ర్యాలీలో కార్యకర్తలకు అళగిరి అభివాదం
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు, డీఎంకే బహిష్కృత నాయకుడు అళగిరి బుధవారం తన మద్దతుదారులు, అభిమానులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. అళగిరి బల ప్రదర్శనగా పేర్కొంటున్న ఈ యాత్ర చెన్నైలో వాలాజా రోడ్ జంక్షన్ నుంచి మెరీనా బీచ్‌లోని కరుణానిధి సమాధి వరకు 1.5 కి.మీ. దూరం సాగింది. నలుపు రంగు చొక్కా, ధోవతి ధరించిన అళగిరి ఓపెన్ టాప్ వ్యానులో నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తుండగా, కరుణానిధి చిత్ర పటాల్ని చేతబట్టి, నల్ల చొక్కాలు, నెత్తిన పసుపు వర్ణం టోపీ ధరించి మద్దతుదారులు ర్యాలీలో ముందుకు సాగారు.
అళగిరి కుమారుడు దురాయ్ దయానిధి, కూతురు కాయల్విజి, సన్నిహితులు మదురై మాజీ డిప్యూటీ మేయర్ పీఎం మణ్నన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. డీఎంకే పార్టీ నుంచి ప్రముఖ నాయకులెవరూ ర్యాలీలో పాల్గొనలేదు. యాత్ర ముగిశాక అళగిరి కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ యాత్ర వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తన తండ్రికి నివాళులర్పించేందుకే ర్యాలీ చేపట్టినట్లు అళగిరి తెలిపారు. ధైర్యముంటే, యాత్రలో పాల్గొని తనకు మద్దతుతెలిపిన నాయకులు, కార్యకర్తలందరిపై వేటువేయాలని డీఎంకేకు సవాలు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment