సనత్‌నగర్ (హైదరాబాద్): తెలంగాణను ఏవియేషన్ హబ్‌గా మారుస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గురువారం బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన వింగ్స్ ఇండియా–2024ను ఆయన సందర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన ఆయన హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమానాలు నడపాలని కోరారు.
అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో, గ్లోబల్ ఏవియేషన్ సమిట్‌ను నిర్వహించే అవకాశాన్ని హైదరాబాద్‌కు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏవియేషన్, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి సానుకూల వాతావరణం హైదరాబాద్‌లో ఉందన్నారు. ప్రపంచంలో నాణ్యమైన జీవనానికి అనువైన నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే మెర్సర్ సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత నివసించదగిన నగరంగా ఎంపికైందని చెప్పారు.
అమృత్‌కాల్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని పాత విమానాశ్రయాలను పునరుద్ధరించడం, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుపై దృష్టిసారించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి హెలిపోర్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు
భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా అడక్కల్ మండలం గుడిబండ గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు గ్రామం, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.
తొలి దశలో ఇప్పటికే వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ ఆరు విమానాశ్రయాల సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, ఇది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యామ్‌లో వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీనికి ఏఏఐ ప్రీ–ఫీజిబిలిటీ నివేదిక కూడా ఇచ్చిందన్నారు.
ఇదే కాకుండా మరికొన్నిచోట్ల కూడా వాటర్ ఏరోడ్రోమ్‌లను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ సముదాయాల వద్ద శాశ్వత హెలిప్యాడ్ సౌకర్యాలు ఉన్నాయని, ఇలాంటి సౌకర్యాలున్న మొదటి రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు.
రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ పరిశ్రమలు అత్యంత ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయన్నారు. తయారీ సేవలు, ఇంజనీరింగ్, శిక్షణతోపాటు అనుబంధ సంస్థలకు అతిథ్యం ఇవ్వడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీఎస్‌ఐఐసీ అనేక ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేసినట్లు కోమటిరెడ్డి వివరించారు.
లోహ విహంగాల సందడి
ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ వేదికైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా–2024 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది.
పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లు రన్‌వేపై కొలువుదీరాయి.
వీటిని తిలకించేందుకు బిజినెస్ విజిటర్స్‌తోపాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు ఆసక్తి కనబర్చారు. బోయింగ్ 777, ఎయిర్ ఇండియాతోపాటు ఆకాశ ఎయిర్ 737–8లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment