సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా షాక్ ఇచ్చారు. గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి యోగి సూచించిన అభ్యర్థిని కాకుండా పదేళ్లుగా ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్న ఉపేంద్ర శుక్లాను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన ఆదిత్యనాథ్ యోగి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడంతో తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గంతోపాటు ఆయన డిప్యూటి ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఖాళీ చేసిన ఫూల్పూర్ లోక్‌సభ నియోజక వర్గానికి కూడా మార్చి 11న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
గోరఖ్‌పూర్ నుంచి స్వామి చిన్మయానంద పోటీ చేయాలని మొదట ఆదిత్యనాథ్ కోరుకున్నారు. ఫిబ్రవరి 14న ఆయన్ని గోరఖ్‌పూర్ ఆలయానికి ఆహ్వానించి అక్కడ యోగి ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. స్థానికులకే ఆ అవకాశాన్ని ఇవ్వండంటూ చిన్మయానంద స్వామి ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. అటల్ బిహారీ వాజపేయి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన స్వామి చిన్మయానంద ఉత్తరప్రదేశ్‌లోని గోండ నియోజకవర్గానికి చెందిన వారైనప్పటికీ గతంలో ఆయన మూడు వేర్వేరు లోక్‌సభ నియోజక వర్గాలకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన యోగికి ముందు గోరఖ్‌పూర్ ఆలయం ప్రధాన పూజారిగా ఉన్న అవైద్యనాథ్ శిష్యుడు. గోరఖ్‌పూర్ ఆలయ సంబంధికులెవరికీ ఇక గోరఖ్‌పూర్ లోక్‌సభ టిక్కెట్‌ను ఇవ్వరాదని అమిత్ షా నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెల్సిందేమో! పోటీ ప్రతిపాదనను చిన్మయానంద తిరస్కరించారు.
దీంతో స్వామి కమల్‌నాథ్ పేరును ఆదిత్యనాథ్ పార్టీ అధిష్టానానికి సూచించారు. యోగి లేనప్పుడు ఆయన స్థానంలో కమల్‌నాథ్ గోరఖ్‌పూర్ ఆలయం ప్రధాని పూజారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం కోసం ఆదిత్యనాథ్ ఈ నెల 18న ఢిల్లీ వచ్చి అమిత్ షాను కలసుకొని కమల్‌నాథ్ పేరును ప్రతిపాదించారు. దాన్ని తిరస్కరించిన అమిత్ షా, ఉపేంద్ర శుక్లా పేరును ప్రతిపాదించారు. అప్పుడు ఆయన పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే ఆయన ప్రతిపాదనను బలపర్చారు. ఆదిథ్యనాథ్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ శుక్లా అభ్యర్థిత్వాన్ని అమిత్ షా ఖరారు చేశారు. యోగికి సమాంతరంగా మరో అధికార కేంద్రం ఉండాలన్న ఉద్దేశంతోనే బ్రాహ్మణ నాయకుడైన శుక్లాను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గోరఖ్‌పూర్ పరిధిలోని కౌరిరామ్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి శుక్లా 2006లో పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి షీతల్ పాండే కూడా ఓడిపోయారు. అప్పటి నుంచి శుక్లా పార్టీలోనే కొనసాగినప్పటికీ ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గోరఖ్‌పూర్ ఆలయానికి సంబంధించిన వారెవ్వరినీ అభ్యర్థిగా ఎంపిక చేయకూడదని అమిత్ షా నిర్ణయించుకోవడం వల్ల అనుకోకుండా శుక్లాకు అదష్టం కలిసి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment