లక్నో : జనవరి 15న ప్రారంభమై మార్చి 4న ముగిసే మహా కుంభమేళా యూపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించనుంది. ఈ చారిత్రక అతిపెద్ద ఆథ్యాత్మిక మేళా ద్వారా యూపీ సర్కార్‌కు రూ 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రముఖ పరిశ్రమ సంస్థ సీఐఐ అంచనా వేసింది. పలు రంగాలకు చెందిన ఆరు లక్షల మందికి పైగా ఈ ఉత్సవాలతో ఉపాధి లభిస్తుందని పేర్కొంది. మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం రూ 4200 కోట్లు కేటాయించి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
ఇక సీఐఐ అంచనా ప్రకారం దేశ, విదేశీ టూరిస్టుల రాకతో ఆతిథ్య రంగంలో కొత్తగా 2,50,000 మందికి, టూర్ ఆపరేటర్లుగా 45,000 మంది ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్‌లో దాదాపు 1,50,000 మందికి ఉపాధి సమకూరుతుందని, మెడికల్, ఎకో టూరిజంలో 85,000 మందికి ఉపాధి లభిస్తుందని సీఐఐ అథ్యయనం అంచనా వేసింది. వీటితో పాటు టూర్ గైడ్స్, ట్యాక్సీ డ్రైవర్లు, వాలంటీర్లు వంటి అసంఘటిత ఉద్యోగాలు పెద్దసంఖ్యలో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
కుంభమేళాకు ఆస్ర్టేలియా, బ్రిటన్, కెనడా, మలేషియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, మారిషస్, జింబాబ్వే, శ్రీలంక సహా పలు దేశాలకు చెందిన టూరిస్టులు తరలిరానున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కుంభమేళాను నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా మార్చి 4న మహాశివరాత్రి రోజున ముగిసే మహా కుంభమేళాకు దాదాపు 12 కోట్ల మంది హాజరై ప్రయాగరాజ్‌లో పవిత్ర నదీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment