సాక్షి, మథుర : బీజేపీ ఎంపీ, అలనాటి బాలీవుడ్ హీరోయిన్ హేమమాలిని బిలయనీర్‌గా అవతరించారు. మథుర పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు సమయంలో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనతోపాటు, ఆమె భర్త బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తులను కూడా ఆమె ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. విలువైన బంగాళాలు, ఆభరణాలు, నగదు, షేర్లు, టర్మ్ డిపాజిట్లు అన్నీ కలిపి తన ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 101 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. గత ఐదేళ్లలో ఆమె సంపద రూ. 34.46 కోట్ల మేర పెరిగింది.
హేమమాలిని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఆమె 2014 జనరల్ ఎన్నికలకు ముందు రూ. 66 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. భర్త ధరేంద్ర ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.30 కోట్ల రూపాయలు పెరిగాయి. ఇక ఆమె విద్యార్హతల విషయానికి వస్తే.. డాన్స్‌కోసం తొమ్మిదేళ్ల వయసులోనే చదువుకు స్వస్తి పలికినా.. ఆ తరువాత మెట్రిక్ పాసవ్వడంతోపాటు ఉదయపూర్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. 2014 ఎన్నికల కంటే ముందు ఆమె 2003-2009, 2012-12 మధ్య కాలంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.
మరోవైపు మథుర నియోజవర్గం కోసం తాను చాలా చేశానని హేమమాలిని చెప్పుకొచ్చారు. దాదాపు వెయ్యి గ్రామాలున్న మథుర నియోజకవర్గ ప్రజల కోసం చాలా అభివృద్ధి పనులు చేశానన్నారు అయితే ఏమేమి పనులు చేసిందీ తనకు స్పష్టంగా గుర్తు లేదన్నారు. ఈ నేపథ్యంలో తాను ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు. అంతేకాదు తనకివే చివరి ఎన్నికలని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తాను పోటీచేయనని కూడా హేమమాలిని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment