లాహోర్: పాకిస్తాన్‌లో రాజకీయం మరింత ముదిరింది. ఎవన్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్ కేసులో పదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఏడేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె మర్యమ్ శుక్రవారం దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లాహోర్‌లో అల్లర్లు తలెత్తకుండా పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) పార్టీకి చెందిన 300 మంది నేతలు, కార్యకర్తల్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నేడు సాయంత్రం 6.15 గంటలకు నవాజ్, ఆయన కుమార్తె మర్యమ్ బ్రిటన్ నుంచి లాహోర్‌కు చేరుకోనున్న నేపథ్యంలో వీరిద్దరిని ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) చైర్మన్ జావేద్ ఇక్బాల్ ఆదేశించారు. అరెస్టుచేసి వీరిద్దరినీ రావల్పిండిలోని అదియాలా జైలుకు తరలించాలని చూస్తున్నారు. అరెస్ట్ సందర్భంగా నగరంలో అల్లర్లు తలెత్తకుండా 10,000 మంది పోలీసుల్ని అధికారులు మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment