ఇస్లామాబాద్ : తనపై వెల్లువెత్తుతోన్న అవినీతి ఆరోపణలను ఫ్లాప్ మూవీ స్టోరీలతో పోల్చారు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. పనామా పేపర్ల లీకేజీ వ్యవహారంలో పదవి కోల్పోయిన షరీఫ్ ఇటీవల 13వ సారి స్థానిక కోర్టులో విచారణకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పనామా లీకేజీలో నిందితులుగా ఉన్న షరీఫ్ కూతురు మరియం, అల్లుడు మహమ్మద్ సఫ్దార్ లు మాజీ ప్రధానితో కలిసి వచ్చి కోర్టులో హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 23కు వాయిదా వేసింది.
నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) షరీఫ్ పై నమోదైన కేసులను విచారిస్తోంది. కోర్టు విచారణ అనంతం షరీఫ్ మీడియాతో మాట్లాడారు. నాపై చేస్తున్న ఆరోపణలు 1960లో భారీ బడ్జెత్‌తో తీయగా అట్టర్ ఫ్లాప్ అయిన మూవీలా ఉన్నాయన్నారు. మూవీ ఎంత బాగోలేకున్నా హిట్ అవుతుందని చెబుతారు. కానీ రెండో వారం పరాజయాన్ని నిర్మాత, దర్శకుడు, యూనిట్ ఒప్పుకుని తీరాల్సిందే అన్నారు. తనపై చేస్తున్న తప్పుడు విమర్శలు, ఆరోపణలు మొదట విజయవంతంగా కొనసాగినా.. చివరికి వాటిలో పస లేదని తేలుతుందని ధీమా వ్యక్తం చేశారు షరీఫ్. మరోవైపు ఇస్లామాబాద్ కోర్టు షరీఫ్‌పై గతేడాది చివర్లో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
రాజకీయ ప్రత్యర్థుల పైనా షరీఫ్ నిప్పులు చెరిగారు. తమ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో రాజకీయ ప్రత్యర్థులు మా పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారు. మరో నాలుగు నెలలు వేచి చూస్తే.. సార్వత్రిక ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామంటూ సవాల్ విసిరారు. పనామా పేపర్ల లీకేజీతో పాటు పలు అక్రమాస్తుల కేసుల్లో షరీఫ్ సహా ఆయన కూతురు, అల్లుడు నిందితులు కాగా, పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment