♦ ఆరెకటికల సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా...
♦ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి
యాకుత్‌పురా : రాష్ట్రంలోని ఆరె కటికల సమస్యలను పరిష్కరించి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని, ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళుతానని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గౌలిపురా ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో గౌలిపురా గాంధీబొమ్మ సమీపంలో నిర్మించిన ఆరె కటిక ఫంక్షన్ హాల్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆరె కటికలు రాజకీయంగా ఎదిగి చట్ట సభల్లో సమూచిత స్థానంకై కృషి చేయాలన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి ఆరె కటికలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి పోరాడాల్సిన అవసరముందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికి సంక్షేమ పథకాలు అందజేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
హైదరాబాద్ నగరంలో 200 మార్కెట్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు సైతం కల్పించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. ఆరె కటికల ఫెడరేషన్ ఏర్పాటు గురించి సీఎంతో చర్చిస్తానన్నారు. ఆరె కటిక భవనం మొదటి అంతస్తును తన ఎమ్మెల్సీ నిధుల నుంచి నిర్మిస్తానన్నారు. రెండో అంతస్తును సంఘ సేవకులు నంద కిశోర్ వ్యాస్ సహయంతో పూర్తి చేయిస్తానన్నారు. అనంతరం రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఆరె కటికలు గత కొన్నేళ్లుగా పలు సమస్యలతో సతమవుతున్నారన్నారు.
వాటి పరిష్కారానికై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆరె కటికలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పాశం సురేందర్, ఆలె జితేంద్ర, శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకులు నంద కిశోర్ వ్యాస్, ఆరె కటిక సంఘం అధ్యక్షులు యు.యశ్వంత్ రావు, ప్రధాన కార్యదర్శి ఎం.రమేశ్, కోశాధికారి పి.రఘురాం, చీఫ్ అడ్వయిజర్ మహస్త్రందర్ కోయల్‌కర్, సలహదారులు డాక్టర్ ఎస్.విజయ్‌భాస్కర్, ప్రముఖులు జగదీష్, బిల్డర్ రమేశ్, భగీరథ్‌రాజ్, డి.నర్సింగ్ రావు, సీపీఐ నగర కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని, మహేందర్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్‌లను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.
ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి
Published Thu, Apr 16 2015 1:11 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement