ముల్తాన్‌లో సంబరాలు చేసుకుంటున్న షరీఫ్ ప్రత్యర్థి పార్టీల నాయకులు
ఇస్లామాబాద్: పనామా పేపర్ల కుంభకోణంలో ఓ కేసుకు సంబంధించి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఓ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు ఆయనకు 80 లక్షల పౌండ్ల (దాదాపు 73 కోట్ల రూపాయలు) జరిమానా కూడా విధిస్తూ పాకిస్తాన్‌లోని ఓ అవినీతి వ్యతిరేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పాక్‌లో ఈ నెల 25నే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్–ఎన్) పార్టీకి ఈ తీర్పు గట్టి ఎదురుదెబ్బ కానుంది.
షరీఫ్‌తోపాటు ఆయన కూతురు మరియంకు కూడా కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 20 లక్షల పౌండ్ల (దాదాపు 18 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది. విచారణకు సహకరించని కారణంగా షరీఫ్, మరియంతోపాటు ఆమె భర్త మహ్మద్ సఫ్దార్‌కు కూడా చెరో ఏడాది జైలు శిక్ష పడింది. అయితే శిక్షలన్నీ ఏకకాలంలో అమలవనున్నందున షరీఫ్ పదేళ్లు, మరియం ఏడేళ్లపాటు మాత్రమే జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇస్లామాబాద్‌లోని ఓ అకౌంటబులిటీ కోర్టు, భారీ భద్రత నడుమ రహస్యంగా ఈ తీర్పును వెలువరించింది.
అనంతరం తీర్పు వివరాలను నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) న్యాయవాది మీడియాకు వెల్లడించారు. అంతకుముందు ఈ తీర్పును వారంపాటు వాయిదా వేయాలంటూ షరీఫ్ కుటుంబసభ్యులు కోరినా న్యాయమూర్తి పట్టించుకోలేదు. గతేడాది పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పుతో పదవీచ్యుతుడిగా మారిన నవాజ్ షరీఫ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తాజా తీర్పులో ఆయన కూతురు, అల్లుడికి జైలు శిక్ష పడినందున వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయితే ఈ తీర్పుపై వారు 10 రోజుల్లోపు పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని ఎన్‌ఏబీ న్యాయవాది చెప్పారు.
అసలు కేసు ఏంటి?
పనామా పేపర్ల కుంభకోణానికి సంబంధించి షరీఫ్ కుటుంబంపై మొత్తం 3 కేసులుండగా, అవెన్‌ఫీల్డ్ కేసులో శుక్రవారం తీర్పు వెలువడింది. 1990ల్లోనూ నవాజ్ షరీప్ పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. అప్పట్లో అవినీతి సొమ్మును కూడబెట్టి లండన్‌లోని పార్క్‌లేన్‌లో ఉన్న అవెన్‌ఫీల్డ్ హౌస్ అనే భవంతిలో ఖరీదైన నాలుగు ఫ్లాట్లను షరీఫ్ కుటుంబ సభ్యులు కొన్నారు. 1993 నుంచీ ఈ ఫ్లాట్లు వారి పేరనే ఉన్నాయి. గతేడాది సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎన్‌ఏబీ ఈ కేసులో విచారణ చేపట్టింది. షరీఫ్‌తోపాటు ఆయన కొడుకులు, కూతురు, అల్లుడిని కూడా ఎన్‌ఏబీ ఈ కేసులో నిందితులుగా చేర్చింది. 9 నెలలకు పైగా విచారించిన అనంతరం కోర్టు షరీఫ్, ఆయన కూతురిని దోషులుగా తేలుస్తూ తీర్పిచ్చింది.
పాకిస్తాన్‌కు తిరిగొస్తారా?
కేన్సర్‌కు చికిత్స పొందుతున్న తన భార్యకు తోడుగా నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నారు. కోర్టు తీర్పు వెలువరించిన సమయంలో ఆయన తన కూతురితో కలసి అవెన్యూఫీల్డ్‌లోని ఫ్లాట్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు కోర్టు వీరిని దోషులుగా తేల్చి, శిక్ష విధించడంతో షరీఫ్, మరియంలు పాక్‌కు తిరిగొచ్చి జైలు శిక్షను అనుభవిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 25నే ఎన్నికలు జరగనున్నందున వారు దేశానికి తిరిగొచ్చి జైలుకు వెళితే సానుభూతితో పీఎంఎల్–ఎన్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
దొంగను కాదు.. తిరిగొస్తా: షరీఫ్
పాకిస్తాన్‌కు వలస పాలన నుంచి విముక్తి లభించినా, దేశ ప్రజలు మాత్రం ఇంకా బానిసత్వంలోనే ఉన్నారని నవాజ్ షరీఫ్ అన్నారు. తీర్పు అనంతరం ఆయన లండన్‌లో విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్‌కు ఉన్న 70 ఏళ్ల చరిత్ర గతిని తాను మార్చాలనుకున్నందుకు, ఓటుకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేసినందుకే తనకు ఈ శిక్ష పడిందని నవాజ్ షరీఫ్ అన్నారు. తానేమీ దొంగను కాదనీ, పాకిస్తాన్‌కు తెరిగి వెళ్తానని స్పష్టం చేశారు.
నిజం మాట్లాడినందుకు పాకిస్తానీలను బంధించడమనే ప్రక్రియ ఆగిపోయేంత వరకు, కొందరు ఆర్మీ జనరళ్లు, న్యాయమూర్తులు పాకిస్తానీలకు విధిస్తున్న బానిసత్వం తొలగిపోయేంత వరకు తన పోరాటం కొనసాగుతుందని షరీఫ్ పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ సోదరుడు, పీఎంఎల్–ఎన్ పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కూడా తమ వాళ్లను కోర్టు దోషులుగా తేల్చడాన్ని తిరస్కరించారు. కోర్టు నవాజ్ షరీఫ్, మరియంలను దోషులుగా తేల్చడం అన్యాయమనీ, రాజకీయ దురుద్దేశం వల్లే ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు. జూలై 25న ప్రజా న్యాయస్థానంలో తమ వాళ్లు నిర్దోషులుగా బయటకొస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment