9 సూర్యకిరణ్ విమానాలతో ప్రదర్శన
పాల్గొననున్న ముఖ్యమంత్రి, మంత్రులు
రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
లక్ష మంది మహిళలు హాజరయ్యే అవకాశం
అధికారులతో సమీక్షలో సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు నెక్లెస్ రోడ్డు వద్ద వాయుసేనకు చెందిన 9 సూర్యకిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు, వాయుసేన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి నేతృత్వంలో ఈ ప్రదర్శన జరగనుంది. అద్భుత వైమానిక విన్యాసాలు చేసే ప్రపంచంలోనే అత్యుత్తమ ఐదు బృందాల్లో ఒకటైన సూర్యకిరణ్ టీం హైదరాబాద్‌లో ప్రదర్శన నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎయిర్ షో అనంతరం రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహిస్తున్నందున.. నెక్లెస్ రోడ్డు, పీవీ మార్గ్‌లో ప్రజల కోసం ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో నిర్వహించే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి లక్ష మంది మహిళలు హాజరవుతారని సీఎస్ చెప్పారు.
అందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సమీక్షలో టెలికాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీడీఎంఏ శ్రీదేవి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేవారి కోసం నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, గోశాల రోడ్, నిజాం కాలేజ్, పబ్లిక్ గార్డెన్స్ వద్ద పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ అదనపు కమిషనర్ విక్రంజీత్ సింగ్ మాన్ తెలిపారు. కాగా, వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి బృందం శనివారం సచివాలయంలో సీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను బహూకరించింది.
Comments
Please login to add a commentAdd a comment