సాగినంత కాలం మనంతటి వాళ్ళు మరొకరు లేరనుకోవడం సహజమే. సాగనప్పుడు కూడా సమైక్యంగా నిలిచి, సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడే సత్తా తెలుస్తుంది. రాజకీయంగా, చట్టసభల్లో సంఖ్యాపరంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ (యూపీ)లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొన్నేళ్ళుగా తిరుగు లేకుండా సాగింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలేవరకు అత్యంత పటిష్ఠంగా కనిపించిన ఆ పార్టీ రాష్ట్రశాఖలో ఒక్కసారిగా ఇప్పుడు లుకలుకలు బయటకొస్తున్నాయి. ఎదురు లేని నేతగా గుర్తింపు తెచ్చుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటలకు మొదటిసారిగా సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి.
స్వయానా ఉపముఖ్యమంత్రే గొంతు పెంచడం, మంగళవారం ఢిల్లీ వెళ్ళి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడితో సమావేశం కావడం, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా దేశ రాజధానికి చేరి పార్టీ అధ్యక్షుడితో – ప్రధానితో విడివిడిగా భేటీ అవడం... ఈ పరిణామాలన్నీ పార్టీలో అంతా సవ్యంగా లేదని తేటతెల్లం చేస్తున్నాయి. యూపీలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు త్వరలో రానున్న వేళ పార్టీలో అందరినీ మళ్ళీ ఒక్క తాటి మీదకు తీసుకురావడం ఇప్పుడు అధిష్ఠానానికి తలనొప్పిగా తయారైంది.
లక్నోలో పార్టీ రాష్ట్రశాఖ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆదివారం మాట్లాడుతూ... ఓట్ల బదలీ, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఎన్నికల్లో యూపీలో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయని యోగి వ్యాఖ్యానించారు. దాంతో ఇప్పుడీ తేనెతుట్టె కదిలింది. తర్వాత డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య ప్రసంగిస్తూ, ‘ప్రభుత్వం కన్నా పార్టీ పెద్దది. పార్టీ కన్నా ఎవరూ పెద్ద కాదు’ అనేశారు. కర్రు కాల్చి వాత పెట్టిన ఈ మాటలతో రచ్చ రాజుకుంది. ఒకప్పుడు మోదీకి శిష్యవారసుడిగా పేరుబడ్డ యోగికి ఇలాంటి పరిస్థితి ఎదురవడం చిత్రమే. అయితే, అది స్వయంకృతమే.
ఇటీవలి ఎన్నికల్లో కమలనాథులకు లోక్‌సభలో కావాల్సిన మెజారిటీ రాకపోవడానికి ప్రధాన కారణం – యూపీ నిరాశపరచడమే అన్నది బహిరంగ రహస్యం. 2019లో రాష్ట్రంలోని 80 సీట్లకు గాను 62 గెల్చుకున్న ఆ పార్టీ ఈసారి 33కే పరిమితమైంది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ – కాంగ్రెస్ కూటమి 43 గెలిచి దూసుకొచ్చింది.
చివరకు రామమందిరం నిర్మించామంటూ ఊరూవాడా గొప్పలు చెప్పుకున్నా, అయోధ్య నెలకొన్న ఫైజాబాద్‌లోనూ బీజేపీ ఓడిపోయింది. మోదీ సైతం వారణాసిలో గతంలో 4.79 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గితే, ఈసారి 1.52 లక్షల ఓట్ల తేడాతోనే బయటపడ్డారు. ఇవన్నీ యోగి ప్రతిష్ఠను దెబ్బతీసినవే. ఇప్పటి దాకా సాగిన ఆయన ఒంటెద్దుపోకడను ఇరుకునపెట్టినవే.
చివరకు మిత్రపక్షాల గొంతులు సైతం పైకి లేస్తున్నాయి. ‘బుల్‌డోజర్లు ప్రయోగిస్తే ఓట్లెలా వస్తాయి? ఉద్యోగ నియామకాల్లో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల పట్ల దుర్విచక్షణ చూపడం పెద్ద తప్పు! అసలు మొన్న లోక్‌సభ ఎన్నికల్లో మాకు బీజేపీ నుంచి సహకారం లభించనే లేదు’ – ఇలా యూపీలో మిత్రపక్ష నేతలే యోగి సర్కార్‌ను తప్పు పడుతుండడం గమనార్హం. మొత్తం మీద సొంత గూటిలో సమస్యలు పెరుగుతున్నాయనేది వాస్తవం.
రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా చేయి దాటక ముందే బీజేపీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకొని, కీలక నిర్ణయం తీసుకోవాలంటూ సాక్షాత్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే బాహాటంగా అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పదవి నుంచి యోగిని పక్కకు తప్పించవచ్చనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో మొదలైంది. దేశంలోనే అత్యంత పాపులర్ సీఎంగా నిన్న మొన్నటి సర్వేల్లోనూ ఉన్న మనిషిని పక్కనపెట్టడం పార్టీకి అంత తేలిక కాదు.
ఏమంత తెలివైన పనీ కాదు. కాకపోతే, ఇది కచ్చితంగా బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. కీలక మంత్రులతో సహా అంతా గత హయాంకు కొనసాగింపు కేంద్ర సర్కారనే భావన కల్పిస్తున్న ఆ పార్టీ... ఎన్నికల్లో ఎదురుదెబ్బకు కారణాలు లోతుగా అధ్యయనం చేసుకోకపోతే చిక్కే!
పెన్షన్ అంశం, పార్టీ కార్యకర్తల్లో పెరిగిన అసంతృప్తి, గత ఆరేళ్ళలో పదే పదే పేపర్ లీకులు, ప్రభుత్వోద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ, అగ్నివీర్ల అంశం, రాజ్‌పుత్‌ల ఆగ్రహం, రాజ్యాంగాన్ని మార్చేస్తామన్న పార్టీ నేతల ప్రకటనలు – ఇలా అనేకం యూపీలో ఎదురుగాలి వీచేలా చేశాయని పార్టీ అంతర్గత నివేదిక. మరోపక్క కరడుగట్టిన బీజేపీ భక్త ఓటరు గణం చెక్కు చెదరకున్నా – దేశాభివృద్ధికి మోదీయే దిక్కని భావించినవారు, లబ్ధిదారులు, మోదీ ఆకర్షితుల్లో తరుగుదల కాషాయధ్వజుల జోరుకు పగ్గాలు వేసినట్టు స్వతంత్ర విశ్లేషకుల మాట.
ఎవరి మాట ఏదైనా అంతా సవ్యంగా ఉంది, అసలేమీ జరగలేదన్నట్టుగా ఉష్ట్రపక్షిలా వ్యవహరిస్తే నష్టం బీజేపీకే! ఎన్నికల్లో తలబొప్పి కట్టిందని ముందు గుర్తించాలి. నిత్యం కార్యకర్తలతో చర్చిస్తూ, క్షేత్రస్థాయి స్పందన తీసుకుంటూ, నిరంతరం ఎన్నికల ధోరణిలోనే ఉంటుందని పేరున్న బీజేపీ మళ్ళీ మూలా ల్లోకి వెళ్ళాలి. మోదీ నామమే తారకమంత్రమన్న మూర్ఖత్వం మాని, కళ్ళు తెరిచి ప్రజాక్షేత్రంలోని చేదు నిజాలను విశ్లేషించాలి. పార్టీలో పరస్పర నిందారోపణల్ని మించిన మార్గమేదో అన్వేషించాలి.
ముందు రోగం కనిపెడితేనే తర్వాత సరైన మందు కొనిపెట్టగలరు. బీజేపీ అధిష్ఠానం తొందర పడాల్సింది అందుకే. ఇటీవల దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్ని కల్లో 10 స్థానాల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమే గెలిచింది. అధికారపక్ష వ్యతిరేకత కనిపించడమే కాక, బీజేపీ ఓటు షేర్ తగ్గడం ఆ పార్టీకి పారాహుషార్ హెచ్చరికే. యూపీలో తాజా విజయాలతో సమాజ్‌వాదీ – కాంగ్రెస్ కూటమి సమధికోత్సాహంతో అడుగులు వేస్తోంది. ఇప్పుడు గనక బీజేపీ దిద్దుబాటు చర్యలతో, సొంత ఇంటిని చక్కబెట్టుకోకుంటే, ప్రతిపక్షం కీలకమైన యూపీలో మరింత విస్తరిస్తుంది. అప్పుడిక కమలనాథులు ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే!
సొంతగూటి సమస్యలు!
Published Fri, Jul 19 2024 12:44 AM | Last Updated on Fri, Jul 19 2024 12:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment