వన్నె తగ్గని ఎన్నిక | Hema Malini was elected from Mathura Lok Sabha seat in Uttar Pradesh once again | Sakshi
Sakshi News home page

వన్నె తగ్గని ఎన్నిక

Published Mon, May 27 2019 2:09 AM | Last Updated on Mon, May 27 2019 2:09 AM

Hema Malini was elected from Mathura Lok Sabha seat in Uttar Pradesh once again - Sakshi

క్లాసికల్‌ డాన్సర్, నటి, రచయిత, డైరెక్టర్, ప్రొడ్యూసర్, పొలిటీషియన్‌..ఒక ఎంపవర్డ్‌ ఉమన్‌లోని ఆరు కోణాలివి. ఆ ఆరూ కీలకమైనవే.సమర్థతతో పోటీ పడి రాణించాల్సిన రంగాలే. ఇన్నింటి మధ్య తననుతాను నిరూపించుకుంటూ... కొన్ని వివాదాలు, మరికొన్ని విమర్శలు,అంతకు మించిన వ్యంగాస్త్రాల మధ్య మూడో దఫా పార్లమెంట్‌లోఅడుగు పెడుతున్నారు ప్రముఖ నటి హేమమాలిని.

అరవైల నుంచి ఎనభైల వరకు యువత గుండెల్లో కలలు పూయించిన డ్రీమ్‌గర్ల్‌ హేమమాలిని... ఉత్తర ప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. నలభై ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్‌లో 150 సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ స్వప్న సుందరి సినిమాలకు దూరమయ్యారు కానీ ప్రేక్షకులకు దగ్గర కాకుండా లేరు. టీవీ సీరియల్స్, వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూనే ఉన్నారు. పుట్టింటి రాష్ట్రం తమిళనాడుకు చెందిన ఓ టెక్స్‌టైల్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయడానికి గులాబీ రంగు పట్టుచీరలో అప్పుడే విరిసిన గులాబీలా కనిపించే హేమ, మరో యాడ్‌లో శుద్ధజలం అంటూ అప్పుడే ఇంటిపనులు చక్కబెట్టుకొచ్చిన గృహిణిలా కనిపిస్తారు. వీటితోపాటు భారతీయ కళల పరిరక్షణ కోసం తన వంతుగా నాట్య ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. నాట్యం చేయని రోజు తనకేమీ తోచదని చెబుతుంటారు హేమమాలిని. క్లాసికల్‌ డాన్స్‌తోపాటు రెగ్యులర్‌గా యోగసాధన చేస్తారామె. డెబ్బై ఏళ్ల వయసులో కూడా హేమ ఇంత అందంగా ఉండటానికి బహుశా అవే ఆమె బ్యూటీ సీక్రెట్స్‌ కావచ్చు.

అయ్యంగారమ్మాయి
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అయ్యంగార్‌ల కుటుంబంలో పుట్టిన హేమమాలినీ చక్రవర్తి ఉత్తర ప్రదేశ్‌లోని మధురను రాజకీయ క్షేత్రంగా మలుచుకున్నారు. సినిమా నిర్మాత కూతురు కావడం, భరత నాట్య కళాకారిణి కావడంతో ఆమె టీనేజ్‌లోనే సినిమాల్లోకి వచ్చేశారు. చెన్నైలో ప్లస్‌టూ చదువుతుండగానే ‘ఇతు సాహిత్యం’ తమిళ సినిమాలో సహనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. సినిమాల్లోకి రావడం వల్ల తనకు ఇష్టమైన హిస్టరీ సబ్జెక్ట్‌ దూరం కావలసి వచ్చిందనే ఆవేదన ఆమె మాటల్లో వ్యక్తమవుతుండేది. ఆ కొరతను భర్తీ చేసుకోవడానికే ఆమె ‘పరంపర’ చారిటబుల్‌ ఈవెంట్స్‌లో పాల్గొని మైసూరు, ఖజురహో వంటి చారిత్రక ప్రదేశాల్లో ఇప్పటికీ నాట్య ప్రదర్శనలిస్తున్నారు.

సామాజిక కార్యకర్త
హేమమాలిని యానిమల్‌ రైట్స్‌ యాక్టివిస్టుగా సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటారు. ముంబయిలో గుర్రాల మీద బరువులు రవాణా చేయడాన్ని ఆమె తీవ్రంగా గర్హించేవారు. ఈ పరిస్థితిని నియంత్రించవలసిందిగా ఆమె  మున్సిపల్‌ కమిషనర్‌కు రిపోర్టు చేశారు కూడా. అలాగే జల్లికట్టు విషయంలోనూ ఆమె స్పందించారు. అప్పటి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జైరామ్‌ రమేశ్‌కు వివరంగా ఉత్తరం రాశారు.

