Minister Nayani Narasimha Reddy
-
ఆపదలో పోలీసులే దేవుళ్లు
సాక్షి, రంగారెడ్డి: ఆపద సమయంలో బాధితులకు పోలీసులే దేవుళ్లని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించే వారికి సత్వర న్యాయం అందించాలన్నారు. బుధవారం రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రం (ఆర్బీవీఆర్ టీఎస్పీఏ)లో శిక్షణ పూర్తి చేసుకున్న 735 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. సివిల్ 452, ఏఆర్ 283 మహిళా కానిస్టేబుళ్లు ఇక్కడ శిక్షణ పొందారు. పాసింగ్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హోంమంత్రి హాజరయ్యారు. మహిళా కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన.. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మునుపటిలా పరిస్థితులు లేవని, ప్రజల్లో చైతన్యం బాగా పెరిగిందన్నారు. చట్టానికి లోబడి గౌరవప్రదంగా విధులు నిర్వహించాలని మహిళా కానిస్టేబుళ్లకు సూచించారు. ఆపదలో పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కే మహిళలను ఒక స్త్రీగా ఓపికతో సమస్యలు తెలుసుకుని న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. దేశంలో అత్యుత్తమ పోలీస్ శిక్షణ కేంద్రాల్లో టీఎస్పీఏ ఒకటని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి పోలీస్ స్టేషన్ దేవాలయంలా కనిపిస్తుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మెరుగైన సేవలు అందిస్తే పోలీస్‌ని దేవుడిలా చూస్తారన్నారు. ప్రజలు చెల్లించిన పన్నులతోనే జీతాలు పొందుతున్న విషయాన్ని గుర్తించి.. వారిని యజమానులుగా భావించాలని సూచించారు. క్షేత్రస్థాయిలోనూ మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ అందజేశామని పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్ పేర్కొన్నారు. తొమ్మిది నెలల శిక్షణలో భాగంగా చట్టం, ఆయుధాల వాడకం, సాంకేతిక వినియోగం తదితర అంశాలపై తర్ఫీదు ఇచ్చామని వివరించారు. -
‘డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా వదిలి పెట్టం’
సూర్యపేట: ప్రస్తుతం డ్రగ్స్ కేసు చక్కర్లు కొడుతోంది. ఈ కేసులో కొంతమంది సినీ నటులకు ఎక్సెజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై హోం మంత్రి నాయిని నరసింహరెడ్డి రెడ్డి స్పందించారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సెలవుపై వెళ్లడంలో ఎటువంటి ఒత్తిడి లేదని మంత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధం ఉన్న ఎవర్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని నాయిని తెలిపారు. -
‘బాలలతో పనులు చేయిస్తే ఊరుకోం’
హైదరాబాద్: బాల కార్మిక నిర్మూలన కోసం యుద్ధం మొదలైంది. కార్మిక శాఖతో పాటు అన్ని శాఖలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఇకపై బాలలతో పనులు చేయిస్తే ఊరుకునేది లేదు. సమాచారం ఇస్తే చాలు దాడులు చేసి జైలుకు పంపుతాం.. అని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన బాలకార్మిక నిర్మూలన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లల్ని పనుల్లో పెట్టుకోవడంతో పాటు వారిని హింసిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆకస్మిక దాడులు నిర్వహించి యజమానులపై కేసులు నమోదుచేసి బాలలకు విముక్తి కలిగిస్తున్నామని చెప్పారు. అలాంటి దాడుల్లో గుర్తించిన చిన్నారులకు ప్రభుత్వమే ఉచిత విద్యనందించి వసతి కల్పిస్తుందన్నారు. -
సభ్యత్వం తీసుకుంటేనే పథకాలు
♦ ప్రకటనల కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నాం ♦ కార్మికుల వద్ద డబ్బులు తీసుకుంటే సస్పెండ్ చేయిస్తా ♦ కార్మిక శాఖ మంత్రి నాయిని హైదరాబాద్: కార్మికశాఖలో ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం 12వ వార్షికోత్స వం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయిని మాట్లాడుతూ కార్మిక శాఖ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కార్మికులకు తెలిసేందుకు ప్రకటనల రూపంలో రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. కార్మికుల కోసం పలు పథకాలను ప్రవేశపెడుతున్నామని.. తమ పిల్లల్ని బాగా చదివించాలని అన్నారు. కార్మికులు తీసుకునే సభ్యత్వంలోని నయాపైసా వృథా కాదని ఆయన హామీ ఇచ్చారు. ఎవరన్నా కార్మికులను డ బ్బులు అడిగితే తనకు చెబితే వెంటనే వారిని సస్పెండ్ చేయిస్తానని అన్నారు. కార్మికుడు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తున్నామని అనగానే... తమ దగ్గర చనిపోతే డబ్బులు ఇవ్వటం లేదని నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన నాయిని వెంటనే అందరికీ డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న సంఘాలన్నీ ఒక ఫెడరేషన్‌గా ఏర్పడితే స్థలాన్ని కేటాయించడంతో పాటు భవనాన్ని కూడా నిర్మించి ఇస్తామన్నారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఐలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ర్ట అధ్యక్షుడు పానుగంటి కాలేబు, కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, చెలిమల రాములు, ధరిపల్లి చంద్రం, లక్ష్మయ్య, కార్మిక నాయకులు రెబ్బ రామారావు పాల్గొన్నారు. -
ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి
♦ ఆరెకటికల సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా... ♦ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి యాకుత్‌పురా : రాష్ట్రంలోని ఆరె కటికల సమస్యలను పరిష్కరించి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని, ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళుతానని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గౌలిపురా ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో గౌలిపురా గాంధీబొమ్మ సమీపంలో నిర్మించిన ఆరె కటిక ఫంక్షన్ హాల్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆరె కటికలు రాజకీయంగా ఎదిగి చట్ట సభల్లో సమూచిత స్థానంకై కృషి చేయాలన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి ఆరె కటికలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి పోరాడాల్సిన అవసరముందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికి సంక్షేమ పథకాలు అందజేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చర్యలు తీసుకుంటున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో 200 మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు సైతం కల్పించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. ఆరె కటికల ఫెడరేషన్ ఏర్పాటు గురించి సీఎంతో చర్చిస్తానన్నారు. ఆరె కటిక భవనం మొదటి అంతస్తును తన ఎమ్మెల్సీ నిధుల నుంచి నిర్మిస్తానన్నారు. రెండో అంతస్తును సంఘ సేవకులు నంద కిశోర్ వ్యాస్ సహయంతో పూర్తి చేయిస్తానన్నారు. అనంతరం రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఆరె కటికలు గత కొన్నేళ్లుగా పలు సమస్యలతో సతమవుతున్నారన్నారు. వాటి పరిష్కారానికై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆరె కటికలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పాశం సురేందర్, ఆలె జితేంద్ర, శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకులు నంద కిశోర్ వ్యాస్, ఆరె కటిక సంఘం అధ్యక్షులు యు.యశ్వంత్ రావు, ప్రధాన కార్యదర్శి ఎం.రమేశ్, కోశాధికారి పి.రఘురాం, చీఫ్ అడ్వయిజర్ మహస్త్రందర్ కోయల్కర్, సలహదారులు డాక్టర్ ఎస్.విజయ్‌భాస్కర్, ప్రముఖులు జగదీష్, బిల్డర్ రమేశ్, భగీరథ్రాజ్, డి.నర్సింగ్ రావు, సీపీఐ నగర కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని, మహేందర్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్‌లను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. -
పదవి పోయినా లెక్కచేయను
- కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు - మంత్రి నాయిని సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మంత్రి పదవి పోయిన పర్వాలేదు, కానీ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం 8వ వార్షికోత్సవం సందర్భంగా సంఘం డైరీ, క్యాలండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. చంద్రబాబు లా అండ్ ఆర్డర్‌ను గవర్నర్‌కు ఇప్పించి, హైదరాబాద్ నగరాన్ని వారి గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడే పరిశ్రమల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రైవేటు ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అన్నారు. వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సామా వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, మహిళా అధ్యక్షురాలు మమతారెడ్డి , కనీస వేతన బోర్డు చైర్మన్ సదానందం గౌడ్, ఉపాధ్యక్షుడు అనిల్, పురుషోత్తం, శరత్ చందర్, గణేష్ పాల్గొన్నారు.సభకు ముందు సుందరయ్య పార్కు నుంచి వీఎస్టీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.