పదవి పోయినా లెక్కచేయను
- కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు
- మంత్రి నాయిని
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మంత్రి పదవి పోయిన పర్వాలేదు, కానీ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని వీఎస్‌టీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం 8వ వార్షికోత్సవం సందర్భంగా సంఘం డైరీ, క్యాలండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు.
చంద్రబాబు లా అండ్ ఆర్డర్‌ను గవర్నర్‌కు ఇప్పించి, హైదరాబాద్ నగరాన్ని వారి గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడే పరిశ్రమల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రైవేటు ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అన్నారు. వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సామా వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, మహిళా అధ్యక్షురాలు మమతారెడ్డి , కనీస వేతన బోర్డు చైర్మన్ సదానందం గౌడ్, ఉపాధ్యక్షుడు అనిల్, పురుషోత్తం, శరత్ చందర్, గణేష్ పాల్గొన్నారు.సభకు ముందు సుందరయ్య పార్కు నుంచి వీఎస్‌టీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.