సుకన్య సమృద్ధి.. పొదుపునకు నాంది
Published Sat, Aug 27 2016 6:47 PM | Last Updated on Thu, Oct 4 2018 5:34 PM
చింతలపూడి : ఆడపిల్లల పట్ల లింగ వివక్షను రూపుమాపి అసమానతలను అంతం చేయాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ సుకన్య సమృద్ధి యోజనను ప్రవేశపెట్టారు. పదేళ్లలోపు ఉన్న బాలికలకు ఈ పథకం వర్తిస్తుంది. ఆడపిల్లల పేరిట తల్లిదండ్రులతో పొదుపు చేయించడం ద్వారా భవిష్యత్ వారికి భరోసా కల్పించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. దీనిలో పొదుపు చేసే వారికి అత్యధిక వడ్డీ లభిస్తుంది. ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందిన సుకన్య సమృద్ధి యోజనలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఆ వివరాలు మీ కోసం..
పౌరసత్వంలో మార్పు
భారత పౌరసత్వం కలిగిన వారికి మాత్రమే ఇందులో లబ్ధిదారులుగా ఉండే అవకాశం ఉంది. ఒక వేళ ఖాతాదారు భారత పౌరసత్వం కోల్పోయి ఎన్‌ఆర్‌ఐ అయితే ఖాతా మూసివేసినట్టుగా పరిగణిస్తారు.పౌరసత్వం మారిన తరువాత వడ్డీ జమ అవ్వదు.
ఖాతా బదిలీ
పోస్టాఫీస్, బ్యాంక్ శాఖల్లో తెరిచిన సుకన్య సమృద్ధి ఖాతాను ఒక చోటి నుంచి మరొక చోటికి బదిలీ చేసుకోవచ్చు. ఇల్లు మారుతున్నట్టు ఆధారాలు చూపితే ఎటువంటి రుసుం లేకుండా ఖాతాను బదిలీ చేస్తారు. అలా కాకుండా పోస్టాఫీస్‌కు కానీ లేదా బ్యాంకుకు రూ.100 చెల్లించి వేరే చోటుకు ఖాతాను మార్పు చేసుకోవచ్చు.
ఎంత వరకు జమ చేయచ్చంటే..
ఒక ఆర్థిక సంవత్సరంలో అమ్మాయి పేరిట జమ చేసే సొమ్ము రూ. లక్షా 50 వేలకు మించరాదు. పరిమితికి మించిన డబ్బుకు వడ్డీ రాదు. వార్షిక పరిమితికి మించి జమ చేసిన సొమ్మును ఏడాదిలో ఎప్పుడైనా డిపాజిట్‌దారు వెనక్కు తీసుకోవచ్చు.
వడ్డీ రేటు ఇలా
ఏడాదికోసారి చక్రవడ్డీ రూపంలో లెక్కింపు జరుగుతుంది. సమయానుకూలంగా ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేట్లు అమల్లో ఉంటాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేట్లను మారుస్తుంది. సుకన్య సమృద్ధి యోజనలో వడ్డీ రేటును ప్రభుత్వం 9.2 శాతంగా నిర్ణయించింది.
డిపాజిట్ వయసు
ఇంతకుముందు అమ్మాయి గరిష్ట వయసు 14 ఏళ్ల దాకా డిపాజిట్లు చేసే వీలుంది. ప్రస్తుతం మారిన నిబంధనల ప్రకారం 15 ఏళ్లకు పెంచారు.
కనీస డిపాజిట్
ఇంతకు ముందు వడ్డీ రావాలంలే కనీసం ఏడాదికి రూ.1,000 డిపాజిట్ చేయాలని నియమం ఉండేది. ప్రస్తుతం కనీస డిపాజిట్ చేయకున్నా ఉన్న సొమ్ముకు 4 శాతం వడ్డీ వచ్చేలా మార్పు చేశారు.
ఎలక్ట్రానిక్ బదిలీ (నెఫ్ట్, ఐఎంపీఎస్)
ఇంతకుముందు డిపాజిట్లను నగదు లేదా చెక్కు లేదా డీడీ రూపంలో మాత్రమే చేసేందుకు వీలుండేలా పథకం ఉండేది. ప్రస్తుతం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆన్‌లైన్ లేదా ఎలక్ట్రానిక్ బదిలీలను చేసేందుకు సైతం అవకాశమిస్తున్నారు. ఏ పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌లో ఖాతా ఉందో అక్కడ కోర్ బ్యాంకింగ్ ఉంటే ఎలక్ట్రానిక్ బదిలీ చేసుకోవచ్చు.
మెచ్యూరిటీ ఇలా
అమ్మాయికి 21 ఏళ్లు రాగానే ఖాతా మెచ్యూర్ అయ్యేటట్టు ఉండేది. ఖాతా తెరచినప్పటి నుంచి 21 ఏళ్లు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ తీరుతుంది. ఖాతా తెరిచే సమయానికి అమ్మాయి వయసు 10 ఏళ్లు మించకూడదు.
విత్ డ్రాయల్
ఇంతకుముందు ఆడపిల్లకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ పథకంలో డిపాజిట్ అయిన మొత్తాన్ని ఉపసంహరించుకోవడం సాధ్యంకాదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పదో తరగతి పాసై ఉన్నత విద్య కోసం అవసరమైతే డిపాజిట్‌లో సగం వరకు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది.
Advertisement
Advertisement