జునైద్ సఫ్దార్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవళ్లను లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన అపార్ట్‌మెంట్ వద్ద ఓ వ్యక్తిపై భౌతికదాడికి దిగి అతడిని గాయపరిచాడన్న కారణంగా పోలీసులు రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారు. షరీఫ్ కుమారుడికి లండన్ లోని పార్క్‌లేన్‌లో ఎవన్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్ ఉంది. ఈ అపార్ట్‌మెంట్ కేసులో పదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్, ఏడేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె మర్యమ్ శుక్రవారం దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు ఎవన్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్ వద్ద ధర్నాకు దిగి షరీఫ్ మనవళ్లు జునైద్ సఫ్దార్, జకారియా షరీఫ్‌లపై విమర్శలు చేయడంతో పాటు అసభ్యపదజాలంతో తిట్టారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ తమను విమర్శిస్తున్న ఓ వ్యక్తిని కాలర్ పట్టుకుని లాగి దాడి చేశారు. షరీఫ్ కూతురు మర్యమ్ కుమారుడు జునైద్, కాగా షరీఫ్ కుమారుడు హుస్సేన్ తనయుడు జకారియా అన్న విషయం తెలిసిందే.
బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న లండన్ పోలీసులు జునైద్, జకారియాలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు. ఓ వ్యక్తి మాపై దాడి చేసేందుకు చూడగా అతడిని అడ్డుకునేందుకు యత్నించామని, తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని షరీఫ్ మనవళ్లు పోలీసులను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment