ప్రతీకాత్మక చిత్రం
ఒక్క ఓటు చాలు గెలుపోటములను నిర్ణయించేందుకు.. అందుకే పోలింగ్ దగ్గర పడిందంటే చాలు ఓటర్లు ఎక్కడ ఉన్నా సరే.. వారిని స్వస్థలానికి రప్పించేందుకు నాయకులు ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శిస్తారు.. అలాంటిది ఒకే కుటుంబంలో 66 మంది ఓటర్లు ఉండే విడిచిపెడతారా.. తమకే ఓటు వేయాలంటూ వారి వెంటపడటం సహజం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యూపీకి చెందిన రామ్ నరేష్ భుర్టియా కుటుంబం ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. వివిధ పార్టీల నాయకుల రాకతో ఆయన ఇంట్లో సందడి నెలకొంది.
మొత్తం 82 మంది సభ్యులు..
అలహాబాద్‌లోని బహ్రెచా గ్రామానికి చెందిన రామ్ నరేష్(98) కుటుంబంలో మొత్తం 82 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ఒకే ఇంటిలో నివసిస్తారు. వీరిలో 66 మందికి ఓటు హక్కు ఉంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందే ఈ కుటుంబంలో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ముంబైలో పనిచేస్తున్నారు. కొడుకులు, మనవలతో కళకళలాడే కుటుంబం గురించి యజమాని రామ్ నరేష్ మాట్లాడుతూ.. ‘ ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. అందరికీ కలిపి ఒకే వంటగది ఉంటుంది. మా భోజనం కోసం రోజుకు 15 కిలోల బియ్యం, 20 కిలోల కూరగాయలు వండుతారు. రొట్టెల కోసం 10 కిలోల పిండి అవసరమవుతుంది. ఇన్నేళ్లుగా ఏ ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా వేరుగా ఉండాలన్న ఆలోచన కాలేదు. మాలాగే జాతి మొత్తం ఒకే కుటుంబంలా ఉండాలని కోరుకుంటా. ఈసారి మా కుటుంబంలో ఎనిమిది మంది ఆదివారం కొత్తగా ఓటు వేయబోతున్నారు. వారెంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఒకే పోలింగ్ బూత్‌లో మాకు ఓటు వేసే అవకాశం కల్పించారు. అక్కడికి వెళ్లేందుకు మాకోసం ప్రత్యేకంగా బస్సు కూడా వస్తుంది. ప్రతీసారి కలిసికట్టుగా విధిగా ఓటు వేసే మమ్మల్ని పోలింగ్ అధికారులు సాదరంగా ఆహ్వానిస్తారు’ అని ఆనందం వ్యక్తం చేశాడు.
హామీలకే పరిమితం..
గ్రామంలో అత్యధిక మంది ఓటర్లు ఉన్న కుటుంబంగా గుర్తింపు పొందిన రామ్ నరేష్ కుటుంబంపై స్థానిక నాయకులతో పాటు బడా నాయకులు కూడా ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఓట్ల పండుగ రాగానే వీరి ఇంటికి చేరుకుంటారు. అయితే తమకున్న సమస్యలు తీరుస్తామంటూ హామీ ఇస్తారే తప్ప ఎన్నికలు పూర్తవ్వగానే కనీసం తమవైపు కూడా చూడరంటూ ఈ కుటుంబానికి చెందిన శంకర్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘ ఎన్నికలు రాగానే అభ్యర్థులు మా ఇంటికి లైన్లు కడతారు. మట్టిగోడలతో కూడిన పాత ఇంటిని కూల్చి.. పక్కా ఇళ్లు కట్టుకోవాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నాం. అయితే మా ఇంటిపై హై టెన్షన్ వైర్లు ఇందుకు అడ్డుగా ఉన్నాయి. ఇంట్లో అమ్మాయిలకు కూడా ప్రత్యేక గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా నాయకులను, ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ వాళ్లను ఎన్నోసార్లు అడిగాం. ఎన్నికల సమయంలో హామీ ఇస్తారే గాని, ఆ తర్వాత మా గురించి పట్టించుకోరు. మా సమస్య తీర్చిన తర్వాతే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం. కానీ బాధ్యత గల పౌరులుగా ఓటు వేయకుండా ఉండలేకపోతున్నాం అంటూ అన్ని సౌకర్యాలు, అవకాశాలు ఉండికూడా ఓటు వేయడానికి బద్ధకించే ఎంతో మంది వ్యక్తులకు శంకర్ ఆదర్శంగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment