యూరప్‌కు కలంకారీ ఎగుమతి
- జేఎస్టీ, ఆదిత్య బిర్లా గ్రూపు ఆధ్వర్యంలో యాంత్రీకరణ
- త్వరలోనే పెడనలో యూనిట్ ప్రారంభం
మచిలీపట్నం : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెడన కలంకారీ వస్త్రాలకు మంచిరోజులు రానున్నాయి. కలంకారీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటి వరకు సహజసిద్ధమైన రంగులతో లినెన్ వస్త్రంపై చెక్క అచ్చుల(బ్లాక్స్) అద్దకంతో డిజైన్లు ముద్రించేవారు. కోల్‌కతాకు చెందిన ఆదిత్య బిర్లా నువో లిమిటెడ్ గ్రూపులోని జయశ్రీ టెక్స్‌టైల్స్ (జేఎస్టీ) కలంకారీ వస్త్రాలను మరింత నాణ్యతతో వేగంగా తయారు చేసే అంశంపై దృష్టి కేంద్రీకరించింది.
ఈ నెల11న జేఎస్టీ ప్రతినిధులు పెడనలో పర్యటించారు. ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు, ముద్రణకు ఉపయోగిస్తున్న పద్ధతులు, రంగుల తయారీ తదితర వివరాలను సేకరించారు. అనంతరం జేఎస్టీ మార్కెటింగ్ మేనేజర్ ఎస్.శ్రీనివాసన్, వీవర్స్ సర్వీస్ సెంటర్ (డబ్ల్యూఎస్సీ) డెప్యూటీ డెరైక్టర్ వినేష్ నటియాల్ పలు అంశాలను వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే వీవర్స్ సర్వీస్ సెంటర్, జేఎస్టీ సంయుక్త ఆధ్వర్యంలో యంత్రాల సాయంతో కలంకారీ వస్త్రాలను త్వరితగతిన తయారు చేసేందుకు ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. పెడనకు చెందిన వ్యాపారి పిచ్చుక శ్రీనివాస్‌కు చెందిన తయారీ కేంద్రంలో తొలుత ఈ యంత్రాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ వస్త్రాలను జేఎస్టీ కంపెనీ ద్వారా యూరప్ దేశాలకు ఎగుమతులు చేస్తామని చెప్పారు. కలంకారీ వస్త్రాల తయారీలో ఉపయోగించే లినెన్ క్లాత్‌ను తమ కంపెనీయే సరఫరా చేస్తుందని జేఎస్టీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసన్ వివరించారు.