద్యుత్, పరిశ్రమలు, పార్కులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు ఇలా ప్రతి ఒక్కదానికీ అవకాశముంటుందన్నమాట.
 
* యాదాద్రి- వరంగల్ మార్గం 163వ నంబరు జాతీయ రహదారిలో ఉంది. ఇది సుమారు 99 కి.మీ. వరకుంటుంది. వాస్తవానికి 163వ జాతీయ రహదారి పరిధి హైదరాబాద్ నుంచి భూపాలపట్నం దాకా 306 కి.మీ. వరకు ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు.. నాలుగు వరుసల రహదారి కొంత దూరం మాత్రమే ఉంది. దీన్ని సుమారు రూ.2,000 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి స్థాయిలో చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు యాదాద్రి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడంతో ఈ జాతీయ రహదారికి ఇరువైపులున్న గ్రామాలకు మహర్దశ పట్టింది.

భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులనూ తగ్గించేందుకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఇంటర్ చేంజ్ ఫ్లై ఓవర్లనూ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ట్రాఫిక్ చిక్కులుండవు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో మార్కెట్లకు చేరవేయవచ్చు. ఇక్కడ హోటళ్లు, రిసార్టులు, వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు వంటివి ఏర్పాటయ్యే అవకాశముంది.
* పోచారంలో ఐటీఐఆర్ రీజియన్ అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం కానుండటం, బీబీనగర్‌లో గల నిమ్స్‌కు ఎయిమ్స్ హోదా దక్కనుండటం, ఇన్ఫోసిస్, రహేజాలు ఆరంభం కావటం, ఉప్పల్ ప్రాంతంలో మెట్రో ప్రారంభం కానుండటం.. మెట్రోను యాదాద్రి వరకూ విస్తరించటం వంటి అనేక సానుకూల అంశాలు యాదాద్రిలో స్థిరాస్తికి మరింత జోష్‌ను తీసుకొస్తుందనేది నిపుణుల అభిప్రాయం
 
యాదాద్రిలో అన్నీ ఓపెన్ ప్లాట్లే..
హైదరాబాద్ నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న యాదాద్రి చుట్టూ 30 కి.మీ. పరిధిలో ఓపెన్ ప్లాట్లే ఉంటాయి. ఒక్క నిర్మాణమూ కనిపించదు. పోనీ ప్లాట్లలోనే ఇళ్లు కట్టుకుందామంటే నీళ్లు, కరెంట్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలూ లేవు. ఈమధ్య కాలంలో కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే.. ఖాళీ స్థలాల్లో టేకు, గంధం, మలబారు, పండ్ల మొక్కలను పెంచి 15 ఏళ్ల తర్వాత వాటిని అమ్మి పదింతల లాభాన్ని పొందవచ్చని కళ్లబొల్లి మాటలు చెబుతూ సామాన్యులను మోసం చేస్తున్నాయి కొన్ని సంస్థలు. వాస్తవానికి ఇలాంటి ఫాం ప్రాజెక్టులు గతంలో చాలానే వచ్చాయి. ఒక్కటీ సక్సెస్ అయిన దాఖలాల్లేవు.
 
ప్రభుత్వానిదీ తప్పే..
యాదాద్రిలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గమనిస్తే అక్కడ రియల్ అవకాశాలు, వృద్ధి 5 కి.మీ. పరిధి వరకే విస్తరిస్తుందే తప్ప రియల్టర్లు చెబుతున్నట్టు యాదాద్రి నుంచి 30-40 కి.మీ. వర కూ ఉండదు. ఎందుకంటే యాదాద్రి అనేది తెలంగాణలోని అన్ని జిల్లాలకూ దూరమేమీ కాదు. దీంతో ఇతర జిల్లాల నుంచి భకు ్తలు ఒక్కరోజులో వచ్చివెళతారే తప్ప.. అక్కడే ఉండేంత అవసరం లేదు.
* స్థిరాస్తుల్లో జరుగుతున్న మోసాల్లో కేవలం బిల్డర్లనే తప్పుపట్టలేం. ఎందుకంటే అనుమతుల జారీలో తీవ్రమైన జాప్యం చేస్తు న్న ప్రభుత్వానిదీ తప్పే. అందుకే త్వరితగతిన అనుమతుల జారీతో పాటు అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
* భవిష్యత్తు అభివృద్ధిని ఇప్పుడే ఊహించుకొని స్థిరాస్తులను కొనుగోలు చేయొద్దు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేముందు అది దీర్ఘకాలికమా.. తక్షణ అవసరమా అనేది నిర్ణయించుకోవాలి. బడ్జెట్, లొకేషన్, ప్రస్తుతం అక్కడున్న సౌకర్యాలు, మౌలిక వసతులను క్షుణ్నంగా ఆరా తీయాలి.
 
ఆధ్యాత్మిక రాజధాని.. ‘తిరుపతి’
యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు స్థిరాస్తి రంగంలో తిరుపతి అభివృద్ధి అవకాశాలను గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ తర్వాత చెప్పుకోవాల్సిన నగరం చిత్తూరు నుంచి 65 కి.మీ. దూరంలో ఉన్న తిరుపతి. 20 కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న తిరుపతిలో రియల్ వృద్ధికి ప్రధాన కారణం ఇక్కడి మౌలిక, రవాణా సదుపాయలే. నగరం నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న రేణుగుంట విమానాశ్రయంతో ఇక్కడ రియల్ వ్యాపారం జోరుగానే సాగుతోంది.

త్వరలోనే ఇది అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనుంది. శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి కూడా. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు తిరుపతి. నిత్యం ఆయా రాష్ట్రాలకు రాకపోకలు సాగించే బెంగళూరు, చెన్నై వాహనాలు తిరుపతి మార్గంగానే వెళ్లాలి. దీంతో రోడ్డుకిరువైపులా స్థిరాస్తి వ్యాపారం జోరుగా ఉంటుంది. దీనికి తోడు దక్షిణాదిలోనే ఒకే ప్రాంతంలో ఆరు విశ్వ విద్యాలయాలున్నాయిక్కడే. ఎస్వీ యూనివర్శిటీ, ఎస్వీ వ్యవసాయ, ఎస్వీ వెటర్నరీ,  ఎస్వీ మహిళా, ఎస్వీ వేద, ఎస్వీ మెడికల్ సైన్ వర్శిటీలతో పాటుగా పాతికకు పైగానే ఇంజినీరింగ్ కళాశాలతో తిరుపతి ఎడ్యుకేషనల్ హబ్‌గా ప్రసిద్ధికెక్కింది.

తిరుపతి దేవస్థానానికి ప్రతి రోజు వచ్చి పోయే భక్తుల జనాభా 60 వేలకు పైమాటే. హుండీ ఆదాయం ఏటా రూ.2,000 కోట్లు. సంయుక్త రాష్ట్రంతో పోల్చుకుంటే తిరుపతిలో స్థిరాస్తి ధరలు 20 శాతం పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. మంగళ్‌రోడ్, తిరుచానూర్ వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2-3 వేలు, సిటీలో అయితే రూ.4-9లుగా ఉన్నాయి.
 
* ఇంటి గోడలకు వేసే రంగుల్లో ప్రధానంగా కూల్, వామ్ కలర్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. వామ్ కలర్స్‌లోని ఎరుపు, ఆరెంజ్, పసు పు, ఆకుపచ్చలోని పలు రకాలు ప్ర దానంగా నాడీ వ్యవస్థ, బీపీ, హార్ట్‌బీట్‌పై ప్రభావాన్ని చూపిస్తాయి.
* ఎరుపు రంగు మనిషిని ఉత్తేజితుల్ని చేస్తుంది. ఈ రంగును చిన్న పిల్లల గదుల్లో ఉపయోగించడం మంచిది కాదు. నీలం రంగు శరీరంలో కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. దీంతో మనిషి మెదడు స్థిమితంగా ఉంటుంది. అయితే కొన్ని ముదురునీలం రంగులు జాగ్రత్తను సూచిస్తాయి.
 
కళ్లముందే కాదనలేని నిజాలు..
విమానాశ్రయం వస్తుందనో.. మెట్రో రైలు రానుందనో.. సాఫ్ట్‌వేర్ సంస్థలొస్తున్నాయనో రాత్రికి రాత్రే ధరలను పెంచేసి సామాన్యుని సొంతింటి కలను దూరం చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. కొనుగోలుదారులిక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే.. ‘‘మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెంది.. నివాసయోగ్యమైన ప్రాంతాల్లోనే స్థలాల ధరలు పెరుగుతాయి.

అది కూడా ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలు పుట్టుకొస్తేనే!! అంతే తప్ప భవిష్యత్తులో చోటు చేసుకునే అభివృద్ధిని ఇప్పుడే ఊహించి ఐదేళ్ల తర్వాత పెరగాల్సిన స్థలాల ధరలు అలా అమాంతం పెరగకూడదు. నగరం అభివృద్ధి దిశలో స్థిరంగా పయనించడానికిది సరైన సంకేతం కాదని రామ్ డెవలపర్స్ ఎండీ రామ్ చెప్పారు. నగరంలో కొనుగోలుదారులకు ఎదురైన చేదు అనుభవాల్లో కొన్ని..

* ఏడాదిన్నర క్రితం మియాపూర్‌లో ప్రతిపాదిత మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలం ధర గజానికి రూ.13,000 అటుఇటుగా ఉండేది. ఈరేటును మధ్యవర్తులు రూ.30 వేలు దాటించేశారు. పోనీ ఇక్కడ అనూహ్య రీతిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయా అంటే అదీ లేదు. ప్రధాన రహదారిలో రోడ్డు వెడల్పు చేశారే తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మంచినీటి సరఫరా పెరగలేదు. కాలనీల్లో అంతర్గత రోడ్లూ వేయలేదు. మరీ ఎందుకు హఠాత్తుగా రేటు పెరిగిందంటే.. ‘మెట్రో స్టేషన్ వస్తోంది సార్.. అందుకే రేట్లు పెరిగాయి’ అని రియల్టర్లు జవాబిస్తున్నారు.

మెట్రో పనులు జరిగినంత మాత్రానా ఇక్కడ నివసించే ప్రజల జీవితాల్లో సమూల మార్పులేమైనా జరిగాయా? ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలేమైనా పుట్టుకొచ్చాయా అంటే అదీ లేదు.
* బూమ్ సమయంలో మహేశ్వరంలో ఫ్యాబ్ సిటీ వస్తోందంటూ.. విమానాశ్రయానికి దగ్గరంటూ అరచేతిలో అద్భుతాలను చూపించారు రియల్టర్లు. దీంతో గజం ధర రూ.10 వేలు పెట్టి కొన్నవారూ ఉన్నారు. కానీ, నే డక్కడ ఇంత ధర పెట్టేందుకు ఎవరూ ముందుకురావట్లేదు. దీంతో స్థలాలు కొన్నవారి పరిస్థితి అటు అమ్ముకోలేక.. ఇటు స్థలాన్ని అట్టిపెట్టుకోనూ లేక తెగ ఇబ్బంది పడుతున్నారు.
* భాగ్యనగరం సిటీ నుంచి ఔటర్ వైపు అభివృద్ధి చెందుతుందంటూ ఓఆర్‌ఆర్ చుట్టూ లే-అవుట్లు వేసి సామాన్యులకు అంటగట్టారు బిల్డర్లు. అయితే ప్రస్తుతం ఓఆర్‌ఆర్ 90 శాతం పూర్తయింది. కానీ, అక్కడ ఒక్క నివాస సముదాయం గానీ, పరిశ్రమలు గానీ వచ్చిన దాఖలాల్లేవు.
* మాదాపూర్‌లో ఐటీ పరిశ్రమ ఏర్పాటైన నాలుగైదేళ్ల తర్వాత కానీ అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాల ధరలు పెరగలేదు. 2003 వరకూ మాదాపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో చదరపు గజం ధర రూ.5,000 లోపు ఉండేదన్న విషయాన్ని మర్చిపోవద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement