repair services
-
భారత్‌లో విమానాల సర్వీసింగ్.. హాల్‌తో ఎయిర్‌బస్ జట్టు!
యూరోపియన్ మల్టీనేషనల్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ భారత్‌లో వాణిజ్య విమానాల సర్వీసింగ్లోకి ప్రవేశిస్తోంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) భాగస్వామ్యంతో దేశంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ , మరమ్మతులు, నవీకరణ (ఎంఆర్ఓ) పరిశ్రమను బలోపేతం చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య విమానాలు, ముఖ్యంగా విమాన ప్రయాణాన్ని సరళతరం చేసిన A320 రకానికి చెందిన విమానాల కోసం ఎంఆర్ఓ సేవల డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా సేవలందించేందుకు ఎయిర్‌బస్ ఈ భాగస్వామ్యం ద్వారా హాల్‌కు మద్దతు ఇస్తుంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ దేశంలో ఇంటిగ్రేటెడ్ ఎంఆర్ఓ హబ్‌ని స్థాపించి, విమానయాన సంస్థలకు సమర్థవంతమైన సేవలలు అందించాలనే దృక్పథంతో ఉందని, హాల్ నాసిక్ కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నం భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా ఉంటుందని హాల్ సీఈవో (MiG కాంప్లెక్స్) సాకేత్ చతుర్వేది పేర్కొన్నారు. భారతదేశంలో విమానయాన వ్యవస్థ బలోపేతానికి, అందుకు అత్యంత ఆవశ్యకమైన ఎంఆర్ఓ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎయిర్‌బస్ కట్టుబడి ఉందని ఎయిర్‌బస్ ఇండియా అండ్ దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్ తెలిపారు. ఒప్పందం ప్రకారం, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ టూల్ ప్యాకేజీని, ఎంఆర్ఓని సెటప్ చేయడానికి ప్రత్యేక కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. దీంతోపాటు ఎయిర్‌బస్ సపోర్ట్, టెక్నికల్ డేటాతోపాటు ట్రైనింగ్ సొల్యూషన్స్ అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఎయిర్‌బస్ వరల్డ్’కి యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆమోదించిన మూడు హ్యాంగర్లు, నైపుణ్యం కలిగిన మానవవనరులతో కూడిన పౌర విమాన ఎంఆర్ఓ సదుపాయాలు ఇప్పటికే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ నాసిక్ విభాగంలో ఉన్నాయి. -
గూగుల్ ఫోన్లకు ఎఫ్1 ఇన్ఫో రిపేర్ సర్వీసులు
బెంగళూరు: గూగుల్ పిక్సల్ ఫోన్ల విక్రయానంతర పూర్తి స్థాయి సేవలను ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ అయిన ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ భారత్‌లో ఆఫర్ చేయనుంది. నోయిడాలో కేంద్రీకృత మరమ్మతుల కేంద్రంతోపాటు, దేశవ్యాప్తంగా 27 పట్టణాల్లో సర్వీస్ సెంటర్ల ద్వారా ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ సేవలు అందించనుంది. ఫోన్‌ను తీసుకోవడం, పరీక్షించడం, మరమ్మతులు చేయడం, తిరిగి కస్టమర్‌కు అందించే సేవలను ఆఫర్ చేయనున్నట్టు ఎఫ్1 ఇన్ఫో సొల్యూషన్స్ ప్రకటించింది. ఫోన్లకు మరమ్మతులు చేయాల్సి వస్తే నోయిడాలోని ప్రధాన సర్వీస్ సెంటర్‌కు పంపించి పూర్తి చేస్తారు. -
ఫోన్ రిపైర్ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్: వీడియో వైరల్
ఒక మొబైల్ ఫోన్‌ని రిపైర్ చేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో లలిత్‌పూర్‌లోని పాలీలో చోటు చేసుకుంది. ఒక కస్టమర్ తన ఫోన్‌ని లలిత్‌పూర్‌లో ఉన్న మొబైల్ఫోన్లు రిపైర్ చేసే షాపుకి తీసుకువచ్చాడు. ఫోన్లో ఛార్జింగ్ సమస్య ఉందని షాపు యజమానికి చెప్పాడు. దీంతో సదరు షాపు యజమాని మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి బ్యాటరీ తీసేందుకు యత్నిస్తున్నాడు. అంతే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తు త్రుటిలో సదరు షాపు యజమాని, కస్టమర్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం షాపు వద్ద ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో... ఒక వ్యక్తి షాపు కౌంటర్ ముందు నిలబడి ఒక గ్లాస్‌పై తన మొబైల్‌ని పెట్టాడు. మరోవ్యక్తి ఒక టూల్ ఉపయోగించి బ్యాటరీ తీసేందుకు యత్నిస్తాడు. ఒక్కసారిగా పొగ వస్తూ పెద్దగా పేలుపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. उत्तर प्रदेश के ललितपुर में रिपेयरिंग के दौरान एक मोबाइल बम की तरह फट पड़ा pic.twitter.com/eBUCe9f4nL — Bhadohi Wallah (@Mithileshdhar) October 23, 2022 (చదవండి: కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకంటే?) -
ఇదేందయ్యా ఇది.. రూ.11 లక్షల కారు రిపేరుకు రూ.22 లక్షలు!
సాక్షి, బెంగళూరు: వరదలతో పాడైపోయిన కారును బాగు చేయించుకుందామనుకున్న ఓ వ్యక్తికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. తన కారు రిపేర్ కోసం సర్వీస్ సెంటర్ వాళ్లు ఇచ్చిన ఎస్టిమేట్ స్లిప్ చూసి అవాక్కయ్యాడు. రూ.11 లక్షల విలువైన వోక్స్వాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ కారును రిపేర్ చేసేందుకు రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేశారు. తనకు ఎదురైన ఈ సంఘటనను లింక్డ్ఇన్లో షేర్ చేశారు అనిరుధ్ గణేశ్. బెంగళూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గణేశ్ కారు పాడైపోయింది. పూర్తిగా నీటిలో మునిగిపోవటంతో ఇంజిన్ పనిచేయటం లేదు. దాంతో వోక్స్‌వాగ్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లారు గణేశ్. సుమారు 20 రోజుల తర్వాత కారు సర్వీస్ కోసం రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేసి పంపించారు. దీంతో ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించారు గణేశ్. కారు పూర్తిగా పాడైపోయిందని, దానిని రిపేర్ సెంటర్ నుంచి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. అయితే.. అక్కడి నుంచి తీసుకెళ్లాలంటే రూ.44,840 చెల్లించాలని సర్వీస్ సెంటర్ వాళ్లు చెప్పటంతో మరోమారు అవాక్కవ్వాల్సి వచ్చింది. కారు డ్యామేజ్ అంచనా వేసేందుకు పత్రాలు సిద్ధం చేసినందుకు గానూ ఆ ఫీజు కట్టాలని సూచించారు. ఈ విషయంపై వోక్స్వాగన్ సంస్థకు ఫిర్యాదు చేశారు గణేశ్. చివరకు రూ.5000 వేలు కట్టి కారు తీసుకెళ్లాలని సంస్థ సూచించింది. కారు రిపేరు కోసం ఇచ్చిన ఎస్టిమేషన్ స్లిప్ ఇదీ చదవండి: దసరా ఎఫెక్ట్: హైవేలపై పెరిగిన వాహనాల రద్దీ -
‘మరమ్మతు హక్కుల’ నిబంధనలపై కసరత్తు
న్యూఢిల్లీ: వినియోగదారులకు ఉత్పత్తులను స్వయంగా లేదా థర్డ్ పార్టీల ద్వారా మరమ్మతు చేయించుకునే హక్కులను (రైట్ టు రిపేర్) కల్పించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 13న తొలిసారిగా భేటీ అయింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ విషయాలు తెలిపింది. రిపేర్లు, విడిభాగాల విషయంలో కంపెనీలు ఏ విధంగా గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయనేది కమిటీ .. సమావేశంలో చర్చించింది. ప్రధానంగా వ్యవసాయ పరికరాలు, మొబైల్ ఫోన్లు/ట్యాబ్లెట్లు, వినియోగ వస్తువులు, కార్ల వంటి ఆటోమొబైల్స్/ఆటోమొబైల్ పరికరాల రంగాల్లో ఇలాంటి ధోరణులను పరిశీలించింది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తుల మరమ్మతుకు తాము తయారు చేసే పరికరాలే వాడాలని, తమ దగ్గరే రిపేరు చేయించుకోవాలని .. థర్డ్ పార్టీలు లేదా సొంతంగా మరమ్మతు చేసుకుంటే వారంటీలు పనిచేయవంటూ షరతులు పెడుతుంటాయి. అలాగే పలు సంస్థలు ఉద్దేశపూర్వకంగా .. కొంత కాలానికి మాత్రమే పనిచేసేలా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఆ తర్వాత అవి రిపేరుకు కూడా పనికి రాకుండా పోవడం వల్ల కస్టమర్లు మళ్లీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తోంది. ఫలితంగా పాతవి వ్యర్ధాల కింద మారుతున్నాయి. ఇలాంటి నియంత్రణలు, గుత్తాధిపత్య ధోరణులు .. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించేవేనని ప్రభుత్వ కమిటీ అభిప్రాయపడింది. సమస్యలు వస్తే ఎలా రిపేరు చేసుకోవాలి, వేటిని ఉపయోగించాలి లాంటి విషయాల గురించి కస్టమర్లకు కంపెనీలు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసం థర్డ్ పార్టీలు, వ్యక్తులకు ఆయా సాధనాలను అందుబాటులో ఉంచాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రైట్ టు రిపేర్ వల్ల వ్యర్ధాలను కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు’ రైట్ టు రిపేర్’ని గుర్తించాయి. -
విమానాల రిపేర్లకు అనువుగా తిరుపతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెంపుల్ సిటీగా పేరొందిన తిరుపతిలో విమానాల ఇంజిన్ల నిర్వహణ, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) ఫెసిలిటీ ఏర్పాటు పనులను వేగిరం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి మద్దిల శుక్రవారం విన్నవించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, వ్యాపార ఆవకాశాలను వివరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా నివేదిక రూపొందించింది. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 వేదికపై కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ రిపోర్ట్‌ను ఆవిష్కరించారు. తిరుపతిసహా 8 ఎయిర్‌పోర్టుల్లో ఎంఆర్వో కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే నుంచి 440 మీటర్ల దూరంలోనే ప్రతిపాదిత ఎంఆర్వో కేంద్రం కోసం స్థలం ఉంది. ఇటువంటి సౌకర్యం దేశంలో ఏ ఎయిర్‌పోర్టులో కూడా లేదు. ఎంఆర్వో సేవలకు అనువుగా ఉంటుంది’ అని గురుమూర్తి తెలిపారు. రెండు హెలిప్యాడ్స్ సైతం.. తిరుమలకు ఏటా 5.8 కోట్ల మంది భక్తులు, సందర్శకులు వస్తున్నారని గురుమూర్తి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘వీరిలో 40 శాతం మంది ఖర్చుకు వెనుకాడరు. నాలుగైదు రోజులు గడిపేందుకు సిద్ధంగా ఉంటున్నారు. తిరుపతితోపాటు కోస్తా ప్రాంతంలో హెలిప్యాడ్స్ స్థాపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. ఇవి కార్యరూపంలోకి వస్తే తిరుమల వచ్చిన వారు కోస్తా ప్రాంతంలో ఉన్న సందర్శనీయ స్థలాలకు హెలికాప్టర్లో సులువుగా వెళ్లవచ్చు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ పనులు వేగిరం అయ్యాయి. స్థల సేకరణలో తలెత్తిన సమస్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చొరవతో సమసిపోయాయి. కడపలో పైలట్ శిక్షణ కేంద్రం రానుంది. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే దక్షిణాదివారు శిక్షణ తీసుకోవచ్చు. భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరాం’ అని వివరించారు. విదేశీ సంస్థలకు సైతం.. ఇన్వెస్ట్ ఇండియా నివేదిక ప్రకారం.. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2017–18లో విమాన రాకపోకలు 7,094 నమోదయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరం ఇది ఏకంగా 10,738కు ఎగసింది. మహమ్మారి కారణంగా 2021–22లో ఈ సంఖ్య 6,613కు వచ్చి చేరింది. 2020–21తో పోలిస్తే ఇది 49% అధికం. 2017–18లో 6.57 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. ఈ సంఖ్య 2018–19లో 8.48 లక్షలకు ఎగసింది. 2021–22లో 47% అధికమై 5.02 లక్షలకు వచ్చి చేరింది. ఇండిగో, స్పైస్ జెట్, ట్రూజెట్, అలయన్స్ ఎయిర్, ఎయిరిండియా, స్టార్ ఎయిర్ సంస్థలు అన్నీ కలిపి వారం లో 131 సర్వీసులు నడిపిస్తున్నాయి. తిరుపతి నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో 10 విమానాశ్రయాలు ఉన్నాయి. ఎంఆర్వో సేవలు అందించేందుకు ఈ నెట్వర్క్ దోహదం చేస్తుంది. ఆసియా పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సంస్థలకూ ఈ సేవలు విస్తరించేందుకు వ్యూహాత్మక కేంద్రంగా తిరుపతి ఉంది. ఏటా భారత్‌కు 120 కొత్త విమానాలు: సింధియా దేశంలో విమానయాన సంస్థల వద్ద ప్రస్తుతం 710 విమానాలు ఉన్నాయి. 2013–14లో ఈ సంఖ్య 400 మాత్రమే. రానున్న రోజుల్లో ఏటా కొత్తగా కనీసం 110–120 విమానాలు జతకూడనున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా శుక్రవారం తెలిపారు. ఇక్కడి బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏడేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 74 నుంచి 140కి ఎగసింది. మూడేళ్లలో ఇది 220లకు చేరుతుంది. దేశీయంగా 2013–14లో 6.7 కోట్ల మంది ప్రయాణించారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 14 కోట్లకు చేరింది. ప్రస్తుతం రోజుకు 3.83 లక్షల మంది విహంగ విహారం చేస్తున్నారు. మహమ్మారి నుంచి ఈ పరిశ్రమ వేగంగా కోలుకుంది. వచ్చే ఏడాది కోవిడ్–19 ముందస్తు స్థాయిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య రోజుకు 4.1 లక్షలు దాటనుంది. 2018–19లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 34.4 కోట్లు. 2024–25 నాటికి ఇది 40 కోట్లు దాటుతుంది’ అని సింధియా తెలిపారు. ఇన్వెస్ట్ ఇండియా నివేదికను జ్యోతిరాదిత్యతో కలిసి ఆవిష్కరిస్తున్న -
పని చేసే చోటే చోరీ!!... అయితే చివరికి...
గచ్చిబౌలి: పని చేసే గ్యారేజ్‌కు కన్నం వేసిన ఓ మెకానిక్ భారీ చోరీకి పాల్పడి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. అసీఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్ తాహెర్ అయ్యప్పసొసైటీలోని శ్రీ మోటార్స్ మల్టీబ్రాండ్ లగ్జరీ కారు సర్వీసింగ్ సెంటర్లో మెకానిక్‌గా పని చేస్తున్నారు. షోరూం యజమాని గేడంపేట్లో మరో షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు నగదు తీసుకువచ్చి సర్వీసింగ్ సెంటర్లోని అల్మారా పెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన తాహెర్ నగదు కాజేసేందుకు తన స్నేహితులైన సయ్యద్ జావెద్, సైఫ్ మొయినొద్ధీన్తో కలిసి పథకం పన్నాడు. తెల్లవారు జాము ముగ్గురు కలిసి బైక్‌పై గ్యారేజ్‌కు వచ్చారు. తాహెర్ దూరంగా ఉండి వచ్చిపోయేవారిని గమనిస్తుండగా, సైఫ్ మొయినొద్ధీన్ సర్వీస్ సెంటర్ వెనక డోర్ స్క్రూలు తొలగించి లోపలికి ప్రవేశించాడు. లాకర్‌ను తెరిచి నగదు తీసుకెళ్లాడు. మర్నాడు వాచ్మెన్ బాలరాజు అల్మారా తలుపు తెలిచి ఉండటాన్ని గుర్తించి యజమానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు తాహెర్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. చోరీ సొత్తు మూడు భాగాలుగా.. చోరీ చేసిన సొమ్మును తాహెర్ రూ.20 లక్షలు, జావెద్ రూ.20 లక్షలు, సైఫ్ మొయినొద్ధీన్ రూ.15 లక్షలు పంచుకున్నారు. అయితే ఇందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు తాహెర్ యథావిధిగా సర్వీసింగ్ సెంటర్‌కు వస్తున్నాడు. దాదాపు 45 మందిని విచారించిన పోలీసులు చివరికి తాహెర్‌ను నిందితుడిగా గుర్తించారు. సమావేశంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఓటీ సీఐ శివ ప్రసాద్, ఎస్ఐ విజయ వర్ధన్ పాల్గొన్నారు. -
‘అమ్మా ఫోన్ రిపేర్ చేయించుకుని వస్తా’..! యువతి అదృశ్యం..
బాలానగర్: మొబైల్ ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి తిరిగి ఇంటికి రాని సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ ఎన్.డి.వాకింగ్ ఇన్ తెలిపిన వివరాలు.. బాలానగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్‌కు చెందిన ఎ.విష్ణు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అతని కుమార్తె లావణ్య (20) ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ నెల 7న సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: ఐదేళ్ల పోరాటం: బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష! -
యాపిల్ బంపర్ ఆఫర్..! ఇకపై మీఫోన్‌లను మీరే బాగు చేసుకోవచ్చు..!
ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ శుభవార్త చెప్పింది. ఇకపై ఐఫోన్ వినియోగదారులు వారి ఫోన్లను వారే రిపేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందుకోసం యాపిల్ సంస్థ సెల్ఫ్ సర్వీస్ స్కీమ్‌ను ప్రారంభించనుంది. యూఎస్, యూకే దేశాల్లో వినియోగదారులు వాషింగ్ మెషిన్,టీవీ, ఫ్రిడ్జ్‌లు, ఫోన్లు ఇలా.. ఏదైనా ఎలక్ట్రిక్ ప్రొడక్ట్‌లు చెడిపోతే సొంతంగా రిపేర్ చేసే అధికారం లేదు. ప్రొడక్ట్ చెడిపోయిందంటే సర్వీస్ సెంటర్‌కు తీసుకొని వెళ్లాల్సిందే. దీంతో వినియోగదారులు పెద్దఎత్తున రైట్-టూ రిపేర్ ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంతో దిగొచ్చిన యూకే ఈ ఏడాది జులై నెలలో ఎలక్ట్రిక్ ప్రొడక్ట్‌లు వినియోగదారులు రిపేర్ చేసుకోవచ్చంటూ కొత్త చట్టాన్ని అమలు చేసింది. వారం రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అదే చట్టాన్ని దేశంలో అమలు చేసేలా ప్రణాళికల్ని సిద్ధం చేయాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ftc)కి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 'సెల్ఫ్ సర్వీస్ స్కీమ్'ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2022లో ప్రారంభం కానున్న ఈ స్కీమ్‌లో భాగంగా యాపిల్ వినియోగదారులు,5వేల మంది యాపిల్ ఆథరైర్డ్ సర్వీస్ ప్రొవైడర్లు, 2,800మంది వినియోగదారులు ఈ స్కీమ్‌లో పాల్గొనవచ్చని యాపిల్ వెల్లడించింది. 'సెల్ఫ్ సర్వీస్ స్కీమ్'తో లాభాలేంటి? యాపిల్ ప్రారంభించనున్న ఈ 'సెల్ఫ్ సర్వీస్ స్కీమ్' వల్ల యాపిల్ ప్రొడక్ట్‌లను రిపేర్ చేయొచ్చు. సొంతంగా ఉపాధిని పొందవచ్చు. యాపిల్ సంస్థకు కొన్ని దేశాల్లో సొంత సర్వీస్ సెంటర్లు లేవు. థర్డ్ పార్టీ సంస్థల నుంచి యాపిల్ ప్రొడక్ట్ అమ్మకాలు, సర్వీసులు జరుగుతాయి. ఈ థర్డ్ పార్టీ సర్వీస్ సెంటలలో ప్రొడక్ట్ రిపేర్ చేయించాలంటే తడిసి మోపెడవుతుంది. అయితే యాపిల్ ప్రొగ్రాంతో సర్వీస్ ఖర్చు తగ్గిపోతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఓలా ఎలక్ట్రిక్ బైక్స్‌లో ఏదైనా సమస్య వస్తే ఏలా..! కంపెనీ ఏం చెప్తుంది..?
ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్లతో సంచలనాన్ని ఆవిష్కరించింది. ప్రీ బుకింగ్స్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన ప్రియులు ఒక్కసారిగా ఎగబడడంతో ఓలా అమ్మకాలు జరిపిన తొలిరోజులో రూ. 600 కోట్లు, రెండు రోజుల్లో మొత్తంగా రూ. 1100 కోట్ల విలువైన స్కూటర్లను ఓలా విక్రయించింది. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! ఏదైనా సమస్య వస్తే ఎలా...! దేశ ప్రజలు నుంచి ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ అత్యంత ఆదరణను పొందాయి. ఈ స్కూటర్లను బుక్ చేసిన కస్టమర్లకు రాబోయే నెలలో డెలివరీ చేయనున్నట్లు ఓలా పేర్కొంది. అంతేబాగానే ఉంది కానీ ఒక వేళ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏదైనా సమస్య తలెత్తితే ఎలా...అనే ప్రశ్నపై కంపెనీ వర్గాలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు అద్భుతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, కంపెనీ సర్వీస్ నెట్వర్క్ విషయానికి వస్తే కొంత సందేహం ఉంది. డీలర్లు, సేవా కేంద్రాల రూపంలో కంపెనీకి భౌతికంగా ఎక్కువ ఉనికి లేదు. కొనుగోలుదారులు స్కూటర్లను కొన్న తర్వాత వారిని తొలిచే అతి పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది. ఇంటి వద్దకే... ఎలక్ట్రిక్ స్కూటర్లను సర్వీస్ చేయడానికి తీసుకోవలసిన చర్యలపై ఓలా ఎలక్ట్రిక్ తన అధికారిక వెబ్సైట్లో లిస్ట్ చేసింది. ప్రామాణిక కార్ కంపెనీలతో పోలిస్తే సర్వీసింగ్, మెయింటెన్స్ విషయంలో ఓలా ఎలక్ట్రిక్ భారీ తారతామ్యం ఉంది. ఆన్లైన్ డెలివరీ ప్రక్రియను స్నేహపూర్వకంగా మార్చాలని కంపెనీ యోచిస్తున్నందున... ఎలక్ట్రిక్ బైక్‌ల సర్వీసులను కూడా కస్టమర్ ఇంటి వద్దే జరపాలని కంపెనీ యోచిస్తోంది. ఓలా బైక్‌లో ఏదైనా సమస్య తలెత్తితే...ఓలా ఎలక్ట్రిక్ యాప్‌ను ఉపయోగించి..సర్వీస్‌పై రిక్వెస్ట్ చేయడంతో ఓలా బైక్ టెక్నీషియన్ ఇంటి వద్దకే వచ్చి రిపేర్ చేస్తాడని తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ బైక్స్‌లోని ప్రిడిక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ సహయంతో వాహనదారులను సర్వీస్, రిపేర్ కోసం అలర్ట్‌లను అందిస్తోంది. కాగా త్వరలోనే ఆఫ్‌లైన్, ఆన్లైన్ కొనుగోళ్లను ఓలా చేపట్టనుంది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా పలు ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. చదవండి: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! -
నాన్నపై ప్రేమతో..
విశాఖ :ఈమె పేరు రేవతి. చదివింది డిగ్రీ. కుటుంబ భారాన్ని మోయడానికి మెకానిక్‌గా మారింది. విశాఖ సుజాతానగర్ ప్రాంతానికి చెందిన కె.రాముకు కొడుకు లేని లోటు తీరుస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. కరోనా కష్ట కాలంలో తండ్రి మెకానిక్ షాపులో బైక్‌లు రిపేర్ చేస్తూ కుటుంబానికి చేయూతనందిస్తోంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. -
మీ స్మార్ట్‌ఫోన్ పగిలిందా?
♦ ఆన్లైన్లో మరమ్మతు సేవలందిస్తున్న జస్ట్‌లైక్‌న్యూ.ఇన్ ♦ ప్రస్తుతం ఫోన్లు, ట్యాబ్లెట్స్; త్వరలో ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్ వాచీలు కూడా ♦ ఉచిత డెలివరీ, 48 గంటల్లో రిపేరింగ్, 3 నెలల వారంటీ ♦ ఈ ఏడాదిలో ముంబై, చెన్నై, పుణెలకు విస్తరణ ♦ ఈ నెలాఖరులోగా రూ.3 కోట్ల నిధుల సమీకరణ ♦ ‘సాక్షి’ స్టార్టప్ డైరీతో కో-ఫౌండర్ రామకృష్ణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాధారణంగా ఏ ఎలక్ట్రానిక్ పరికరమైనా పాడైతే రెండు ఆప్షన్లుంటాయి. ఒకటి... రిపేరు చేయించటం. రెండోది... దాన్ని వదిలేసి కొత్తది కొనుక్కోవటం. అయితే స్మార్ట్ఫోన్ల విషయానికొస్తే చాలామంది రిపేరుకే ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ మరీ రిపేరుకయ్యే మొత్తం ఎక్కువనుకుంటే మాత్రం... కొత్త ఫోన్ కొనుక్కుంటారు. కానీ ఇక్కడ చిక్కేంటంటే రిపేరు ఎక్కడ చేయించాలి అని!!?. ఎందుకంటే దగ్గర్లోని సాధారణ రిపేరింగ్ సెంటర్లో చేయిస్తే తక్కువ ఖర్చవుతుంది. కానీ గ్యారంటీ ఉండదు. ఇక సర్వీస్ సెంటర్‌కు తీసుకెళితే గ్యారంటీ ఉంటుంది కానీ ఖర్చు మాత్రం భారీగా ఉంటుంది. ఇదిగో... ఇలాంటి సందిగ్ధాన్నే వ్యాపారంగా చేసుకుంది ‘జస్ట్‌లైక్‌న్యూ’ బృందం!!. ఐఐటీ, ఎక్స్ఎల్ఆర్ఐ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన నలుగురు మిత్రులు అజిత్ పాణిగ్రహి, రాహుల్ అగర్వాల్, రామకృష్ణ చావ, విధి సింఘాల్ రూ.20 లక్షల పెట్టుబడితో గతేడాది ఏప్రిల్‌లో బెంగళూరు కేంద్రంగా జస్ట్‌లైక్‌న్యూ.ఇన్ను ప్రారంభించారు. సంస్థ సేవలు, విస్తరణ ప్రణాళిక గురించి కో-ఫౌండర్ రామకృష్ణ ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి ఏం చెప్పారంటే... 20 బ్రాండ్లు.. 10 వేల రకాల రిపేర్లు.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్, ట్యాబ్లెట్స్ను రిపేరు చేస్తున్నాం. 80 శాతం రిపేర్లు స్క్రీన్లు పగులుతున్నవే వస్తున్నాయి. దాదాపు 20 రకాల బ్రాండ్లు, 400 రకాల మోడల్స్‌లో 10 వేల రకాల రిపేర్లున్నాయి. ఉత్పత్తి పికప్, డెలివరీ రెండూ ఉచితమే. స్టాండ్‌బై మొబైల్, 3 నెలల వారంటీ ఇవ్వటం మా ప్రత్యేకత. 48 గంటల్లో రిపేర్ చేసి ఇంటికి డెలివరీ చేస్తాం. ఆయా ఉత్పత్తులను రిపేర్ చేసేముందు 25 కోణాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. అందుకు సంబంధించిన క్యూసీ రిపోర్ట్‌ను కస్టమర్లకు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తాం కూడా. ప్రతి నెలా 25 శాతం వృద్ధిని సాధిస్తున్నాం. ఈ మే నెలలో 2,000 ఉత్పత్తులను రిపేరు ఇందులో 80 శాతం స్మార్ట్ఫోన్లు, 20 శాతం ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మూడేళ్లలో 15 నగరాలకు విస్తరణ.. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో సేవలందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి వచ్చే ఆర్డర్ల కోసం కొరియర్ సంస్థ డెల్హివరితో ఒప్పందం చేసుకున్నాం. మూడేళ్లలో దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలనేది మా లక్ష్యం. ఈ ఏడాది ముగింపు నాటికి ముంబై, చెన్నై, పుణె నగరాలకు విస్తరించనున్నాం. సేవల విస్తరణ విషయానికొస్తే.. ఈ ఏడాదిలో ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్ వాచీల రిపేరింగ్ సేవల్లోకి ప్రవేశిస్తాం. రెండేళ్లలో ఫ్రాంచైజీ మోడల్ లో రిటైల్ ఔట్‌లెట్‌ను కూడా ప్రారంభిస్తాం. రూ.3 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం నెలకు రూ.40 లక్షల టర్నోవర్‌ను చేరుకుంటున్నాం. మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 15 మంది టెక్నీషన్స్. ‘‘గతేడాది జూలైలో ఏంజిల్ రౌండ్లో భాగంగా కోటి రూపాయల నిధులను సమీకరించాం. ఇండిగో కన్సల్టింగ్ మాజీ ఎండీ వికాస్ టండన్, కాపిలరీ టెక్నాలజీస్ సీఈఓ అనీష్‌రెడ్డి, ఇన్వెస్టరు వికాస్ సాలుగూటి మా సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఈ నెలాఖరులోగా రూ.3 కోట్ల నిధులను సమీకరిస్తాం. చర్చలు పూర్తయ్యాయి. ఇందులో ఏంజిల్ ఇన్వెస్టర్లతో పాటూ హెచ్‌బీసీ సెక్యూరిటీస్ ఎండీ హర్ష పప్పు, మైండ్‌ట్రీ చైర్మన్ కృష్ణ కుమార్, ఒరాకిల్ ఇండియా మాజీ ఎండీ సందీప్ మాథుర్లున్నారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...