‘జల్లికట్టులో భాగంగా పశువులను నియంత్రించడానికి ముక్కుతాళ్లను పట్టుకుని గట్టిగా లాగుతుంటారు. అలా లాగడం పశువులకు ఎంతో హింసాత్మకం’ అంటూ, జల్లికట్టు సందర్భంగా అవి ఎన్ని రకాలుగా గాయపడుతుంటాయనే విషయాలను కూడా ఆ ఉత్తరంలో వివరంగా రాశారామె. పెటా (పీపుల్‌ ఫర్‌ ద ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌) ఇయర్‌ ఆఫ్‌ ది అవార్డుకు ఎంపికైన సందర్భంగా.. ‘తన సంతోషం కోసం మరో ప్రాణికి హాని కలిగించడాన్ని ఇష్టపడని కారణంగానే తాను శాకాహారిగా ఉన్నట్లు’ చెప్పారు హేమమాలిని.

అభ్యుదయవాది
సమాజంలో మహిళకు ఎదురవుతున్న సమస్యల మీద స్పందిస్తూ మహిళాభ్యుదయం కోసం వ్యాసాలు రాస్తుంటారు హేమమాలిని. ‘న్యూ ఉమన్‌’, ‘మేరీ సహేలీ’ పత్రికలకు కొంతకాలం ఎడిటర్‌గా ఉన్నారామె. సంప్రదాయ పితృస్వామ్య భావజాలంతో నిర్మితమైన సమాజంలో మహిళ స్థానం ఎలా ఉందో చూపిస్తూ, ఆ పరిస్థితులను అధిగమించి పురోగమించాల్సిందిగా తన వ్యాసాల్లో సూచించేవారామె. స్త్రీ తనను తాను ఆధునిక మహిళగా మలుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలనేది హేమమాలిని అభిప్రాయం. ఈ అభ్యుదయవాదమే ఆమెను నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ని చేసింది. ఆ హోదాకు ఎంపికైన తొలి మహిళ హేమమాలిని. ఆమె ఇస్కాన్‌ లైఫ్‌ మెంబర్‌ కూడా.

కోలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి
తమిళంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐదారేళ్లకే బాలీవుడ్‌ వచ్చి హేమమాలిని ఇంటి తలుపు తట్టింది. 1968లో ‘సప్నోం కా సౌదాగర్‌’ సినిమాతో హిందీ తెరను అలరించేనాటికి అదే తన పర్మినెంట్‌ అడ్రస్‌ అవుతుందని ఆమె ఊహించలేదు. ఆ తర్వాత రెండేళ్లకే పరిచయమయ్యారు ధర్మేంద్ర. ఆ పరిచయం ప్రేమగా మారి, పెళ్లి బంధంతో బలపడడానికి పదేళ్లు పట్టింది. అప్పటికే పెళ్లయి పిల్లలున్న ధర్మేంద్ర.. డ్రీమ్‌గర్ల్‌ మీద ప్రేమను పెంచుకున్నాడు.

ఇద్దరూ కలిసి 35 సినిమాల్లో నటించారు. అప్పట్లో బాలీవుడ్‌లో ధర్మేంద్ర మీద ఒక గాసిప్‌ నడుస్తుండేది. హేమమాలినితో సీన్‌ చేసేటప్పుడు సీన్‌ను త్వరగా పూర్తి కానిచ్చేవాడు కాదట. హేమమాలినితో ఎక్కువ సమయం సన్నిహితంగా మెలగడం కోసం షూటింగ్‌ టైమ్‌ నిడివి పెరగడానికి రకరకాల వ్యూహాలు పన్నేవాడట. లైట్‌ బాయ్‌లకు డబ్బిచ్చి షూటింగ్‌ టైమ్‌లో లైట్‌లు ఆగిపోయేట్టు చూడమనేవాడట. ఒకే సన్నివేశాన్ని మళ్లీ మళ్లీ నటించవచ్చనేది ధర్మేంద్ర ప్లాన్‌. వీళ్లిద్దరి పెళ్లితో... నిర్మాతలకు తీసిన సీన్లనే మళ్లీ మళ్లీ తీసే ఖర్చు తప్పింది.

కంప్లీట్‌ ఉమన్‌
డాన్సర్‌గా, నటిగా కెరీర్‌ ప్రారంభించిన హేమమాలిని పెళ్లి తర్వాత తెరమరుగైపోలేదు. ఇద్దరు అమ్మాయిలకు తల్లయ్యారు, వాళ్లను డాన్సర్లుగా తీర్చిదిద్దారు. పెద్దమ్మాయి ఈషాను నటనలోకి, రెండో అమ్మాయి అహానాను డైరెక్షన్‌లోకి తీసుకువచ్చారు. కూతుళ్లతోపాటు నాట్య ప్రదర్శనలిస్తుంటారు, అక్కడ వాళ్లకు సూచనలిచ్చే పెద్దక్కలా కనిపిస్తారు. ఉత్తమ నటిగా 1972లో ఫిలింఫేర్‌ అవార్డుకు ఎంపికైన హేమ, దశాబ్దాల పాటు కెరీర్‌లో నిలదొక్కుకుని అదే ఫిలింఫేర్‌ నుంచి 2000 సంవత్సరంలో లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందుకున్నారు. అదే ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్న డ్రీమ్‌గర్ల్‌ను.. ‘పర్‌పథమ్‌ పథ్‌ సింఘానియా’ యూనివర్సిటీ  గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

ప్రచారం నుంచి పార్లమెంట్‌కి
సహనటుడు వినోద్‌ ఖన్నాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడానికి 1999లో  మైక్‌ పట్టుకున్నారు (వినోద్‌ ఖన్నా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు) హేమమాలిని. ఆ తర్వాత నాలుగేళ్లకే హేమమాలినిని పెద్దల సభలోకి స్వాగతించింది బీజేపీ. 2003 నుంచి 2009 వరకు ఆరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన హేమమాలిని 2010లో బీజేపీ జనరల్‌ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. 2014లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రజల్లోకి రావడం అదే మొదటిసారి.

మధుర నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఆర్‌ఎల్‌డి అభ్యర్థి జయంత్‌ చౌదరి మీద మూడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారామె. జయంత్‌ చౌదరి అప్పుడు సిట్టింగ్‌ ఎంపీ, ఆర్‌ఎల్‌డి (రాష్ట్రీయ లోక్‌దళ్‌) పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ కూడా. ఇప్పుడు మళ్లీ మధుర నుంచి గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు హేమమాలిని. ఈ సారి ఆమె ప్రత్యర్థి ఆర్‌ఎల్‌డి అభ్యర్థి కున్వర్‌ నరేంద్ర సింగ్‌. అతడిపై హేమ దాదాపుగా మూడు లక్షల మెజారిటీ సాధించారు. నియోజకవర్గంలో అరవై శాతం మంది తమకు ప్రతినిధిగా డ్రీమ్‌గర్లే ఉండాలని ఆకాంక్షించారు. ఈ విజయంతో ఆమె సంసద్‌ భవన్‌లోకి మూడవసారి అడుగుపెట్టనున్నారు.

ఓట్ల పంట
హేమమాలిని మార్చి 31వ తేదీన... ‘గోవర్థన క్షేత్రం నుంచి తన ఎన్నికల ప్రచారం మొదలైంద’ని ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ఆమె పోస్ట్‌ చేసిన ఫొటో సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ అయింది. గొప్ప నటి అని ఒకరు, ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఇవ్వవచ్చని ఒకరు, ఎప్పుడూ ఇలానే చేస్తే బావుణ్ను అని ఒకరు, ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఎలాంటి నాటకాలైనా వేస్తారు, అసలే నటి కదా, ఇక నటనకు ఏం తక్కువ అని ఒకరు... కామెంట్‌ చేశారు. మీడియా కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అప్పుడామె ‘‘దారిన ప్రయాణిస్తున్నప్పుడు బంగారు రంగులో మెరిసిపోతున్న పంటపొలాలు నన్ను ఆకర్షించాయి.

కోతకు సిద్ధంగా ఉంది పంట. పొలంలోకి దిగగానే పంట కోస్తున్న మహిళలు ఎదురొచ్చి ఆదరంగా స్వాగతించారు. వారి దగ్గరున్న కొడవలి అందుకుని నేనూ పంట కోసి కట్టలు కట్టాను’’ అంటూ... దీనికి పెద్దగా చర్చ అవసరం లేదని తేలిగ్గా తీసిపారేశారామె. అయితే ఎవరెన్ని రకాలుగా వ్యంగ్యాస్త్రాలు సంధించినా, మధుర మహిళలు మాత్రం బంగారు రంగు మేనిఛాయతో మెరిసిపోతూ... తమతోపాటు పొలంలో దిగి గోధుమ పంటను కోసిన డ్రీమ్‌గర్ల్‌ను ఇట్టే తమతో కలుపుకున్నారు. ఆమె గడచిన ఐదేళ్లలో లోక్‌సభలో తమ కోసం ప్రశ్నించిన సందర్భాలు చాలా తక్కువనే వాస్తవాన్ని కూడా పక్కన పెట్టి మరీ ఆమె కోసం ఓట్ల పంట పండించారు.

అందరిలో ఒకరిలా..!
హేమమాలినిలో ఆడంబరత్వం కనిపిస్తుంది కానీ.. పనిగట్టుకుని ఎప్పుడూ ఆమె ఆడంబరాలను ప్రదర్శించలేదు. కారు, ఎస్కార్టు లేకుండా ఆటోలో వెళ్లడానికి ఏ మాత్రం సంశయించరు. గత ఏడాది ఆగస్టులో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలకు హాజరయ్యారామె. ఆమెకు డ్రైవింగ్‌ హాబీ కావడంతో సొంతంగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లారప్పుడు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనంతో కిక్కిరిసి పోయి ఉన్న ఆ ప్రాంగణంలో తన కారు బయటకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో, అత్యంత సాధారణమైన మహిళలాగ రోడ్డు మీదకు వచ్చి ఆటో ఆపి ఎక్కేశారు. హేమమాలిని, ఆమెతోపాటు వచ్చిన మరో మహిళ ఇద్దరూ కలిసి ఆటోలో వెళ్లడాన్ని చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు.

కానీ ఆమెను బాగా తెలిసిన వాళ్లు మాత్రం... గతంలో కూడా ఓ సారి ఇస్కాన్‌ టెంపుల్‌కి వెళ్లాల్సిన టైమ్‌కి డ్రైవర్‌ అందుబాటులో లేకపోవడంతో, డ్రైవర్‌ కోసం ఎదురు చూడకుండా ఆమె ఆటో పిలిపించుకుని వెళ్లిపోయిన సంగతిని గుర్తు చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లేటప్పుడు కూడా మామూలు మహిళలా వెళ్లడానికే ఇష్టపడతారామె.హేమమాలినిని ‘మరీ సన్నగా ఉంద’నే కారణంతో తమిళ ఇండస్ట్రీ పక్కన పెట్టింది. ఆ సన్నదనాన్నే బాలీవుడ్‌ కోరుకుంది. హేమ 1977లో ‘డ్రీమ్‌ గర్ల్‌’ సినిమాలో నటించినప్పటి నుంచి ఆమెకా పేరు స్థిరపడిపోయింది. ఇప్పటికీ హేమ డ్రీమ్‌ గర్లే.
– వాకా మంజులారెడ్డి

వివాదాలు.. విపరీతార్థాలు
నాలుగేళ్ల కిందట 2015లో హేమమాలిని ఆగ్రా నుంచి జైపూర్‌కి వెళ్తున్నప్పుడు ఆమె మెర్సిడెస్‌ కారు ఒక ఆల్టో కారు మీదకు దూసుకుపోయింది. ఆ ప్రమాదంలో హేమమాలిని, ఆల్టోలో ఉన్న ఇద్దరు మహిళలు గాయపడ్డారు, ఆల్టోలో ఉన్న నాలుగేళ్ల పాపాయి ప్రాణాలు పోయాయి. ఆ ప్రమాదం తీవ్రమైన వివాదానికి దారి తీసింది. ఆల్టో కారును నడుపుతున్నది ఆ పాపాయి తండ్రే. అతడు ఇండికేటర్‌ వేయకుండా టర్నింగ్‌ తీసుకోవడం వల్లనే ప్రమాదం జరిగిందని హేమమాలిని అనడంతో వివాదం రాజుకుంది. ఆమెకు ప్రమాదంలో తగిలిన గాయాల కంటే ఈ వివాదగాయమే పెద్ద తలనొప్పిగా మారిందప్పట్లో.మరో వివాదం బృందావన్‌ విషయంలో ఎదురైంది. ఏ దారీ లేని వితంతువులకు బృందావన్‌ ఆశ్రయం కల్పిస్తుంది.

అయితే వెస్ట్‌బెంగాల్, బీహార్‌ నుంచి వచ్చే వితంతువులకు అనుమతి నిరాకరించాలని హేమమాలిని అనడం పెద్ద దుమారాన్నే లేపింది. దీంతోపాటు మరో వివాదం ఆమె డాన్స్‌ స్కూల్‌ తెచ్చి పెట్టింది. హేమమాలిని డాన్స్‌ స్కూల్‌ ‘నాట్య విహార కళాకేంద్ర’ ముంబయి శివార్లలోని అంధేరీ ప్రాంతంలో ఉంది. రెండువేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కోట్లాదిరూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కేవలం డెబ్బై వేల రూపాయలకే ఆమెకు కేటాయించడాన్ని తప్పు పట్టాయి ప్రతిపక్షాలు. వీటితోపాటు పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమె హాజరు తక్కువగా ఉండడం కూడా ఆమె వివరణ ఇచ్చుకోలేని గట్టి విమర్శ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement