
న్యూఢిల్లీ : రైల్వేస్టేషన్‌లో (New Delhi Railway Station Stampede) జరిగిన తొక్కిసలాటలో 18మంది ప్రయాణికులు మరణించారు. కుంభమేళా భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ప్రకటన, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తుల కోసం టికెట్ల అమ్మకాలు పెరగడం ఈ విషాద సంఘటనకు దారితీసిన కారణాలని ఢిల్లీ పోలీసుల విచారణలో పలు నివేదికల ప్రకారం, రైల్వే అధికారులు ప్రయాగ్‌రాజ్ కోసం ప్రతి గంటకు సుమారు 1,500 జనరల్ టిక్కెట్లను జారీ చేస్తున్నారు.
విచారణ ప్రకారం.. శనివారం రాత్రి, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైలు ఎక్కేందుకు వందల మంది ప్రయాణికులు 14 ప్లాట్‌ఫామ్‌పై ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో న్యూఢిల్లీ నుండి దర్భంగాకు నడిచే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కేందుకు పక్కనే ఉన్న ప్లాట్‌ఫామ్ 13 వద్ద ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
అయితే, స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ బయల్దేరి సమయం కంటే ఆలస్యంగా అర్ధరాత్రి బయల్దేరుతున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్‌తో ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌పైనే ఉండిపోయారు.
ఓ వైపు కిక్కరిసిన ప్రయాణికులు ఉండగా.. రైల్వే అధికారులు టికెట్ల అమ్మకాన్ని కొనసాగించారు. దీంతో అదనపు టిక్కెట్ల అమ్మకాల ఫలితంగా 14 ప్లాట్‌ఫామ్ మీద ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరగడం ప్రారంభమైంది. ఫలితంగా రద్దీ పెరిగి ప్రజలు నిలబడటానికి ఖాళీ స్థలం లేకుండా పోయింది.
అదే సమయంలో పెరుగుతున్న రద్దీ, టిక్కెట్ల అమ్మకాలను పరిగణనలోకి తీసుకున్న రైల్వే అధికారులు రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫామ్ 16 నుండి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ ప్రకటన విన్న వెంటనే, ప్లాట్‌ఫామ్ 14లో జనరల్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి దాటి ప్లాట్‌ఫామ్ 16 వైపు పరుగెత్తారు’. పరిగెత్తే సమయంలో ఓవర్ బ్రిడ్జిపై కూర్చున్న ప్రయాణీకులను తొక్కుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడే ఓ ప్రయాణికుడు అదుపుతప్పి జారిపడ్డాడు. ఇదే తొక్కిసలాటకు దారి తీసినట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. ఈ సంఘటన జరిగిన సమయంలో పాట్నాకు వెళ్తున్న మగధ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ 14పై ఉండగా, జమ్మూకు వెళ్తున్న ఉత్తర సంపర్క్ క్రాంతి ప్లాట్‌ఫారమ్ 15పై ఉంది. 14 నుండి 15 వరకు వస్తున్న ఒక ప్రయాణీకుడు జారిపడి మెట్లపై పడిపోయాడు. దీని కారణంగా తొక్కిసలాట జరిగింది. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తోంది’ అని అన్నారు. తొక్కిసలాటను అదుపులోకి తెచ్చేందుకు రైల్వే పోలీసులు భారీ మొత్తంలో మొహరించారు. కానీ జనసమూహాన్ని నియంత్రించలేకపోయారు.

ఆదివారం సైతం తొక్కిసలాటపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విషాదం జరగడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తామని తెలిపారు. ఈ తొక్కిసలాటకు దారితీసిన ప్రధాన కారణాన్ని దర్యాప్తు చేయడమే మా ప్రధాన లక్ష్యం. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్, రైల్వే అధికారులు చేసిన ప్రకటనల డేటాను సేకరిస్తాము’ అని పోలీసు వర్గాలు చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.
కాగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో 18 మంది బాధితులు మరణించారు. వారిలో తొమ్మిది మంది మహిళలు, ఐదుగురు పిల్లలు, నలుగురు పురుషులు ఉన్నారు. గాయపడిన వారు ప్రస్తుతం లోక్ నాయక్ జై ప్రకాష్ (ఎల్‌ఎన్‌జెపి) ఆసుపత్రి, లేడీ హార్డింజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment