విమానాల రిపేర్లకు అనువుగా తిరుపతి | Tirupati airport to become MRO hub | Sakshi
Sakshi News home page

విమానాల రిపేర్లకు అనువుగా తిరుపతి

Published Sat, Mar 26 2022 4:38 AM | Last Updated on Sat, Mar 26 2022 5:30 AM

Tirupati airport to become MRO hub  - Sakshi

గురుమూర్తి (కుడి). చిత్రంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి (ఎడమ), నేపాల్‌ మంత్రి ప్రేమ్‌ బహదూర్‌ ఏలే

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెంపుల్‌ సిటీగా పేరొందిన తిరుపతిలో విమానాల ఇంజిన్ల నిర్వహణ, రిపేర్, ఓవరాలింగ్‌ (ఎంఆర్‌వో) ఫెసిలిటీ ఏర్పాటు పనులను వేగిరం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తిరుపతి పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ గురుమూర్తి మద్దిల శుక్రవారం విన్నవించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంఆర్‌వో కేంద్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, వ్యాపార ఆవకాశాలను వివరిస్తూ ఇన్వెస్ట్‌ ఇండియా నివేదిక రూపొందించింది.

బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్‌ ఇండియా–2022 వేదికపై కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ రిపోర్ట్‌ను  ఆవిష్కరించారు. తిరుపతిసహా 8 ఎయిర్‌పోర్టుల్లో ఎంఆర్‌వో కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే నుంచి 440 మీటర్ల దూరంలోనే ప్రతిపాదిత ఎంఆర్‌వో కేంద్రం కోసం స్థలం ఉంది. ఇటువంటి సౌకర్యం దేశంలో ఏ ఎయిర్‌పోర్టులో కూడా లేదు. ఎంఆర్‌వో సేవలకు అనువుగా ఉంటుంది’ అని గురుమూర్తి తెలిపారు.  

రెండు హెలిప్యాడ్స్‌ సైతం..
తిరుమలకు ఏటా 5.8 కోట్ల మంది భక్తులు, సందర్శకులు వస్తున్నారని గురుమూర్తి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘వీరిలో 40 శాతం మంది ఖర్చుకు వెనుకాడరు. నాలుగైదు రోజులు గడిపేందుకు సిద్ధంగా ఉంటున్నారు. తిరుపతితోపాటు కోస్తా ప్రాంతంలో హెలిప్యాడ్స్‌ స్థాపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. ఇవి కార్యరూపంలోకి వస్తే తిరుమల వచ్చిన వారు కోస్తా ప్రాంతంలో ఉన్న సందర్శనీయ స్థలాలకు హెలికాప్టర్‌లో సులువుగా వెళ్లవచ్చు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది.

తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ పనులు వేగిరం అయ్యాయి. స్థల సేకరణలో తలెత్తిన సమస్యలు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో సమసిపోయాయి. కడపలో పైలట్‌ శిక్షణ కేంద్రం రానుంది. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే దక్షిణాదివారు శిక్షణ తీసుకోవచ్చు. భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరాం’ అని వివరించారు.  

విదేశీ సంస్థలకు సైతం..
ఇన్వెస్ట్‌ ఇండియా నివేదిక ప్రకారం.. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2017–18లో విమాన రాకపోకలు 7,094 నమోదయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరం ఇది ఏకంగా 10,738కు ఎగసింది. మహమ్మారి కారణంగా 2021–22లో ఈ సంఖ్య 6,613కు వచ్చి చేరింది. 2020–21తో పోలిస్తే ఇది 49% అధికం. 2017–18లో 6.57 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. ఈ సంఖ్య 2018–19లో 8.48 లక్షలకు ఎగసింది. 2021–22లో 47% అధికమై 5.02 లక్షలకు వచ్చి చేరింది.

ఇండిగో, స్పైస్‌ జెట్, ట్రూజెట్, అలయన్స్‌ ఎయిర్, ఎయిరిండియా, స్టార్‌ ఎయిర్‌ సంస్థలు అన్నీ కలిపి వారం లో 131 సర్వీసులు నడిపిస్తున్నాయి. తిరుపతి నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో 10 విమానాశ్రయాలు ఉన్నాయి. ఎంఆర్‌వో సేవలు అందించేందుకు ఈ నెట్‌వర్క్‌ దోహదం చేస్తుంది. ఆసియా పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సంస్థలకూ ఈ సేవలు విస్తరించేందుకు వ్యూహాత్మక కేంద్రంగా తిరుపతి ఉంది.

ఏటా భారత్‌కు 120 కొత్త విమానాలు: సింధియా
దేశంలో విమానయాన సంస్థల వద్ద ప్రస్తుతం 710 విమానాలు ఉన్నాయి. 2013–14లో ఈ సంఖ్య 400 మాత్రమే. రానున్న రోజుల్లో ఏటా కొత్తగా కనీసం 110–120 విమానాలు జతకూడనున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా శుక్రవారం తెలిపారు. ఇక్కడి బేగంపేటలో జరుగుతున్న వింగ్స్‌ ఇండియా–2022 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏడేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 74 నుంచి 140కి ఎగసింది.

మూడేళ్లలో ఇది 220లకు చేరుతుంది. దేశీయంగా 2013–14లో 6.7 కోట్ల మంది ప్రయాణించారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 14 కోట్లకు చేరింది. ప్రస్తుతం రోజుకు 3.83 లక్షల మంది విహంగ విహారం చేస్తున్నారు. మహమ్మారి నుంచి ఈ పరిశ్రమ వేగంగా కోలుకుంది. వచ్చే ఏడాది కోవిడ్‌–19 ముందస్తు స్థాయిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య రోజుకు 4.1 లక్షలు దాటనుంది. 2018–19లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 34.4 కోట్లు. 2024–25 నాటికి ఇది 40 కోట్లు దాటుతుంది’ అని సింధియా తెలిపారు.   
ఇన్వెస్ట్‌ ఇండియా నివేదికను జ్యోతిరాదిత్యతో కలిసి ఆవిష్కరిస్తున్న
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement