లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. ఇదేసమయంలో ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్‌కు టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఎన్నికల పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన హేమ మాలినికి గట్టిపోటీ ఎదురుకానున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.
నటి హేమ మాలిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ఇమేజ్‌పై ఆధారపడి ముందుకు సాగుతున్నారనే మాట వినిపిస్తుంటుంది. హిందుత్వ వాదం కూడా ఆమెకు కలిసివచ్చే ఫ్యాక్టర్ అని చెబుతుంటారు. ఒకవైపు హేమమాలిని ఇండియా అలయన్స్ నుండి ఒలింపియన్ బాక్సర్ విజేందర్ సింగ్‌తో తలపడనుండగా, మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బరిలోకి దిగిన మాజీ ఐఆర్‌ఎస్ అధికారి సురేష్ సింగ్ ఆమెకు పోటీనిస్తున్నారు. దీంతో హేమ మాలినికి మధుర లోక్‌సభ ఎన్నికలు ముళ్ల బాటను తలపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.
ఈ నియోజకవర్గంలో జాట్‌ల ఓట్ల శాతం అధికం. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర భార్య అయిన హేమ మాలిని తనకు జాట్ కమ్యూనిటీ మద్దతు ఉందని గతంలో ప్రకటించారు. బాక్సర్ విజేందర్ సింగ్ హర్యానాలోని భివానీకి చెందిన ఆటగాడు. ఇప్పుడు మధురకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యారు. బీఎస్‌పీ నుంచి బరిలోకి దిగిన సురేష్ సింగ్ పదవీ విరమణ చేశాక మధురలోని ఒక విద్యా సంస్థకు అధిపతిగా ఉంటున్నారు. ఆయన పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నారు.
హేమ మాలిని మధుర, బృందావన్‌లలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆమె శ్రీ కృష్ణ భక్తురాలిగా పేరొందారు. అయితే యమునా నది శుద్దీకరణ, పారిశ్రామిక అభివృద్ధి తదితర స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ఆమె విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తుంటారు. కాగా 2014లో హేమమాలిని చేతిలో ఓడిపోయిన ఆర్‌ఎల్‌డీకి నేత జయంత్ చౌదరి ఇప్పుడు ఎన్డీఏతో పొత్తు కారణంగా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశలో ఓటింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment